భానుమతి ధైర్యానికి "మెచ్చు "తునక . 

శ్రీమతి భానుమతి రామకృష్ణ గారి 95వ జయంతి సందర్భంగా  ఆమె వ్యక్తిత్వం, అంకితభావం  ఎలాంటిదో తెలియజెప్పే 56 సంవత్సరాల క్రితం జరిగిన అరుదైన సంఘటన :"నవ్య " పాఠకుల కోసం. 
హీరో కావాలని సినిమా రంగంలోకి ప్రవేశించిన వి .బి .రాజేంద్ర ప్రసాద్ అవకాశాలు రావని తెలుసుకొని నిర్మాతగా మారాడు . 
తన తండ్రి గారి పేరుతో జగపతి ఆర్ట్ పిక్చర్స్ సంస్థను ప్రారంభించి "అన్నపూర్ణ " అనే సినిమాను రూపొందించారు . తరువాత "ఆరాధన", "ఆత్మబలం " చిత్రాలను నిర్మించారు.  అయితే "ఆత్మబలం" సినిమా ఆర్ధికంగా దెబ్బతీసింది. అందుకే కథ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకొని ఎంపిక చేసుకున్నారు . ఈ సినిమాలో కూడా నాగేశ్వర రావును  హీరోగా, దర్శకుడుగా వి .మధుసూదన రావు ను  .ఖరారు చేశారు.  హీరోయినిగా కృష్ణకుమారిని ఎంపిక చేసుకున్నారు. 
ఈ సినిమాలో హీరో సోదరి పాత్రకు జమున అయితే బాగుంటుందని అనుకున్నారు. జమున "అన్నపూర్ణ "చిత్రంలో కథానాయిక . ఆమెకు  అడ్వాన్సు కూడా ఇచ్చారు . ఒక వారం రోజుల తరువాత రాజేంద్ర ప్రసాద్ గారికి ఫోన్ చేసి "నేను  ఆ పాత్ర చేయలేను , నాగేశ్వరరావు గారి  చెల్లెలి పాత్ర చేస్తే, అలాంటి సినిమాలే వస్తాయని అందరూ అంటున్నారు. నాకు కూడా అదే అనిపిస్తుంది .  మీరు మరోలా భావించకండి  అడ్వాన్స్ పంపిస్తాను " అని చెప్పారు. 
అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు, మధుసూదన రావు గారు బాగా ఆలోచించి ఆ పాత్రకు భానుమతి గారు బాగుంటారని  అనుకున్నారు . తరువాత రోజు రాజేంద్ర ప్రసాద్ గారు భానుమతిని గారిని కలసి ఆ పాత్ర గురించి చెప్పారు . ఆమె ఒప్పుకున్నారు . వెంటనే అడ్వాన్స్ కూడా ఇచ్చారు . 
1965 వ సంవత్సరం ప్రారంభంలో ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలయ్యింది . ఎక్కువ భాగం శ్రీ సారధి స్టూడియోస్ లో జరపడానికి నిర్ణయించారు . సారధి స్టూడియోస్ పరిపాలన భవనం మీద ఆరు గదులు ఉండేవి. అందులో నిర్మాత, దర్శకుడు , హీరో, హీరోయిన్ ఉండేవారు .  అప్పటికే భానుమతి గారు పెద్ద హీరోయిన్. అందుకే ఆమెకు హైద్రాబాద్లోని పెద్ద హోటల్లో రూమ్ బుక్ చెయ్యాలని రాజేంద్ర ప్రసాద్ నిర్ణయించుకున్నారు. ఈ విషయం భానుమతి గారితో చెబితే "ఎందుకు ప్రసాద్ గారు డబ్బు దండుగ , నేను కూడా మీతో పాటే సారధి స్టూడియోస్ లోనే వుంటాను " అని చెప్పారు .  
సారధి స్టూడియోస్ లో షూటింగ్ మొదలయ్యింది . రెండు షెడ్యూళ్లు ఎలాంటి సమస్యలు లేకుండా జరిగిపోయాయి . మూడవ షెడ్యూలు కోసం సారధి స్టూడియోస్ లోనే ఓ సెట్ వేశారు . ఇందులో భానుమతి , అక్కినేని నాగేశ్వర రావు, రేలంగి, రమణారెడ్డి, జూనియర్ ఆర్టిస్టుల మీద ఓ పాటను చిత్రీకరించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు . మద్రాస్ నుంచి భానుమతి హైదరాబాద్ వచ్చి సారధి స్టూడియోస్ లోని గదిలో వున్నారు . నిర్మాత రాజేంద్ర ప్రసాద్ , దర్శకుడు మధుసూదనరావు ఇద్దరూ ప్రొడక్షన్ ఆఫీస్ లో వున్నారు . 
ఆరోజు ఉదయం 7. 00 గంటలకే షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నారు.  అయితే 6. 00 గంటలకు ప్రొడక్షన్ మేనేజరు స్టూడియో నుంచి ఫోన్ చేసి " సార్ కొంప మునిగింది , రాత్రి భానుమతి గారి  కాలి గోళ్లను  ఎలుకలు కొరికేశాయి " అని చెప్పాడు . 
రాజేంద్ర ప్రసాద్ గారు ఆగమేఘాలమీద సారధి స్టూడియోస్ వచ్చారు. అప్పటికే భానుమతి గారు కాలి గోళ్ళ దగ్గర డెట్టాల్ రాసుకుంటూ కనిపించారు . 
"అయ్యో ఎంత పని జరిగింది , షూటింగ్ క్యాన్సల్  చేద్దాము , డాక్టర్ కు కబురు చేస్తాను "అని రాజేంద్ర ప్రసాద్ కంగారుగా అన్నాడు . 
భానుమతి రాజేంద్ర ప్రసాద్ వంక చూసి " ఈ మాత్రం దానికే డాక్టర్ అవసరం లేదు , షూటింగ్ క్యాన్సల్  చేసే అవసరమే లేదు . మీరు నిశ్చింతగా ఏర్పాట్లు చేసుకోండి " అని చెప్పారు . 
భానుమతి మాటలతో రాజేంద్ర ప్రసాద్ గారు  సంతృప్తి పడలేదు . ఇంకేదో చెప్పబోతున్నారు . 
"ప్రసాద్ గారు ఇంత చిన్న విషయానికే భయపడితే నేను భానుమతిని  ఎట్లా అవుతాను ? ప్రసాద్ గారు పాట  విన్నాను . చాలా బాగుంది.  దులిపేస్తా అంతే , మీరు వెళ్ళండి " అని చెప్పారు నవ్వుతూ . 


ఆ సినిమా పేరు "అంతస్తులు "
ఆపాట "దులపర బుల్లోడా దుమ్ము దులపర బుల్లోడా ". దీనిని కొసరాజు రాఘవయ్య చౌదరి రాశారు . 
ఈ సినిమాకు సంగీత దర్శకుడు కె .వి .మహదేవన్ . దర్శకుడు వి . మధుసూదన రావు . 
అంతస్తులు సినిమా 27 మే 1965లో విడుదలై ఘనవిజయం సాధించింది . 
ఈ పాట  జనానికి అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉర్రుతలూగిస్తుంది . 
- భగీరథ 


 

Comments

Popular posts from this blog