నిర్మాత దర్శకుడు యు విశ్వేశ్వర రావు ఇక లేరు
ప్రముఖ నిర్మాత, దర్శకుడు యు విశ్వేశ్వర రావు ఈరోజు ఉదయం చెన్నై లో మరణించారు .
విశ్వేశ్వర రావు గారి వయసు 92 సంవత్సరాలు . ఆయనకు ఇద్దరు అమ్మాయిలు , మంజు, శాంతి, కుమారుడు ధనుంజయ్ .
నిర్మాత దర్శకుడుగా విశ్వేశ్వర రావు గారు తెలుగు సినిమాకు ఆణిముత్యాల లాంటి సినిమాలు అందించారు .
నిరాడంబరుడు, నిగర్వి, ఉన్నదున్నట్టు మాట్లాడే స్వభావం కలిగినవాడు విశ్వేశ్వర రావు గారు .
విశ్వేశ్వర రావు గారితో నాకు 1979 నుంచి పరిచయం వుంది . 1980 జూన్ లో హైదరాబాద్ లో జరిగిన నా :"మానవత "కవితా సంపుటి
ఆవిష్కరణకు మహాకవి శ్రీ శ్రీ గారితో నా పుస్తకానికి ముందు మాట వ్రాయించడమే కాదు శ్రీశ్రీ గారిని ఈ పుస్తకావిష్కరణ సభకు హైదరాబాద్ తీసుక వచ్చారు . ఈ సభలో విశ్వేశ్వర రావు గారు ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు .
ఆ నాడు విశ్వేశ్వర రావు గారు చేసిన ఈ సహాయం జీవితాంతం మర్చిపోలేదిది .
విశ్వేశ్వర రావు గారు మహానటుడు, నాయకుడు ఎన్ .టి రామారావు గారికి బావమరిది . ఆ తరువాత తన కుమార్తె శాంతిని రామారావు గారి కుమారుడు మోహన్ కృష్ణకు ఇచ్చి వివాహం చేశారు . అలా రామారావు గారికి వియ్యంకుడు అయ్యారు .
అలాగే నటుడు , నిర్మాత మాగంటి మురళి మోహన్ కుమారుడు రామ్ మోహన్ కు విశ్వేశ్వర రావు మనవరాలు అంటే మంజు కుమార్తె రూపను ఇచ్చి వివాహం చేశారు .
మహానటుడు రామా రావు గారితో కంచుకోట (1967)నిలువు దోపిడి (1968)పెత్తందార్లు (1970)దేశోద్ధారకులు (1973) చిత్రాలు రూపొందించారు .
ఇక ఆయన దర్శకుడుగా తీర్పు (1975)నగ్నసత్యం (1979)హరిశ్చెంద్రుడు (1981)కీర్తి కాంత కనకం (1983) చిత్రాలు ఆయనకు అవార్డులతో పాటు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి
ఈ సినిమాలు అప్పటి సామాజిక సమస్యలపై ఆయన నిర్మించి దర్శకత్వం వహించారు ,
1986లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్ .టి .రామారావు గారు వున్నప్పుడు హైదరాబాద్ లో అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరిగింది . అప్పుడు ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా యు . విశ్వేశ్వర రావు గారు , ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థ అధ్యక్షులుగా డి .వి .ఎస్ రాజు గారు వున్నారు. ఆ చిత్రోత్సవం అంత ఘనవిజయం కావడానికి రామారావు గారికి చేదోడు వాదోడుగా వున్నది రాజు గారు , విశ్వేశ్వర రావు గారే . ఇప్పటికీ దేశంలో ఇలాంటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరగలేదు .
Comments
Post a Comment