
నా సాహిత్య జీవితానికి మహాకవి శ్రీ శ్రీ స్ఫూర్తి ఈరోజు మహాకవి శ్రీరంగం శ్రీనివాస రావు 114వ జయంతి. తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీ శ్రీ ఒక ఉత్తుంగ తరంగం. ఒక పెను తుఫాను. యువతను తన 'మహాప్రస్థానం 'తో మేల్కొల్పిన సాహితీ ధృవతార. అంతవరకు ఛందస్సు ప్రధానంగా సాగుతున్న కవిత్వాన్ని వచనం వైపు మళ్లించిన విప్లవ కవి శ్రీశ్రీ . 'ఈ యుగం నాది' అని సగర్వంగా చాటిన అభ్యుదయ కవి శ్రీ శ్రీ . శ్రీశ్రీ పేరు వినగానే నా మనసు పులకరించి పరవశిస్తుంది . నా సాహితీ జీవితానికి పునాది వేసిన మానవతావాది శ్రీశ్రీ. 1971లో ఇంటర్ చదివే రోజుల నుంచే నేను శ్రీశ్రీ కవిత్వం చదవడం మొదలు పెట్టాను. ముఖ్యంగా ఆయన వ్రాసిన 'మహాప్రస్థానం' నన్ను బాగా ఆకట్టుకుంది . ఆ పుస్తకం ఎన్ని సార్లు చదివానో చెప్పలేను . ఆ స్పూర్తితో కవిత్వం వ్రాయడం ఆరంభమైంది . అలా రాసే కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితం కావడంతో మరింత ఉత్సాహంతో రాసేవాడిని. హైదరాబాద్ ఆకాశవాణిలో కూడా నా కవితలు ప్రసారం అయ్యేవి. ఇంటర్మీడియట్ ల...