నిరుపమానమైన ప్రేమసందేశం ‘నాగలాదేవి’ ఆధునిక తెలుగు సాహిత్యంలో చారిత్రక సాహిత్యం ఒక పెద్దభాగమే. అందులో చారిత్రక నవలలు ఒక అంతర్భాగం. 1872 నాటి గోపాలకృష్ణమ శెట్టి “శ్రీరంగరాజ చరిత్ర” మొదలుకొని ఇటీవలి మారుతీ పౌరోహితం ప్రణయ హంపి దాకా తెలుగు చారిత్రక నవలలది ఒక పెద్ద ప్రవాహం. ఈనవలలన్నీ సంఘసంస్కరణోద్యమ కాలం నుండి అస్తిత్వ ఉద్యమాల దాకా సామాజిక పరిణామాలకు స్పందనలుగానే వచ్చాయి. తొలినాళ్ళ చారిత్రక నవలల్లో గతస్మరణ వర్తమానానికి ప్రేరణగా వచ్చాయి. తర్వాతి కాలంలో వచ్చిన చారిత్రక నవలలు చరిత్రను హేతుబద్ధంగా వ్యాఖ్యానించేవి కొన్నైతే, ఆధునిక ప్రగతిశీల పరిణామాలను అడ్డుకుని, తిరిగి భూస్వామ్య విలువలకు పట్టం కట్టేవి మరికొన్ని. భగీరథ రచించిన నవల,” నాగలాదేవి” మొదటి రకం నవల. చారిత్రకనవలలో వస్తువు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పూర్వ, మధ్యయుగచరిత్ర, రెండు ఆధునిక యుగం పూర్వ చరిత్ర. “అడవి శాంతిశ్రీ” వంటివి మొదటి రకం కాగా ,” రేనాటి వీరుడు” వంటివి రెండవరకం. “నాగలాదేవి” మొదటి రకం నవల. ఇది మధ్యయుగం ఆఖరి దశలో శ్రీకృష్ణ దేవరాయలు (క్రీ.శ.16 శ)జీవితం వస్తువుగా వచ్చిన నవల. విజయనగరసామ్రాజ్యపాలనకు ప్రతీ...