రెండు దశాబ్దాలనాటి స్మృతి చిత్రమ్
16 డిసెంబర్ 2002 న హైదరాబాద్ నానక్ రామ్ గూడ లోని రామానాయుడు స్టూడియోస్ లో దాసరి నారాయణ రావు గారి "ఫూల్స్ " చిత్రం షూటింగ్ జరుగుతుంది . నేను అప్పుడు ఆంధ్ర ప్రభ దిన పత్రికలో సినిమా పేజీ చూస్తున్నాను . సినిమా షూటింగ్ కవరేజ్ కోసం నానక్ రామ్ గూడ వెళ్ళాను . అయితే అక్కడ ఒకనాటి అందాల కథానాయిక కృష్ణకుమారి గారు కనిపించారు. చాలా సంతోషం కలిగింది. ఒకప్పుడు స్క్రీన్ మీద యువతరాన్ని ఉర్రూతలూగించిన హీరోయిన్ . ఇప్పటికీ ఆ ముఖంలో గ్లామర్ కనిపిస్తుంది .
ఆమె వైపు అలాగే చూస్తుంటే దర్శకుడు దాసరి నారాయణ రావు గారు గమనించి "రా పరిచయం చేస్తాను "అన్నారు .
ఆమె మద్రాస్ లో ఉండేది కాబట్టి నాకు అప్పటివరకు కలిసే అవకాశం రాలేదు . దాసరి గారు నా గురించి చెప్పారు .
నేను నమస్కారం పెట్టాను . ఆమె కూడా నమస్కారం అంది.
"మీరు మాట్లాడుతూ వుండండి" అని దాసరి గారు వెళ్లిపోయారు .
మండువా లోగిలిలో షూటింగ్ జరుగుతుంది . తరువాత షాట్ కోసం లైటింగ్ ఏర్పాటు జరుగుతుంది .
కృష్ణకుమారి గారు ఉయ్యాల బల్ల మీద కూర్చున్నారు. నా కోసం ప్రొడక్షన్ బాయ్ ఓ కుర్చీ తెచ్చి వేశాడు . నేను ఆ కుర్చీలో కూర్చున్నాను .
"ఇక్కడకు రండి " అని ఆమె ఆహ్వానించింది .
సహజంగా కథానాయికలు అలా ప్రక్కన కూర్చోమని చెప్పారు.
కృష్ణ కుమారి గారి సంస్కారానికి ఆశ్చర్యమేసింది . కథానాయికగా కృష్ణకుమారి గారు ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు .
అప్పటి మధుర స్మృతి .
Comments
Post a Comment