నా సాహిత్య జీవితానికి మహాకవి శ్రీ శ్రీ స్ఫూర్తి 

ఈరోజు మహాకవి శ్రీరంగం శ్రీనివాస రావు 114వ జయంతి. 

తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీ శ్రీ ఒక ఉత్తుంగ  తరంగం. ఒక పెను తుఫాను. యువతను  తన 'మహాప్రస్థానం 'తో  మేల్కొల్పిన సాహితీ  ధృవతార.  

అంతవరకు ఛందస్సు ప్రధానంగా సాగుతున్న కవిత్వాన్ని వచనం వైపు మళ్లించిన విప్లవ  కవి శ్రీశ్రీ . 'ఈ యుగం నాది' అని సగర్వంగా చాటిన అభ్యుదయ కవి శ్రీ శ్రీ .  

శ్రీశ్రీ పేరు వినగానే నా మనసు పులకరించి పరవశిస్తుంది .  నా సాహితీ జీవితానికి పునాది వేసిన మానవతావాది శ్రీశ్రీ. 

 1971లో ఇంటర్ చదివే రోజుల నుంచే నేను  శ్రీశ్రీ కవిత్వం చదవడం మొదలు పెట్టాను.  ముఖ్యంగా ఆయన వ్రాసిన 'మహాప్రస్థానం' నన్ను బాగా ఆకట్టుకుంది . ఆ పుస్తకం ఎన్ని సార్లు చదివానో చెప్పలేను . ఆ స్పూర్తితో  కవిత్వం వ్రాయడం ఆరంభమైంది . 

అలా రాసే కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితం కావడంతో  మరింత ఉత్సాహంతో రాసేవాడిని. హైదరాబాద్ ఆకాశవాణిలో కూడా  నా  కవితలు ప్రసారం అయ్యేవి.   ఇంటర్మీడియట్ లో మా గురువు ఆచార్య తిరుమల  కవితలను ఓ పుస్తకంగా వెయ్యమని సలహా ఇచ్చాడు. 

నాకు కూడా  ఆ ఆలోచన నచ్చింది . 

1979 నేను ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడే 'జ్యోతి చిత్ర ' సినిమా వారపత్రిక కు హైదరాబాద్ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. 



అదే సమయంలో నా కవితలను 'మానవత ' పేరుతో పుస్తకం వెయ్యాలని నిర్ణయించుకున్నాను . అప్పట్లో నాకు పరిచయం వున్న హైకోర్టు న్యాయవాది అడుసుమిల్లి పాండురంగారావు గారు ఆ పుస్తకాన్ని తాను  ప్రచురిస్తానని హామీ ఇచ్చారు . 'అయితే మానవతను మీకే అంకితం ఇస్తానని' చెప్పాను . 

పాండురంగారావు గారికి నిర్మాత దర్శకుడు యు . విశ్వేశ్వరరావు బంధువు. ఆ విషయం తెలిసి విశ్వేశ్వర రావు రావు గారికి శ్రీశ్రీ గారు బాగా తెలుసు కాబట్టి మానవతకు శ్రీశ్రీ గారితో ముందు మాట వ్రాయించమని చెప్పాను . 

అదేరోజు పాండురంగారావు గారు విశ్వేశ్వర రావు గారితో ఫోన్ లో మాట్లాడారు . ఆయన మానవత పుస్తక కాపీ పంపించమన్నారు . 

మద్రాసులో వున్నవిశ్వేశ్వరావు గారికి పోస్టులో మానవత కవితా  సంపుటి కాపీ పంపించాను .   

సరిగ్గా  అప్పుడే విశ్వేశ్వర రావు గారు దర్శకత్వం వహించిన 'నగ్న సత్యం ' సినిమా 28 ఏప్రిల్ 1979లో విడుదలైంది.  ఈ సినిమా విడుదల సందర్భంగా విశ్వేశ్వర రావు గారు   హైదరాబాద్ వచ్చారు . విశ్వేశ్వర రావు గారు బషీర్ బాగ్ లో వున్న పాండురంగారావు గారి ఇంటికి వచ్చి నాకు ఫోన్ చేశారు. నేను విశ్వేశ్వర రావు గారిని కలవగానే శ్రీశ్రీ గారు వ్రాసిన ముందు మాట అందించారు . అది చూసిన  నా సంతోషానికి అవధులు లేవు . 


నగ్న సత్యం సినిమా విడుదలైంది కాబట్టి తాను శ్రీ శ్రీ గారు , నిర్మాత, దర్శకుడు పి .పుల్లయ్య గారు, పాండు  రంగారావు  గారు , దర్శకుడు కె .బి .తిలక్ , నటి కృష్ణవేణి ఆంధ్ర ప్రదేశ్ పర్యటనకు వెడుతున్నామని , జ్యోతి చిత్ర రిపోర్టర్ గా మీరు కూడా మాతో రండి అని ఆయన ఆయన ఆహ్వానించారు . 

నిజంగా అది మహదావకాశం . మహాకవి శ్రీ శ్రీ , పుల్లయ్య , తిలక్ , విశ్వేశ్వర గారితో పాటు నాలుగు రోజులు కలసి వుండే అవకాశం . థాంక్ యు సార్,  నేను కూడా మీతో వస్తాను అని చెప్పాను.  

అదే రోజు నేను,  నగ్న సత్యం సినిమా టీమ్ తో పర్యటనకు వెడుతున్నానని విజయవాడ ఆఫీసుకు మెసేజ్ ఇచ్చాను . శ్రీశ్రీ గారు వ్రాసిన ముందు మాట ప్రింటింగ్ కు ఇచ్చాను . 

శ్రీ శ్రీ గారు , పుల్లయ్య గారితో పాటు నేను ఒక కారులో ప్రయాణించాను . ఆ సందర్భంగా మహాకవితో ఎన్నో విషయాలు మాట్లాడే అవకాశం కలిగింది . 

ఆ పర్యటన సందర్భంగా విశ్వేశ్వర రావు గారు నా 'మానవత' విడుదల గురించి అడిగారు . మహాకవి తో ముందు మాట వ్రాయించినందుకు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను అని చెప్పాను. 'అయితే నా మనసులో మరో  కోరిక ఉంది' అన్నాను 

'చెప్పండి'  అన్నారు . 

'నా పుస్తకావిష్కరణ సభలో మీరు ,శ్రీ శ్రీ గారు పాల్గొనాలని ... ' అంటూ ఆయనవైపు చూశాను . 

'తప్పకుండా , పుస్తకావిష్కరణ సభ ఎప్పుడు ఉంటుంది ?' అని అడిగారు . 

'మీరు ఎప్పుడంటే అప్పుడు 'అన్నాను . 

అయితే బాస్ (శ్రీ శ్రీ ని విశ్వేశ్వరరావు గారు బాస్  అని పిలుస్తారు ) ని అడిగి చెబుతాను అన్నారు . 

అదేరోజు రాత్రి శ్రీ శ్రీ గారు , పుల్లయ్య గారు , పాడురంగారావు గారు వున్నప్పుడు విశ్వేశ్వరరావు గారు ఈ ప్రస్తావన తీసుకు వచ్చారు. 

'మీరు ఎప్పుడంటే అప్పుడే ' అని శ్రీ శ్రీ గారు , పుల్లయ్య గారు చెప్పారు . 

'అయితే జూన్ 1వ తేదీ పెట్టుకోండి ' అని విశ్వేశ్వరావు గారు చెప్పారు . 


అలా మానవతా ఆవిష్కరణ కు ముహూర్తం కుదిరింది . 

హైదరాబాద్ వచ్చాక పాండురంగారావు గారు ఆనాటి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివ రావు గారితో మాట్లాడి వారిని సభాధ్యక్షుడిగా ఒప్పించారు .  గురువు ఆచార్య తిరుమల గారు, జర్నలిస్ట్ జి .ఎస్ వరదా చారి గారిని నేను మాట్లాడాను. కార్యక్రమాన్ని నిర్వహించడానికి కిన్నెర రఘురాం ముందుకు వచ్చారు . 

 జూన్ 1, 1980న హైదరాబాద్ అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో నేను రచించిన "మానవత" కవితా పుస్తకానికి మహాకవి శ్రీ శ్రీ గారు  ముందు మాట వ్రాయడమే కాక  మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చారు ఆవిష్కరించడానికి .  అయితే విరసం వారు ఆ  సభలో పాల్గొనవద్దని శ్రీ శ్రీ గారిని అడ్డగించారు . అప్పట్లో డి .జి .పి గా వున్న ఎం .వి .నారాయణ  రావు గారు కిన్నెర సంస్థకు అధ్యక్షులు. ఎంతో మంది నక్షలైట్లు చనిపోడానికి కారకులైన నారాయణ రావు గారు అధ్యక్షులుగా వున్న కిన్నెర సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనకూడదని వారు శ్రీ శ్రీని అడ్డగించారు  . అప్పుడు శ్రీ శ్రీ గారు విరసం అధ్యక్షులు . 

అయితే తాను ఈ పుస్తకావిష్కరణ సభ కోసం మద్రాసు నుంచి వచ్చానని ,  ప్రస్తుతం తనకు ఇదే ముఖ్యమని చెప్పి   సభకువచ్చి 'మానవత ' కవితా సంపుటిని  ఆవిష్కరించి నన్ను ఆశీర్వదించారు . . 

విశ్వేశ్వర రావు గారు మద్రాసు నుంచి వచ్చేటప్పుడు విమానంలో ఇచ్చిన హిందూ దిన పత్రికను తనతో పాటు తీసుకవచ్చారు . 

ఆయన ప్రసంగించడానికి ముందు హిందూ దినపత్రికను చూపించి అందులో ఓ ప్రకటన చదివి వినిపించారు . 

అందులో' Bhageeradha,  He Brought the ganga down to earth to purify the souls of sinners' అని వ్రాసి వుంది . ఇదే రోజు నేను వ్రాసిన మానవత కవితా పుస్తకం ఆవిష్కరించడం గురించి విశ్వేశ్వర రావు ప్రస్తావించి "మానవత "తో ఈ భగీరధుడు  సాహిత్య ప్రపంచంలో అడుగుపెడుతున్నారు అని వారు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. 

ఇక ఈ సభలో ఆనాటి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివ రావు గారు, ఆచార్య తిరుమల గారు, జి .ఎస్ వరదా చారి గారు, హై కోర్టు న్యాయవాది అడుసుమిల్లి పాండురంగారావు గారు , నిర్మాత దర్శకులు పి . పుల్లయ్య గారు, ఆవుల మంజులత , జర్నలిస్టులు , రచయితలు  పాల్గొన్నారు . 

ఆ సభ అనంతరం నిర్మాత,దర్శకుడు పి .పుల్లయ్య గారు నన్నుతన దగ్గరకు రమ్మన్నారు . 

నా తలపై చేయి పెట్టి ' ఒరేయ్ అబ్బాయి , మహాకవి శ్రీ శ్రీ గారిని  మద్రాసు నుంచి హైదరాబాద్ రప్పించి , నీ మొదటి కవితా సంపుటిని ఆవిష్కరింపజేశావు , నువ్వు సామాన్యుడవు కాదు , నీకు చాలా మంచి భవిష్యత్తు వుంది ' అని ఆశీర్వదించారు . 

అప్పుడు మా పెద్దన్నయ్య కోటేశ్వర రావు అక్కడే వున్నాడు , అండకు ముందే ఆయన్ని శ్రీశ్రీ గారికి పరిచయం చేశాను . 

పుల్లయ్య గారి మాటలు వినగానే ఆయన కళ్ళు ఆనందంతో  వర్షించాయి . 

'నీ జీవితంలో మహా కవి  శ్రీశ్రీ గారితో మాట్లాడలేవు' అని అన్నయ్య నాతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి . 

ఆ మరుసటి రోజు ప్రముఖ దిన పత్రికల మొదటి పేజీల్లో 'శ్రీ శ్రీఘెరావ్ ' అనే వార్త వచ్చింది . అదొక సంచలనంగా చెప్పుకున్నారు . 

44 సంవత్సరాల క్రితం నాటి మధుర స్మృతి . 1980లో  నా మొదటి పుస్తకం 'మానవత ' నుమహాకవి  శ్రీ శ్రీ ఆవిష్కరించడం నా సాహిత్య జీవితానికి గొప్ప పునాది వేసింది . 

Comments

Popular posts from this blog