ఈరోజు వేటూరి సుందర రామమూర్తి గారి వర్ధంతి
వేటూరి వారు మన మధ్య లేకపోయినా వారి పాట తెలుగు సినిమా పూతోటలో ఎప్పటికీ మరిమళిస్తూనే ఉంటుంది.
జర్నలిస్టుగా జీవితాన్ని మొదలు పెట్టి ఆ తరువాత సినిమా పాటల రచయితగా అటు క్లాస్ ఇటు మాస్ ను మెప్పించిన
మహాకవి వేటూరి .సుందర రామమూర్తి .
వేటూరి గారిని తలచుకోగానే 25 సంవత్సరాల నాటి ఓ మధురమైన సంఘటన గుర్తుకొస్తుంది .
1996లో మిత్రులు ప్రసాద్ రెడ్డి, అంజి రెడ్డి నిర్మాతలుగా నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నిర్మించిన "ప్రియమైన శ్రీవారు " సినిమాకు
వేటూరి గారితో ఓ పాట వ్రాయిద్దామని మిత్రుడు , సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ నాతో చెప్పాడు . తప్పకుండా వ్రాయిద్దాం అని చెప్పాను . ఈ సినిమాలో ఓ నేపధ్య గీతం ఉంది . ఈ పాట అయితే బాగుంటుందని మా ఇద్దరికీ అనిపించింది .
వేటూరి గారి ఇంటికి వెళ్లి పాట సన్నివేశం వివరించాము . వారం రోజుల తరువాత పాట సిద్ధమైంది . వేటూరి వారి ఇంటికి పాట కోసం నేను వెళ్ళాను . ఆయన పాట రెడీ అయ్యిందని చెప్పారు . ఓసారి పాట వినిపించారు . చాలా బాగుంది అని చెప్పాను .
" ఈ గీతాన్ని ఎవరితో పాడించాలని అనుకుంటున్నారు ?' అని అడిగారు .
"ఇప్పటికే రెండు పాటలు బాలు గారు పాడారు" అని చెప్పాను .
"ఈ పాట ను మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పాడించగలరా ? " అన్నారు .
"మంగళంపల్లి వారు ఇప్పుడు సినిమాలకు పాడటం లేదుగా " అన్నాను .
"మీరు జర్నలిస్ట్ కదా ప్రయత్నిచండి , మంగళంపల్లి నా అభిమాన గాయకుడు " అని నా వైపు చూశారు .
" తప్పకుండా సార్ " అని చెప్పాను .
"మీతో పాటు మంగళంపల్లి ఇంటికి నేను కూడా వస్తాను , మీరు అపాయింట్మెంట్ తీసుకోండి " అని చెప్పారు.
అలాగే అని నేను చెప్పాను . ఈ విషయం వందేమాతరం కు చెప్పగానే చాలా సంతోషపడ్డాడు .
"గురూజీ మీరు ప్రయత్నం చేస్తే ఒప్పుకుంటారు " అన్నాడు . "అలాగే శ్రీను " అని చెప్పాను .
రెండు రోజుల తరువాత మంగళంపల్లి వారితో మాట్లాడాను . వారు నన్ను గుర్తు పట్టి ఇంటికి రమ్మని చెప్పారు .
నేను హైదరాబాద్ ఫిలిం క్రిటిక్స్ కార్యదర్శి గా వున్నపుడు ఒక సమావేశానికి మంగళంపల్లి వారిని ఆహ్వానించాము . మా జర్నలిస్టు మిత్రులతో రెండు గంటల పాటు తన అనుభవాలను పంచుకున్నారు .
అలా ఆ పరిచయం ఇప్పుడు ఉపయోగపడింది .
తరువాత రోజు వేటూరిగారు , వందేమాతరం , ప్రసాద్ రెడ్డి ,నేను , మా మద్రాస్ ప్రొడక్షన్ మేనేజర్ మురళి సాయంత్రం ఆరు గంటలకు వారి ఇంటికి వెళ్ళాం . కారు దిగుతూ ఉండగానే పెద్ద వర్షం .
మా అందరినీ సాదరంగా ఆహ్వానించి మంచి కాఫీ తెప్పించారు . ఆ చలిలో కాఫీ తాగగానే ఉత్సాహం వచ్చింది .
రెండు గంటల పాటు మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారితో గడిపాము . బాలమురళి గారు ఒప్పుకున్నారు .
ఆ మరుసటి రోజు మంగళంపల్లి వారు వాహిని స్టూడియోస్ కు వచ్చారు. పాట రికార్డింగ్ తరువాత తీసిన ఫోటో ఇది .
అలా వేటూరి సుందర రామమూర్తి గారి కోరిక , వందేమాతరం శ్రీనివాస్ జీవితంలో మర్చిపోలేని పాట ఇది .
ఇక బాలమురళి కృష్ణ గారు ప్రియమైన శ్రీవారు సినిమాలో పాడిన ఆ పాట .
"జాతకాలు కలసే వేళ జీవితాలు ముగిశాయి " ఆమని ,సుమన్ తదితరులమీద చిత్రీకరించిన గీతం
Comments
Post a Comment