స్నేహపాత్రుడు ఆర్ .ఆర్ .వెంకట్ 



ఈరోజు హైద్రాబాద్ లో మరణించిన ఆర్ .ఆర్. వెంకట్ ( జె .వి .ఫణింద్ర రెడ్డి ) స్నేహపాత్రుడు . సినిమా అంటే ఎంతో అభిమానం . అయితే సినిమా ప్రచారానికి ఆయన దూరంగా ఉండేవారు . ఆయన మొదటి సినిమా "ది ఎండ్ ". రవి చావలి దర్శకత్వం వహించారు . ఈ సినిమాకు అప్పటి రాష్ట్రపతి నుంచి ప్రశంసాపత్రం లభించింది . 

2004లో ఎస్ .వి .కృష్ణా రెడ్డి దర్శకత్వంలో , కె . అచ్చి రెడ్డి సారథ్యంలో అలీ , వేణుమాధవ్  తో "హంగామా " అనే చిత్రం నిర్మించారు . ఆ సినిమాకు పబ్లిసిటీ నన్ను చెయ్యమని అచ్చి రెడ్డి గారు అడిగారు . నేను అంగీకరించాను . ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీ లో జరిగేటప్పుడు నిర్మాత వెంకట్ గారు వచ్చారు . ఆయన్ని అచ్చి రెడ్డి గారు నాకు పరిచయం చేశారు . 

ఆ తరువాత ఆయన నిర్మించిన "మాయాజాలం" ,  సినిమాకు కూడా నేను పనిచేశాను . 

ఆయన కాంట్రాక్టర్ . ఎక్కువ రోజులు ఉత్తర భారతంలో ఉండేవారు . హైదరాబాద్ వస్తే మాత్రం కృష్ణా రెడ్డి, అచ్చి రెడ్డి తో పాటు నన్ను  కలిసేవారు . అప్పుడు ఆర్ .ఆర్ మూవీ మేకర్స్ కార్యాలయం గణపతి కాంప్లెక్స్ వెనుక ఉండేది . వెంకట్ గారి తరుపున వారి బంధువు సురేష్ రెడ్డి నిర్మాణపు పనులు చూసేవారు . సురేష్ రెడ్డి  నేనంటే చాలా అభిమానంగా  ఉండేవారు . 

ఒక రోజు సురేష్ రెడ్డి నాకు ఫోన్ చేసి "వెంకట్ సార్  వచ్చారు , మీరొకసారి మన ఆఫీసుకు రండి " అన్నారు. 

నేను వెళ్ళేటప్పటికి వెంకట్ గారు నన్ను తన రూమ్ లోకి తీసుకెళ్లారు . 

"మీకు జగపతి  బాబు గారు బాగా తెలుసనీ సురేష్ రెడ్డి చెప్పారు " 

"అవును సార్  , వాళ్ళ నాన్న గారు కూడా బాగా తెలుసు " అన్నాను . 

"అయితే  మన నెక్స్ట్ సినిమాకు ఆయన్ని ఒప్పిస్తారా ? రవి దగ్గర మంచి కథ వుంది " అన్నారు . 

"ప్రయత్నం చేస్తా సార్ " అన్నాను . 

"మీరు ఒప్పిస్తే .  ఆ సినిమాకు మీరే ఎగ్జిక్యూటివ్ నిర్మాత , అందుకు మీకు ...  లక్ష లిస్తా " అన్నారు . "...  లక్షలా ? " అన్నాను. 

"అవును ....  లక్షలు " అని మళ్ళీ చెప్పారు . 

అప్పటి వరకు సినిమాకు పబ్లిసిటీ చేస్తే 30 వేలు ఇచ్చేవారు . వెంకట్ గారు ...  లక్షలు అనగానే నాకు నిజంగా ఆశ్చర్యమేసింది , వూహించనంత  ఆనందం కూడా కలిగింది. జగపతి బాబు నాకు చాలా సన్నిహితుడు . నేనంటే చాలా అభిమానం .. 

వెంకట్ గారి దగ్గర నుంచే జగపతి బాబుకు ఫోన్ చేసి రేపు వస్తాను మీతో మాట్లాడాలి  అన్నాను. పర్లేదు  ఫోన్లో చెప్పండి అన్నారు. కాదు  ఇంటికి వస్తాలే అని చెప్పాను . ఆయన సరే అన్నారు . . 

అదేరోజు సాయంత్రం ఫిలిం నగర్ దేవాలయానికి వెళ్లి రాజేంద్ర ప్రసాద్ గారికి ఈ విషయం చెప్పాను . ఆయన చాలా సంతోష పడ్డారు . 

"బాబుకు నేను కూడా చెబుతాను , మీకు మంచి అవకాశం వచ్చింది . అల్ ది బెస్ట్ " అని రాజేంద్ర ప్రసాద్ గారు మనస్ఫూర్తిగా అన్నారు . 

మరుసటి రోజు నేను జగపతి బాబు ఇంటికి వెళ్లి మాట్లాడాను . "వెంకట్ గారు మీకు మంచి ఆఫర్ ఇచ్చారు . మీ కోసం తప్పకుండా సినిమా చేస్తాను " అని హామీ ఇచ్చారు 

అలా జగపతి బాబు "సామాన్యుడు సినిమాలో నటించారు. వెంకట్ అన్న మాట ప్రకారం నాకు డబ్బులు ఇచ్చారు .  . 

అలాంటి  నిర్మాతను నేను చూడలేదు . సినిమా రంగంలో ఎక్కువమంది అవకాశవాదులు వుంటారు . అన్న మాట నిలబెట్టుకునే వారు తక్కువ . వెంకట్ నిజంగా జెంటిల్ మన్ . తనతో పాటు అందరూ బాగుండాలనే మంచి మనిషి . 

ఆయన ప్రతి సినిమా విడుదల ముందు ఐదు లక్షల రూపాయలు , వృద్దులు , వికలాంగులు , అనాథ ఆశ్రమాలకు ఇచ్చేవారు . వాటిని కూడా నేను సురేష్ రెడ్డి స్వయంగా వెళ్లి అలాంటి సంస్థలను ఎంపిక చేసేవాళ్ళం . ఇలా ఆపన్నులకు సహాయపడే గొప్ప మనిషి వెంకట్ గారి కుటుంబం   చాలా సంవత్సరాలక్రితం ప్రకాశం జిల్లా నుంచి వరంగల్ కు వచ్చి  స్థిరపడింది . 

 ఆయన 57 సంవత్సరాలకే మరణించడం దురదృష్టకరం .వెంకట్ గారి అంత్యక్రియలు ఈరోజు 12.  00 గంటలకు మహాప్రస్థానంలో జరిగాయి. వారి ఏకైక కుమారుడు వివేక్ వర్ధన్ రెడ్డి తండ్రికి అంతిమ సంస్కారం నిర్వహించాడు 

వెంకట్ కు  చివరిసారిగా  నివాళులు అర్పించాను . 

 ఆయన స్మృతి ఎప్పటికీ నాలో ఉంటుంది. 

 


Comments

Popular posts from this blog