24-04-1986 నాటి జ్ఞాపక చిత్రమ్ 

35 సంవత్సరాల  నాటి  మధుర స్మృతి . అప్పుడు నేను ఆంధ్ర జ్యోతి  నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక కు హైద్రాబాదు లో  రిపోర్టర్ గా ఉండేవాడిని. సినిమా వారితో ఆత్మీయమైన సంబంధాలు ఉండేవి. సినిమాకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగిన జర్నలిస్టులు తప్పనిసరిగా పాల్గొనేవారు . అప్పట్లో జర్నలిస్టుల మీద ఆంక్షలు ఉండేవి కాదు . అందరూ చాలా ఆత్మీయంగా పలకరించేవారు . చాలా సరదాగా ఉండేది . 

నిజాం ప్రాంతంలో వున్న పంపిణీదారులంటే  నిర్మాతలు , దర్శకులు , హీరోలు ఎంతో అభిమానంగా ఉండేవారు . సినిమా విడుదల లో పంపిణీదారులే కీలక బాధ్యత వహించేవారు . పంపిణీ సంస్థలన్నీ సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్డులో ఉండేవి. అన్ని పంపిణీ సంస్థల అధినేతలతో నాకు స్నేహ సంబంధాలు ఉండేవి. నెలకొకసారైనా పంపిణీ సంస్థల వార్తలు రాస్తూవుండేవాడిని . అందుకే నన్ను అందరూ అభిమానించేవారు . లక్షి చిత్ర యలమంచిలి హరికృష్ణ గారు , శ్రీనివాస ఫిలిమ్స్ అడుసుమిల్లి  సాంబశివ రావు గారు అయితే కుటుంబ సభ్యుడుగా  భావించేవారు . అప్పట్లో సినిమాల శత దినోత్సవాలు ఎక్కువగా మద్రాసులో జరిగేవి . అప్పుడు హైదరాబాద్ పంపిణీదారులు జర్నలిస్టులను తప్పకుండా మద్రాసు ఆహ్వానించేవారు . 

శోభన్ బాబు , విజయ శాంతి , సుహాసినితో కామాక్షి కమర్షియల్స్  డి .శివప్రసాద రెడ్డి  గారు కోదండరామి రెడ్డి  గారి దర్శకత్వంలో రూపొందించిన "శ్రావణ సంధ్య  " సినిమా 1986 జనవరి 9న విడుదలై విజయవంతంగా 100 రోజులు ఆడింది . ఈ సినిమా  100 రోజుల వేడుక మద్రాసులో  జరిగినప్పుడు శ్రీనివాస ఫిలిమ్స్  సాంబశివ రావు గారు హైదరాబాద్ నుంచి జర్నలిస్టులను తన తో పాటు మద్రాస్ తీసుకెళ్లారు . సాంబశివరావు గారు సౌమ్యుడు , స్నేహశీలి . అందరితో చాలా ఆత్మీయంగా ఉండేవారు .  

23 ఏప్రిల్ న బయలుదేరి 24 ఉదయం మద్రాస్ చేరాము . అదే రోజు సాయంత్రం "శ్రావణ సంధ్య  "  సినిమా శతదినోత్సవం. ఉదయం  మేము రెడీ అయిన  తరువాత సాంబశివ రావు గారు మమ్మల్ని విజయా  వాహినీ స్టూడియోస్ కు తీసుకెళ్లారు . అక్కడ శోభన్ బాబు నటిస్తున్న  చిత్రం షూటింగ్ జరుగుతోంది . శోభన్ బాబు గారితో కాసేపు మాట్లాడాక, దర్శకుడు విజయ బాపినీడు గారు దర్శకత్వం మరో చిత్రం షూటింగ్ దగ్గరకు తీసుకెళ్లారు  మేము  కాసేపు మాట్లాడాము . ఆ తరువాత విజయ బాపినీడు గారు ఒక అరగంట ముందు షూటింగ్ కు బ్రేక్ చెప్పి మమ్మల్ని మేకప్ రూములో కి ఆహ్వానించారు. నాతో పాటు ఆంజనేయ శాస్త్రి , కేశవ రావు, వెంకట రావు, నారాయణ రావు వున్నారు . అప్పుడు సాంబశివ రావు గారి మేనల్లుడు చౌదరి కూడా మాతో వచ్చారు . చౌదరి గారు ఇప్పుడు చాలా పెద్ద చార్టెడ్ అకౌంటెంట్ .అదేరోజు రాత్రి "శ్రావణ సంధ్య  "  సినిమా 100 రోజుల పండుగ చాలా వైభవంగా జరిగింది .  

శోభన్ బాబు గారు , విజయ బాపినీడుగారు  , సాంబశివరావు గారు మన మధ్యలో లేరు . కానీ వారి ఆత్మీయత, ఆనాటి జ్ఞాపకాలు ఇప్పటికీ స్మృతి పథంలో వున్నాయి .

Comments

Popular posts from this blog