మహానటుడు ఎన్ .టి .ఆర్ తో మధుర స్మృతులు



మహానటుడు , ప్రజా నాయకుడు నందమూరి తారక రామారావు గారి 98వ జయంతి . 

రామారావు గారితో జర్నలిస్టుగా ఎన్నో మర్చిపోలేని మధుర స్మృతులున్నాయి . 

సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు . 

1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీని ప్రకటించారు . హైదరాబాద్ లోని గోల్కొండ క్రాస్ రోడ్ లో వున్న రామకృష్ణ స్టూడియోస్ 

తెలుగు దేశం పార్టీ కార్యక్రమాలకు ప్రధాన వేదిక. ఎప్పుడూ జనంతో కళకళలాడుతూ ఉండేది . అయితే పార్టీ ప్రారంభమైన తరువాత 

అన్నగారు తప్పనిసరి పరిస్థితుల్లో "నా దేశం 'అనే సినిమా చెయ్యవలసి వచ్చింది . కె .దేవీ వరప్రసాద్ ,ఎస్ .వెంకటరత్నం నిర్మించిన ఈ సినిమాకు కె . బాపయ్య దర్శకుడు . 

నేను జ్యోతి చిత్ర వారపత్రిక లో రిపోర్టర్ గా వున్నప్పుడు రామారావు గారి పుట్టిన రోజు పండుగకు తప్పనిసరిగా ఇంటర్వ్యూ చేసేవాడిని . అలాగే 1982 మే 28 ఇంటర్వ్యూ  కోసం రామారావు గారిని మే 13న రామకృష్ణ స్టూడియోస్ లో కలిశాను . అప్పుడు "నాదేశం " చిత్రం షూటింగ్ లో వున్నారు.  జ్యోతి చిత్రకు  కోసం మీ ఇంటర్వ్యూ కావాలి అని అడిగాను. 

రామారావు గారు చాలా  బిజీ గా వున్నారు . "తరువాత కలవండి బ్రదర్" అని చెప్పారు . 

"అలాగే  సార్"అని చెప్పి వచ్చేశాను . ఆ తరువాత ఆయన ఇంటర్వ్యూ కోసం మళ్ళీ  మే 22 ఉదయమే స్టూడియోస్ కు వెళ్ళాను . 

షూటింగ్ ఒకవైపు , తెలుగు నాయకులు మరో వైపు చాలా బిజీ గా వున్నారు.  నిజానికి రామారావు గారితో మాట్లాడే అవకాశం కూడా దొరకటం లేదు .ఒక గంటసేపు వున్న తరువాత  వారితో మాట్లాడే అవకాశం వచ్చింది.  ఇంటర్వ్యూ సంగతి గుర్తు చేశాను . 

"సారీ బ్రదర్ ఏమనుకోవద్దు .. " అన్నారు . 

నాకు చాలా నిరుత్సాహం అనిపించింది. అయినా నవ్వుతూ " ఒక్క 10 నిముషాలు సార్ " అన్నాను . 

ఆయన నావైపు చూసి ఏమనుకున్నారో " సరే 2.00 గంటలకు రండి బ్రదర్ ' అన్నారు . 

నాలో మహా ఉత్సాహం వచ్చేసింది . "అలాగే,  థాంక్ యు సార్ " అని నమస్కారం చేసి వచ్చేశాను . 

అప్పటికి టైం 11. 30 కావస్తుంది . చిక్కడపల్లి రూమ్ కు వెళ్ళాను . ఒంటి గంటకు రూమ్ నుంచి బయలుదేరి హోటల్లో స్వరాజ్ హోటల్లో భోజనము చేసి 1. 50 కల్లా రామకృష్ణా స్టూడియోస్ కు వెళ్ళాను .

 నన్ను చూసిన అసోసియేట్ డైరెక్టర్  ఎన్ ,ఎస్  సాద్ గారు . హడావిడి పడిపోతూ  .. "మీకోసం ఆంధ్ర జ్యోతి ఆఫీసుకు ఫోన్ చేశాను ,మీరు లేరని చెప్పారు " అన్నారు . 

"సారీ  ప్రసాద్ గారు " అన్నాను. 

"సరే పెద్దాయన మీకోసం మేడమీద వెయిట్ చేస్తున్నారు , వెళ్ళండి " అని చెప్పారు . 

అంతే పరుగుతో రామారావు గారి కార్యాలయం లోని అడుగుపెట్టాను. 

ఆయన నన్ను  చూసి "రండి బ్రదర్ " అన్నారు . 

"సారీ సార్ " అన్నాను. "ఇట్స్ అల్ రైట్ " అన్నారు నవ్వుతూ . 

అదే రామారావు గారి ప్రత్యేకత . అందుకే ఆయన విశ్వవిఖ్యాత సార్వభౌముడయ్యారు . 

తెలుగువారికి ప్రాతః కాల స్మరణీయుడయ్యారు . 


Comments

Popular posts from this blog