పద్మభూషణ్ కృష్ణ గారి 78వ పుట్టినరోజు
ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి 78వ పుట్టినరోజు . సంచలనాలకు మరో పేరు , సాహసాలకు మారు పేరు హీరో కృష్ణ.
1965లో ఆదుర్తి సుబ్బారావు గారు " తేనెమనసులు " చిత్రం తో సినిమా రంగంలోకి హీరోగా పరిచయం అయ్యారు .
కృష్ణ గారు నటించిన చివరి సినిమా ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన "శ్రీ శ్రీ ". ఈ ఐదు దశాబ్దాల్లో కృష్ణ గారు 346 సినిమాల్లో నటించారు .
కృష్ణ గారు నన్ను బాగా అభిమానించేవారు . జర్నలిస్టుగా ఆయన్ని తరచుగా కలుస్తూ ఉండేవాడిని. ఆరోజుల్లో సాయంత్రంవేళ పద్మాలయ స్టూడియోస్ కు వచ్చి రెండు గంటల పాటు కూర్చునేవారు . ఆ సమావేశానికి చాలామంది నిర్మాతలు , దర్శకులు , నటులు హాజరయ్యేవారు . వచ్చిన వారందరికి కృష్ణ గారి సోదరుడు హనుమంతరావు గారు అతిథి మర్యాదలు చూసేవారు . అప్పట్లో నేను కూడా తప్పకుండా పద్మాలయా వెళ్లి కృష్ణ గారి సమావేశాల్లో పాల్గొనేవాడిని . సినిమా రంగానికి సంబంధించిన అనేక విషయాలు తెలుస్తూ ఉండేవి . ఆయన దాపరికం లేకుండా అన్నీ సంగతులు మాట్లాడేవారు. జర్నలిస్టుగా నాకు ఎన్నో విషయాలు తెలిసేవి .
కృష్ణ గారు నటుడు గ, నిర్మాతగా , స్టూడియోస్ అథినేతగా , దర్శకుడుగా , పార్లమెంట్ సభ్యుడుగా బహు ముఖాలుగా ఎదిగి ఒదిగిన హీరో.
తెర మీదనే కాదు నిజ జీవితం లో కూడా ఆయన హీరోనే . మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడే హీరో కాదు .
సౌమ్యుడు గా కనిపించినా సాహసమే ఊపిరి, ఉనికిగా సినిమా రంగంలో తనదైన చెరగని ముద్ర వేసుకున్న పద్మభూషణుడు కృష్ణ .
ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరిన్ని చేసుకోవాలని కోరుకుంటున్నా . కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు .
Comments
Post a Comment