మంచితనం, మనిషితనం మూర్తీభవించిన గుమ్మడి
శత జయంతి వేడుకలు ప్రారంభము
తెలుగు సినిమా రంగములో తనదైన ముద్ర వేసిన మానవతావాది, నిరాడంబరుడు , నిగర్వి, నిబద్ధతకాల మహా నటుడు గుమ్మడి వెనకటేశ్వర రావు. పాత్రోచితమైన నటనకు, సంభాషణలకు ఆయన మారు పేరు. మన సంస్కృతి, సంప్రదాయాలకు విలువనిచ్చే వ్యక్తిగా, సినిమా రంగంలో ఉంటూ కూడా ఆ గ్లామర్ ముసుగు లేకుండా చివరివరకు మానవతా విలువలతో జీవన ప్రస్థానం సాగించిన అరుదైన, అపూర్వమైన నటుడు గుమ్మడి వేంకటేశ్వర రావు.
సినిమా రంగంలో గుమ్మడిగా ప్రసిద్ధిచెందిన వెంకటేశ్వరరావు జూలై 9, 1927న గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని రావికంపాడు గ్రామంలో గుమ్మడి బసవయ్య, బుచ్చమ్మ దంపతులకు జన్మించారు. గుమ్మడికి ముగ్గురు తమ్ముళ్లు, ఒక చెల్లెలు ఉన్నారు. వీరిది ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబ వాతావరణంలో పెరగడం వల్ల మనుషుల మధ్య మమతానురాగాలు ఏమిటో చిన్నప్పుడే చవి చూశారు.
ప్రాధమిక విద్యను రావికంపాడులో ఉన్నత విద్యను కొల్లూరులో చదివారు. ఈ దశలోనే పుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వర రావు , మోటూరి హనుమంత రావు ఉపన్యాసాలతో ప్రభావితమై కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా చేరారు.
కమ్యూనిస్టు భావజాలం వంటపట్టించుకోవడం కుటుంబ సభ్యులకు నచ్చలేదు . 1944లో లక్ష్మి సరస్వతితో వివాహం జరిపించారు. ఆ తరువాత గుంటూరు హిందూ కళాశాలలో ఇంటర్మీడియేట్ లో చేరారు . అక్కడే జూనియర్ శ్రీరంజని కుమారుడు మల్లికార్జునరావుతో పరిచయమయ్యింది. అదే సినిమా పట్ల ఆసక్తిని ఏర్పరచింది. ఇంటర్ పాసు కాలేదు . ఇంటికి వచ్చి వ్యవసాయం చెయ్యమని తండ్రి కబురు పంపారు .
గ్రామంలో వున్నప్పుడే పుస్తకాలు చదవడం , నాటకాల పట్ల అభిమానం ఏర్పడటంతో 'వీరాభిమన్యు'అనే ఆ నాటకాన్ని స్నేహితులతో కలసి ప్రదర్శించారు. అందులో గుమ్మడి దుర్యోధనుడి పాత్రను ధరించారు. ఆ నాటకం చూసిన మాధవపెద్ది వెంకట్రామయ్య గుమ్మడిని అభినందించారు. అక్కడ నుంచి గుమ్మడికి సినిమారంగంలోకి వెళ్లాలన్న కోరిక మొదలయ్యింది .
గుమ్మడి తోడల్లుడు వట్టికూటి రామకోటేశ్వర రావు ఆంధ్రా రేడియోస్ అండ్ ఎలెక్ట్రానిక్స్ అనే షాపు తెనాలిలో పెట్టించాడు. అయితే దానిపై ద్రుష్టి పెట్టని కారణంగా వ్యాపారం నష్టాల పాలయ్యింది. అప్పటికే ఇద్దరు పిల్లలు కలిగారు. తెనాలి వచ్చిన మల్లిఖార్జునరావు గుమ్మడితో సినిమాల్లో నటించమని సలహా ఇచ్చాడు. గుమ్మడి వెంకటేశ్వరరావును తనతో పాటు మద్రాసు తీసుకు వెళ్లారు.
అయితే ఎన్ని ప్రయత్నాలు చేసిన వేషాలు రాలేదు .
ఘంటసాల బలరామయ్య తన సినిమా 'శ్రీ లక్ష్మమ్మ కథ' చిత్రంలో గుమ్మడికి అవకాశం ఇవ్వాలనుకున్నా వీలుపడలేదు . అదే సమయంలో తమిళ నిర్మాత సౌందర్ రాజన్ తెలుగులో ' అదృష్టదీపుడు' అనే సినిమానిర్మిస్తున్నారని తెలిసి , గుమ్మడి పేరు చెప్పారు . ఆయన ఆ సినిమాలో అవకాశం ఇచ్చారు . అలా ' అదృష్టదీపుడు' లో అవకాశం వచ్చింది . ఈ సినిమా 1950లో విడుదలయ్యింది.
తరువాత అదే నిర్మాత తన 'నవ్వితే నవరత్నాలు' చిత్రంలో కూడా అవకాశం ఇచ్చారు . తెనాలికి చెందిన త్రిపురనేని గోపీచంద్ తో గుమ్మడికి పరిచయం వుంది. గోపీచంద్ తన 'పేరంటాలు' చిత్రంలో గుమ్మడిని ఎంపిక చేశారు . ఆ తరువాత కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలు ధరించారు .
ఎన్.టి. రామారావు తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో నేషనల్ ఆర్ట్స్ సంస్థ ప్రారంభించి స్వంతగా 'పిచ్చిపుల్లయ్య' చిత్రంలో మంచి పాత్రలో గుమ్మడికి అవకాశం ఇచ్చాడు. ఆ వెంటనే రామారావు 'తోడు దొంగలు' చిత్రంలో తనతో సమానమైన పాత్రలో అవకాశం ఇచ్చారు. అక్కడ నుంచి గుమ్మడి సినిమా జీవితం విజయవంతంగా సాగిపోయింది .
పిచ్చి పుల్లయ్య, తోడు దొంగలు , కన్యాశుల్కం , అర్ధాంగి, జయసింహ, మిస్సమ్మ ,ఇలవేల్పు, మాయా బజార్ , ఆడ పెత్తనం, చెంచు లక్ష్మి, జయభేరి, ఇల్లరికం , పెళ్లికానుక, ఇద్దరు మిత్రులు, వెలుగు నీడలు, ఆరాధన , మా ఇంటి మహాలక్ష్మి , కులదైవం , కుల గోత్రాలు, మూగ మనసులు, పాండవ వనవాసం , అంతస్తులు, భక్త పోతన , పల్నాటి యుద్ధం, సుడిగుండాలు ,ఆత్మీయులు, బుద్దిమంతుడు, శ్రీరామ కథ, మరో ప్రపంచం, దసరా బుల్లోడు, ప్రేమ్నగర్, సంపూర్ణ రామాయణం , కాలం మారింది, జ్యోతి , నెలవంక , మరో మలుపు ,ఏకలవ్య , ఈ చరిత్ర ఏ సిరాతో?, గాజు బొమ్మలు , పెళ్ళి పుస్తకం మొదలైన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు .
1963లో "మహామంత్రి తిమ్మరుసు" చిత్రంలో గుమ్మడి నటనకు "రాష్ట్రపతిపురస్కారం" లభించింది. అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, ద్వారా ఈ అవార్డును స్వీకరించారు. అదే వేదికపై ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గుమ్మడిని ఆశీర్వదించారు .
1989లో తెలుగు విశ్వవిద్యాలయం గుమ్మడికి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది . దీని అప్పటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ప్రదానం చేశారు .
మూడు సార్లు జాతీయ సినిమా బహుమతుల కమిటీకి న్యాయనిర్ణేతగా , రెండు సార్లు నంది బహుమతుల సంఘం సభ్యునిగా, రెండు సార్లు నంది బహుమతుల సంఘం అధ్యక్షునిగా పనిచేశాడు. ఎన్టిఆర్ అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు న్యాయ నిర్ణేతగా కూడా గుమ్మడి పనిచేశారు .
గుమ్మడి వెంకటేశ్వరరావు తన 83 ఏళ్ల జీవితంలో 60 సంవత్సరాలు సినిమాకే అంకితం చేసిన గొప్ప నటుడు. తనదైన విలక్షణ శైలిలో సంభాషణలు పలకడం, ముఖంలో హావభావాలను ప్రదర్శించడం ఆయన ప్రత్యేకత.
గుమ్మడికి ఎన్ .టి .రామారావు అంటే చాలా అభిమానం , తొలి రోజుల్లో ప్రోత్సహించారని, తనను సోదరుడిగా భావించేవారని , ఆ కుటుంబంలో ఆత్మీయమైన అనుబంధం ఉండేది. అయితే ఒకసారి ఎవరో చెప్పిన మాటలు నమ్మి రామారావు గారు గుమ్మడిని దూరంగా పెట్టి , తన సినిమాల్లో గుమ్మడి బదులు వేరే నటులను ఎంపిక చేయించేవారు . అలా ఇద్దరి మధ్య దూరం పెరిగింది .
అయితే గుమ్మడి భార్య శ్రీమతి లక్ష్మి సరస్వతి , రామారావు భార్య శ్రీమతి బసవర్మ తారకం స్నేహానికి మాత్రం ఈ విభేదాలు అడ్డుకాలేదు .
గుమ్మడి సినిమా రంగంలో ముగ్గురిని బాగా అభిమానించేవారు , ఎన్ .టి .రామారావు , అక్కినేని నాగేశ్వర రావు , డాక్టర్ సి .నారాయణ రెడ్డి . నేరెళ్ల వేణు మాధవ్ తో ఎప్పుడు అవకాశం దొరికినా సమావేశమవుతూ ఉండేవారు .
గుమ్మడి వేంకటేశ్వర రావు , లక్ష్మీ సరస్వతిది అన్యోన్య దాపత్యం . చిన్నప్పుడే వీరి వివాహం జరగడంతో భార్యను చిట్టీ అని పిలిచేవారు .
ఈ దంపతులకు అయిదుగురు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు.
గుమ్మడి అమెరికా, రష్యా , జపాన్ ,మలేషియా , సింగపూర్ మొదలైన దేశాలు పర్యటించారు .
1975లో తెలుగు సినీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు తొలి అధ్యక్షుడుగా ఎంపికయ్యారు . అదే సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ లో నిర్వహించిన తెలుగు మహా సభలకు సినిమా రంగం నుంచి సహకారాన్ని అందించారు. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు , విద్యాశాఖ మంత్రి మండలి కృష్ణారావు గుమ్మడి సేవలను ప్రశంసించారు .
గుమ్మడి తన పిల్లలందరికీ వివాహం జరిపించారు . మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చి తన శ్రీమతి తో హాయిగా గడపాలనుకున్నారు . అయితే లక్ష్మి సరస్వతి మద్రాసులోనే మరణించారు .
ఒక్కడే హైదరాబాద్ వచ్చిన గుమ్మడి మారిన పరిస్థితుల కారణంగా సినిమాల్లో నటించడం తగ్గించారు .
2007లో తన 80వ పుట్టిన రోజు వేడుకలను కుటుంబ సభ్యులు , ఆత్మీయుల మధ్య హైదరాబాద్ లో జరుపుకున్నారు .
2010, జనవరి 26 న తన 82 సంవత్సరాల వయసులో గుమ్మడి వెంకటేశ్వర రావు తుది శ్వాస విడిచారు.
నటుడుగా గుమ్మడిది తెలుగు తెరపై చెరిగిపోని సంతకం .







కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి