చంద్ర మృతి వార్త బాధించింది 

ఈ వార్త నన్ను బాగా కలవర పెట్టింది  గత కొంత కాలంగా ఆయన ఆరోగ్య బాగాలేదని విన్నాను . కానీ ఇంతలోనే ఇలా కరోనాతో వెళ్ళిపోతాడని అనుకోలేదు . 

కరోనా  కథలు , కన్నీటి వ్యధలు వింటుంటే మనసు మౌనంగా రోదిస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మరణ వార్తలు బాధిస్తూనే ఉంటున్నాయి . చంద్ర కూడా ఈ కరోనాకు బలై పోతాడని అనుకోలేదు . 

చంద్ర కేవలం ఆర్టిస్టు మాత్రమే కాదు , కధకుడు , నటుడు , కళా దర్శకుడు , అన్నింటికీ మించి మంచి మిత్రుడు . 

డెబ్బయ్యవ దశకం  నుంచి  చంద్ర వైభవం చూశాను . అప్పట్లో చాలామంది వర్ధమాన ఆర్టిస్టులకు చంద్ర గొప్ప  ప్రేరణ . 

చంద్ర తో నాకు 1975 నుంచి పరిచయం . చంద్ర ను మొదట పరిచయం చేసింది మా అన్నయ్య కోటేశ్వర రావు . 

అప్పట్లో చంద్ర  నారాయణ గూడలో ఉండేవారు . చిక్కడపల్లి నుంచి కాచిగూడా వెళ్లే మార్గంలో దీపక్ థియేటర్ దాటిన

తరువాత ఎడమ వైపు వచ్చే  చిన్న వీధి లో కొంచెం ముందు కెళ్లిన తరువాత  ఓ  ఇంట్లో  ఉండేవారు.. ఆ ఇల్లు ప్రసిద్ధ రచయిత త్రిపురనేని గోపీ చంద్ గారిది . ఆ ఇంట్లో సాయిచంద్ తో పాటు చంద్ర ఉండేవారు . 1980 ఆ ప్రాంతంలో అదే వీధిలో ఎడమ వైపు చివరి ఇంటికి మారారు. చంద్ర  వుండే ఇంటి కిటికీ నుంచి చూస్తే రాజబహదూర్ వెంకట్రామా రెడ్డి  మహిళా కళాశాల విద్యార్థులు కనిపించేవారు. అందుకే చంద్ర అమ్మాయిల బొమ్మలు అంత నాజూకుగా గీసేవారని అప్పట్లో చెప్పుకునేవారు . 

1980లో నేను "మానవత" అనే కవితా పుస్తకానికి ముఖ చిత్రం గీయించాలనుకున్నప్పుడు నాకు చంద్ర గుర్తుకు వచ్చాడు . అయితే అప్పుడు చంద్ర క్షణం తీరికలేనతగా ఉండేవారు . నాలాంటి యువ కవి పుస్తకానికి బొమ్మ వేస్తారా " అని సందేహించాను . అయినా వెళ్లి అడుగుదామని పుస్తకం కాపీ తీసుకొని ఓ రోజు వెళ్ళాను . పుస్తకం ఇచ్చి కవర్ పేజీ వేసి పెట్టండి అన్నాను. 

"నువ్వు కోటేశ్వర రావు  కదూ ?" అన్నారు . 

నేను 'అవును సర్ " అన్నాను. 

 "సరే వారం  రోజుల తరువాత రా " అన్నారు . 

"థాంక్ యు ... మరి .. ?" ఆగాను .

 కవర్ పేజీ గీసినందుకు ఎంత ఇవ్వాలి ? నా సందేహం అనేది చంద్ర కు అర్ధమైంది . 

నవ్వి  " తరువాత చూద్దాం లే " అన్నారు . 

నేను వారం  తరువాత వెళ్ళాను . అప్పటికే కవర్ పేజీ బొమ్మ గీసి రెడీగా పెట్టారు . 

అది చూడగానే ఎక్స్ లెంట్ గా అనిపించింది . ఎన్ని సార్లు థాంక్స్ చెప్పానో .

"డబ్బు మాత్రం తరువాత చెబుతాలే .. అని  నీ మొదటి పుస్తకం కదా , కవిత్వం బాగుంది , అల్ ది  బెస్ట్ " అని చెప్పారు . 

1980 జూన్ 1వ తేదీన అశోక్ నగర్ కేంద్ర గ్రంథాలయం లో కిన్నెర రఘురామ్ ఏర్పాటు చేసి కార్యక్రమంలో   నా "మానవత " కవితా  పుస్తకానికి మహాకవి శ్రీ శ్రీ ముందు మాట వ్రాయడమే కాకుండా ఆయన స్వయంగా మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చి ఆవిష్కరించారు . 

ఈ కార్యక్రమంలో మహాకవి శ్రీ శ్రీ గారితో  నా పుస్తకానికి అద్భుతమైన  కవర్ పేజీ ఇచ్చిన   చంద్రకు జ్ఞాపికను బహుకరించాము . 

ఇది చంద్రకు మహదానందాన్ని ఇచ్చింది . ఆ తరువాత నేను ఎప్పుడు కలిసినా ఆ వియాన్ని గుర్తు చేస్తూ " భగీరథా నేను  మర్చిపోలేని 

బహుమతి ఇచ్చావు . " అనే వాడు . 

ఆ తరువాత చంద్ర నిర్మాత దర్శకుడు బి నరసింగ రావు గారికి ఎంతో ఆత్మీయుడు . నరసింగ రావు రంగుల కల చిత్రంలో ఆర్టిస్టు పాత్రలో గొప్పగా నటించాడు . ఎన్నో సినిమాలకు కళా దర్శకుడుగా పనిచేశారు . ఓపెన్ యూనివర్సిటీ లో పనిచేటప్పుడు కూడా మిత్రుడు డాక్టర్ ఉమాపతి వర్మ గారిని కలవడానికి యూనివర్సిటీ వెళ్ళినప్పుడు చంద్రను తప్పకుండా కలుస్తూ ఉండేవాడిని . 

నేను మర్చిపోలేని ఆత్మీయ మిత్రుడు చంద్ర . 


Comments

Popular posts from this blog