'నాగలాదేవి' నవలలో భగీరథ రచనా శైలి, శిల్పం, అనల్పం ,                                  అసాధారణం : కె .వి .రమణ 


ఇదొక ప్రేమ కథ !

ఒక చక్రవర్తి ప్రేమ కథ. 

కుటుంబ పోషణ కోసం దేవాలయాల్లో అనుదినం నర్తించే 

అతి సామాన్యురాలి ప్రేమ కథ . 

సాహితీ సమరాంగణ సార్వభౌములు 

శ్రీకృష్ణదేవరాయల ప్రేమ కథ. 

నాట్యమయూరి హరిగంధాపురం వాసి 

అందాలరాశి నాగలాదేవి ప్రేమకథ. 

అప్పాజీ కాదన్నా ,

మంత్రులు వారించినా ,

దళపతులు వలదన్నా ,

అంతః పుర  కాంతలు అభ్యంతరం తెలిపినా ,

రాయలు , నాగలాదేవి మధ్య పల్లవించిన 

ప్రేమకు పట్టాభిషేకం ఈ కథ. 

అగ్నిసాక్షిగా  నాగలాదేవిని శ్రీకృష్ణదేవరాయలు 

పరిణయమాడిన కథ. 

భగీరథ సీనియర్ జర్నలిస్టు గా అందరికీ సుపరిచితుడు 

కవిగా, యాత్రా చరిత్ర రచనా శిల్పిగా మనందరికీ తెలుసు 

భగీరథ ఈ గ్రంథ రచనతో మంచి నవలాకారుడయ్యాడు 

విస్తుత పరిశోధనతో పాటు విపులాధ్యయనం  చేసి రచించిన నవలయిది 

శ్రీకృష్ణదేవరాయల తల్లి పేరు నాగాంబ 

చిత్తూరు జిల్లాలోని నాగలాపురం అనే గ్రామం 

హంపి నగరం సమీపంలో నిర్మించిన నాగలాపురం 

ఈ రెండు తన తల్లి నాగాంబ పేరిట రాయలు 

నిర్మించారని మనం గతంలో చదువుకున్నాము  

కానీ, ఇది నిజం కాదని భగీరథ ప్రామాణికంగా తన పరిశోధన ద్వారా తెల్పుతూ, 

తన భార్య నాగలాదేవి పేరు మీద రాయలు నిర్మియించినట్టుగా  ఈ నవలలో వెల్లడించాడు. 

వివాహానంతరం నాగలాదేవి పేరును రాయలు చిన్నాదేవిగా మార్చాడు 

తన పరిపాలనా కాలంలో ఎన్నో దేవాలయాలనుద్దరించిన రాయలు తన హృదయేశ్వరి 

నాగలాదేవి పుట్టిన ఊరు నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయాన్ని విస్తృత పరిచాడు 

తన ప్రేమ అజరామరంగా వుండాలని , నాగలాదేవిపేరు చిరస్థాయిగా ఈ భూమి మీద నిలవాలని శ్రీకృష్ణదేవరాయలు చేసిన ప్రయత్నమిది. 

రాయల రాజనీతి చరిత్ర గురించి, 

పరమత సహనం గురించి,

జైత్రయాత్ర గురించి ,

భువనవిజయం గురించి ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి. 

కానీ , రాయలు, నాగలాదేవి మధ్య జరిగిన ప్రేమ, పరిణయం,

నాగాలాదేవియే చిన్నాదేవియని,

చిన్నాదేవికే రాయలు ప్రాధాన్యత ఇచ్చాడని, ఎవ్వరూ ఇంతవరకూ వెలుగులోకి తేలేదు . 

ఈ విషయంలో చారిత్రక వివరాలు కూడా చాలామందికి తెలియదు . 

కానీ , భగీరథ తన పరిశోధన ద్వారా తాను  తెలుసుకున్న వాస్తవాలను 

దేశ చరిత్రలోని కొంగ్రొత్త కోణాలను ప్రపంచానికి తెలియ పరచాలనే సదుద్దేశ్యంతో,

కాల్పనికతతో పాటు చారిత్రిక సంఘటనలతో సమాంతరంగా నడిచే ప్రేమ కథగా 'నాగలాదేవి ' నవలను వెలువరిస్తున్నాడు.  

శ్రీకృష్ణదేవరాయలు సమర్ధుడైన పాలకుడే కాదు , 

మన జాతి గర్వించే ప్రేమికుడు కూడా. 

ఈ నాగలాదేవి నవలలో భగీరథ రచనాశైలి, శిల్పం, అనల్పం, అసాధారణం. 

భగీరథ చేయి తిరిగిన నవలా రచయితగా రూపొంది,  మున్ముందు కాలంలో మరెన్నో చారిత్రిక విశేషాలతో కూడుకున్న నవలల్ని వెలుగులోకి తేవాలని, స్ఫూర్తిమంతమైన అంశాలతో అల్లుకొన్న నవలల్ని తెలుగు జాతికి అందించాలని ఆశిస్తున్నాను. 

-డాక్టర్ కె .వి. రమణాచారి 

తెలంగాణ ప్రభుత్వ సలహాదారు .

Comments

Popular posts from this blog