36 సంవత్సరాల నాటి స్మృతి చిత్రమ్
పంపిణీదారు , నిర్మాత యలమంచి హరికృష్ణ సినిమా పట్ల అవగాహన , అభిరుచి తో పాటు సామాజిక బాధ్యత వున్న వ్యక్తి .
కృష్ణ చిత్ర పతాకంపై వై . అనిల్ బాబు నిర్మాతగా తాను సమర్పకుడిగా టి . కృష్ణ దర్వకత్వంలో రూపొందించిన చిత్రం "వందేమాతరం ". ఈ సినిమాలో రాజశేఖర్ , విజయ శాంతి జంటగా నటించారు. "వందేమాతరం ". సినిమా విడుదలైన సందర్భగా హైదరాబాద్ లోని హోటల్ రిట్జ్ లో చిత్రం గురించి మాట్లాడటానికి ఓ సమావేశాన్ని ఏర్పాటుచేశారు . అప్పట్లో నేను హైద్రాబాద్ లో జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక రిపోర్టర్ గా ఉండేవాడిని. సికిందరాబాద్ లోని రాష్ట్రపతి రోడ్డులో సినిమా పంపిణీ సంస్థలు ఉండేవి. అందరూ నన్ను బాగా అభిమానించేవారు. నేను తరచుగా వారిని కలుస్తూ వార్తలు రాస్తూ ఉండేవాడిని .
అప్పట్లో సినిమా విడుదల తరువాత హైద్రాబాద్ లో ఆ సినిమా గురించి తప్పకుండా సమావేశం ఏర్పాటుచేసేవారు . ఇందులో జర్నలిస్టులు, రచయితలు , రచయిత్రులు, కవులను ఆహ్వానించేవారు . ఇలా రచయితలను పిలవాలనుకున్నప్పుడు నన్ను సంప్రదించేవారు . నేను కొన్ని పేర్లు సూచించేవాడిని . వారిని ఆ సమావేశానికి ఆహ్వానించేవారు .
అలా వందేమాతరం సినిమా విడుదలైన తరువాత అక్టోబర్ 2, 1985న రిట్జ్ హోటల్లో ఈ సినిమా సమావేశం జరిగింది .
ఈ సమావేశంలో శ్రీమతి ఇల్లిందల సరస్వతీ , శ్రీమతి డి . కామేశ్వరి , డాక్టర్ కె .వి .కృష్ణకుమారి , డాక్టర్ ఆనందా రామం , హరికృష్ణ గారి శ్రీమతి రాజ్యలక్ష్మి గారు ఆంజనేయ శాస్త్రి, వెంకటరావు, మూర్తి నేను ఈ ఫొటోలో వున్నాము .
వందేమాతరం సినిమాలో గాయకుడు శ్రీనివాస్ "వందేమాతరం గీతం వారసమారుతున్నది " అన్న పాటతో వందేమాతరం శ్రీనివాస్ గా మారిపోయాడు . అన్నట్టు అక్టోబర్ 2 హరికృష్ణ గారి .జన్మదినం అని తెలుసుకున్న రచయిత్రులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు . ఆ రోజుల్లో విడుదలైన సినిమా సమావేశాలన్నీ కుటుంబ కార్యక్రమాల్లా ఆహ్లాదంగా , ఆత్మీయంగా జరిగేవి .
హరికృష్ణ గారితో నాకు ఎంతో ఆత్మీయ అనుబంధం వుంది. ఆయన నిర్మిచిన సినిమాలన్నీ సామాజిక స్పృహ కలిగినవే , సందేశాత్మకమైనవే . ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ప్రారంభమైన కొత్తల్లో అధ్యక్షులుగా పద్మశ్రీ డీవీఎస్ రాజుగారు , సంయుక్త కార్యదర్శిగా హరికృష్ణ గారు , మీడియా కమిటీ చైర్మన్ గా నేను పనిచేసిన రోజులను మర్చిపోలేను .
Comments
Post a Comment