సీనియర్ జర్నలిస్ట్ వరదాచారి గారు ఇక లేరు
సీనియర్ జర్నలిస్ట్ జి .ఎస్ .వరదాచారి గారు ఈరోజు మధ్యాహ్నం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారన్న వార్త దిగ్భ్రాంతి కలిగించింది . తెలుగు జర్నలిజంతో వరదాచారి గారి జీవితం మమేకమైందని చెప్పవచ్చు . జర్నలిస్టుగా ఆయన ఎంతో నిజాయితీగా , నిబద్దతతో పనిచేశారు . ఎంతో మంది యువ జర్నలిస్టులను తయారు చేసి వారిలో స్ఫూర్తి నింపిన గొప్ప మానవతావాది .
1932 అక్టోబర్ 15న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో జన్మించిన వరదాచారి గారు చదువు అనంతరం 1948వ సంవత్సరంలో ఆంధ్ర జనత దినపత్రికలో జర్నలిస్టుగా జీవితం ప్రారంభించారు . ఆ తరువాత ఆంధ్ర భూమి, ఈనాడు , తెలుగు విశ్వవిద్యాలయం , హెచ్ .ఎమ్ టీవీ లో పనిచేశారు . వరదాచారి గారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు వున్నారు . భార్య చాలా కాలం క్రితం చనిపోయారు
వరదాచారి గారు ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ సంఘానికి నాయకుడుగా , ఫిలిం క్రిటిక్స్ అసోసియేన్ వ్యవస్థాపకుడుగా , జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కి అధ్యక్షులుగా , వయోధిక పాత్రికేయ సంఘ అధ్యక్షులుగా పనిచేశారు .
వరదాచారి గారితో నాకు 1977 నుంచి పరిచయం వుంది . 1980 నుంచి 1988 వరకు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు వరదాచారి గారు . అధ్యక్షులుగా నేను కార్యదర్శిగా పనిచేశాము . ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను . 1980లో నేను రచించిన "మానవత" కవితా సంపుటిని మహాకవి శ్రీ శ్రీ ఆవిష్కరించారు . ఆ సభలో వరదాచారి గారు పాల్గొన్నారు . నేను రచించిన "తెలుగు సినిమా ప్రగతి " అన్నపుస్తకానికి ముందు మాట వ్రాశారు . 2019లో శృతిలయ పాత్రికేయ పురస్కారాన్ని వారితో కలిపి స్వీకరించాను .
నాలుగు నెలల క్రితమే "పరిణత పాత్రికేయం , జి .ఎస్. వరదాచారి " పుస్తక సభ ప్రెస్ క్లబ్ లో జరిగింది . ఆరోజు అందరు పాత్రికేయులు వరదాచారి గారిని చూడటానికి వచ్చారు .
ఈరోజు వరదాచారి గారు లేరన్న వార్త నన్ను అమితంగా బాధించింది .
Comments
Post a Comment