ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 

డాక్టర్ వై .ఎస్ .ఆర్ . 

ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై .ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి. 

రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎంత సమున్నతమైనదో, ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నారో  ఈ సంఘటన తెలియజేస్తుంది . 

2004లో మే 14న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారుప్రమాణ స్వీకారం చేశారు .

అప్పుడు వారు  సోమాజిగూడలోని రాజ్‌భవన్ రోడ్డులో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ నుంచి తన అధికార  కార్యక్రమాలను నిర్వహించేవారు. 

1978లో ఫిలిం నగర్ కు అంకురార్పణ జరిగింది. 1984- 85 వరకు చిత్ర పరిశ్రమ హైద్రాబాద్లో సంపూర్ణంగా స్థిరపడింది. 


నిర్మాత, దర్శకుడు వి .బి .రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్ గా 2004 జులై 14న  'ఫిలిం నగర్ దైవ సన్నిధానం '  పేరుతో  దేవాలయం ప్రారంభమైంది. 

అక్టోబర్ మొదటి వారంలో ఈ దేవాలయ సందర్శనకు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి  రాజేంద్ర ప్రసాద్ గారితో పాటు నేను కూడా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు వెళ్ళాను. మాకు అప్పటి సమాచార శాఖ కమీషనర్ డాక్టర్ కె .వి. రమణాచారి మాకు సమయం కేటాయించారు.

ఆరోజు ఉదయం 9.00 గంటలకు మేము ముఖ్యమంత్రిని కలవడానికి లేక్ వ్యూ కు వెళ్ళాము .

డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి కోసం అప్పటికే హాల్ లో చాలా మంది వేచి వున్నారు . 

సరిగ్గా 9.30 గంటలకు మేమున్న హాల్ లోకి  రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు . అందరినీ కలసి మాట్లాడి పంపించిన తరువాత మా దగ్గరకు వచ్చారు. ప్రసాద్ గారిని చూడగానే 'మీతో కాసేపు మాట్లాడాలని , అందరినీ పింపించాను , ఎలా వున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు , మీరు నిర్మించిన సినిమాలు చూసి పెరిగాము 'అని చెప్పారు . ఆ మాటలను రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతో సంతోషించారు .

అంతేకాదు జగపతి సంస్థ నిర్మించిన సినిమాల్లోని పాటలను కూడా రాజశేఖర్ రెడ్డి గారు పాడటం విశేషం .

రాజేంద్ర ప్రసాద్ గారు శాలువాతో రాజశేఖర్ రెడ్డి గార్ని సత్కరించారు. దేవాలాయానికి వారిని ఆహ్వానిస్తూ  లెటర్ ను  నేను అందజేశాను .

అప్పుడు రమణాచారి గారిని పిలిచి 'రమణా , దేవాలయానికి వెళ్ళడానికి ఎప్పుడు వీలవుతుందో చూసి వారికి చెప్పు ' అన్నారు .

మాతో పాటు రాజశేఖర్ రెడ్డి గారు 15 నిమిషాలు వున్నారు.


అక్టోబర్ 15న  రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఫిలిం నగర్ దైవ సన్నిధానం కు విచ్చేస్తారని రమణాచారి గారు నాకు ఫోన్ చేసి ముందుగా సమాచారం ఇచ్చారు . ఈ విషయం రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పాను. 

ఇక ఆ రోజు కోసం రాజేంద్ర ప్రసాద్ గారు ఏర్పాట్లు చేస్తూ ముఖ్యమైన వారందరినీ స్వయంగా ఆహ్వానించారు . 

ఆరోజు సాయంత్రం 6.00 గంటలకు అక్కినేని నాగేశ్వర రావు గారితో సహా ఎంతో మంది నటీ నటులు , నిర్మాతలు ,దర్శకులు ,ప్రముఖులు దేవాలయానికి వచ్చారు . 

అయితే ఆరోజు ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు నక్సలైట్స్ తో ఏర్పాటు చేసిన సమావేశంలో వున్నారు . 

'ముఖ్యమంత్రి  రాజశేఖర్ రెడ్డి గారు దేవాలయానికి రాలేక పోవచ్చు , ఇక్కడ చర్చలు సీరియస్ గా సాగుతున్నాయి' అని రమణాచారి గారు నాకు ఫోన్ చేశారు . అప్పటికే దేవాలయంలో ఏర్పాట్లు జరిగాయి. ముఖ్యమంత్రి రాగానే పురోహితులు పూర్ణకుంభంతో స్వాగత చెప్పటానికి సిద్ధమైపోయారు . ఈ వార్త  రాజేంద్ర ప్రసాద్ గారికి ఎలా చెప్పను?

నేను సందేహిస్తున్నాను . అలా మరి కొంత సమయం పట్టింది .

'రమణాచారి గారికి ఫోన్ చేసి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు బయలుదేరుతున్నారో కనుక్కోండి? '  నాతో ప్రసాద్ గారు చెప్పారు .

అయితే ముఖ్యమంత్రిగారు రావడం లేదని ప్రసాద్ గారితో చెప్పలేకపోయాను .

కాసేపటి తరువాత రమణాచారి గారు ఫోన్ చేసి 'భగీరథ మేము ఎవ్వరం లోపలకు వెళ్లే అవకాశం లేదు , ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చే  సూచనలు కూడా  కనిపించడం లేదు ' అని చెప్పారు . 

ఇక రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పక తప్పదు అనిపంచింది . అయితే ఎలా చెప్పాలి ? ఏమని చెప్పాలి ?

నాలో నేనే రిహార్శల్ వేసుకుంటున్నాను . రాజేంద్ర ప్రసాద్ గారు చాలా ఉత్సాహంగా  నాగేశ్వర రావు గారితో మాట్లాడుతున్నారు .

సరే వారితో మాట్లాడిన తరువాత  చెబుదామని వేచి చూస్తున్నాను . నాకు చాలా  టెన్షన్ గా ఉంది .

రాజేంద్ర ప్రసాద్ గారు నాగేశ్వర రావు గారి దగ్గర ఉండగానే మురళీ మోహన్ పిలిచారు . రాజేంద్ర ప్రసాద్ గారు  అటువైపు వెడుతున్నారు .

నేను వారివైపు కదిలాను . ఇంతలో నా ఫోన్ మ్రోగింది . నేను పట్టించుకోలేదు . మళ్ళీ మ్రోగింది .

అప్పుడు అసహనంగా ఫోన్ ఎత్తాను . అటువైపు రమణాచారి గారు . 'భగీరథ 15 నిమిషాల్లో సార్  అక్కడ వుంటారు , రాజేంద్ర ప్రసాద్ గారిని బయట రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పు ' అన్నారు .

ఆ మాటలు నాలో సరికొత్త ఉత్సాహాన్ని కలిగించాయి. కొత్త శక్తి వచ్చింది . ఈ విషయం రాజేంద్ర ప్రసాద్ గారికి చెప్పాను .

ప్రధాన పూజారిని తన బృందంతో క్రిందకు రమ్మని ఆదేశించాను . 

ఈ లోగా పోలీసుల సైరన్లు వినిపించాయి . స్థానిక పోలీస్ అధికారులు దూసుకుంటూ వచ్చారు .

అంతటా  హడావిడీ . ఫిలిం నగర్ దైవ సన్నిధానం కళకళలాడిపోతుంది . 

కరెక్ట్ గా 15 నిమిషాల్లో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి కాన్వాయ్  దేవాలయ ప్రాంగణంలోకి వచ్చేసింది . 

ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారికి  పూర్ణకుంభంతో ఘన  స్వాగతం పలికారు . 

డాక్టర్  రాజశేఖర్ రెడ్డి గారు అరగంటకు పైగా దేవాలయంలో వున్నారు. వారికి దగ్గరుండి అన్ని దేవతామూర్తులను రాజేంద్ర ప్రసాద్ గారు చూపించి , వారికి తీర్ధ ప్రసాదాలను అందించారు . 

ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు తిరిగి వెళ్ళేటప్పుడు 'సార్ మీ కోసం చానెల్స్ వారు చూస్తున్నారు, దేవాలయం గురించి  మాట్లాదండి ' అని అడిగాను . 

ఆయన నా భుజం మీద చెయ్యి వేసి " బ్రదర్ పరిస్థితి మీకు తెలుసు కదా , అక్కడ చర్చలు వేడి వేడిగా జరుగుతున్నాయి , వారందరికీ బ్రేక్ అని చెప్పి నేను ఇలా వచ్చాను " అంటూ  వెళ్లిపోయారు . 

అదే సంవత్సరం నిర్మాత , దర్శకుడు వి .బి. రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డు ను  ప్రకటించింది . 

ఈ అవార్డును ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు రాజేంద్ర ప్రసాద్ గారికి  ప్రదానం చేశారు .

రాజశేఖర్ రెడ్డి గారు అరుదైన రాజకీయ నాయకుడు , ప్రజాసేవకుడు .

- కళారత్న భగీరథ , సీనియర్ జర్నలిస్ట్ . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు