అన్నపూర్ణ స్టూడియోస్ లో అక్కినేని విగ్రహం 

చాలా కాలం తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్ళాను 

ఎన్. టి. ఆర్. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మా కమిటీ వెలువరించిన 'శకపురుషుడు ' ప్రత్యేక సంచికను మీకు ఇవ్వాలి, ఎప్పుడు రమ్మంటారు ?   అని అక్కినేని నాగేశ్వర రావు గారి రెండవ అమ్మాయి నాగ సుశీల గారికి ఫోన్ చేశాను . 

'అయితే మీరు  స్టూడియోస్ కు రండీ, నేను అక్కడకు వస్తున్నా' అని చెప్పారు.   

సుశీల గారిని కలవడానికి అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్ళాను.  ఆ స్టూడియోస్ లోకి అడుగు పెట్టగానే ఎన్నెనో స్మృతులు గుర్తుకొచ్చాయి . 

అప్పుడే నాగ సుశీల గారు వచ్చారు . నన్ను చూడగానే బాగున్నారా ? చాలా కాలమవుతుంది ' అన్నారు . 

'నేను బాగున్నా , మీరు ?' 


నేను కూడా బాగున్నా , రండి ' అని సుప్రియ ఆఫీసులోకి తీసుకెళ్లారు . మమల్ని చూడాగానే సుప్రియ తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చారు . 

'చాలా కాలం తరువాత మిమల్ని చూశాను , ఎలా వున్నారు ?' ఆప్యాయంగా అడిగింది సుప్రియ . 

'బాగున్నా సుప్రియా ' అని చెప్పాను . 

మా ఇద్దరినీ ఓ పెద్ద క్యాబిన్ లోకి తీసుకెళ్లి కూర్చోమన్నారు . 

సుప్రియ , నాగేశ్వర రావు గారి పెద్దమ్మాయి సత్యవతి కుమార్తె. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు . 

'శకపురుషుడు ' పుస్తకం చూడగానే ఇద్దరూ చాలా బాగుంది అన్నారు. శకపురుషుడు ను ఇద్దరికీ బహుకరించాను . 

 ఎన్ .టి .ఆర్ తో నాన్నగారి  గారి అనుబంధం గురించి రాసిన  ఆర్టికల్  చూపించగానే ఇద్దరు చాలా సంతోషించారు. 'శకపురుషుడు ' ప్రత్యేక సంచికలో సినిమా విభాగాన్ని నేను ఎడిట్ చేశానని చెప్పాను . 

'అలాగా , మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ , సినిమా గురించి మీకు అన్ని విషయాలు తెలుసు , నాన్న గారు మిమ్మల్ని చాలా ఆత్మీయంగా చూసేవారు . మీరు కూడా నాన్న గారిని తరచూ కలిసేవారు ' అని నాగ సుశీల గారు ఆ రోజులను గుర్తు చేశారు. 

'అవును నాగేశ్వర రావు గారితో నా అనుబంధం చాలా ప్రత్యేకమైనది " అని చెప్పాను. 

'మీరు మాట్లాడుతూ వుండండి' అని సుప్రియ తన క్యాబిన్ లోకి వెళ్లి పోయింది . 

'బాయ్ వచ్చి మంచి నీళ్లు పెట్టాడు .' కాఫీ ,టీ ' ఏది కావాలి ' అని అడిగింది సుశీల . 

;ఏమీ వద్దు 'అన్నాను . 'కుర్రోడితో ఒక ఖాళీ గ్లాస్ తీసుకురా' అని చెప్పింది . అతను ఓకే ఖాళీ గ్లాస్ తెచ్చాడు . 

ఆ గ్లాస్ లో తనతో పాటు తెచ్చుకున్న బాటిల్ నుంచి కొబ్బరి నీళ్లు పోసింది . 

ఆమె ఆత్మీయత చూసి ముచ్చటేసింది . 

 'సెప్టెంబర్ నుంచి నాన్నగారి శత జయంతి మొదలవుతుంది కదా ?' అన్నాను . 

'అవును ఆ వర్క్ కోసమే స్టూడియోస్ కు వస్తున్నా, అమెరికాలో వున్న తోటకూర ప్రసాద్ గారు నాన్న గారి మీద ఒక ప్రత్యేక సంచిక తీసుకొస్తున్నారు . సెప్టెంబర్ 20 నాన్న గారి పుట్టినరోజు సందర్భంగా మేము స్టూడియోస్ లో వారి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నాము .  ఎనిమిది అడుగుల ఆ విగ్రహం కేరళలో తయారవుతుంది . ' 

'హైదరాబాద్ సిటీలో నాన్నగారి విగ్రహాన్ని ప్రతిష్టించమని ప్రభుత్వాన్ని ఎదగవచ్చు కదా ?' అన్నాను 

'మా స్టూడియోస్ లోనే వారి విగ్రహాన్ని నెలకొల్పాలనేది మా కుటుంబ సభ్యుల సంకల్పం . అమ్మ గారి విగ్రహాన్ని నాన్న గారు వున్నప్పుడే ఏర్పాటు చేశారు . నాన్నగారిది కూడా ఇక్కడే ఉండాలనేది మా అభిప్రాయం . స్టూడియోస్ అయితే వాటిని జాగ్రత్తగా మేము చూస్తాము ' అని చెప్పారు . 

'స్టూడియోస్ లో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు?' 



'రెండవ ఫ్లోర్ కు ఎదురుగా వున్న స్థలంలో నాన్నగారి దహన సంస్కారాలు జరిగాయి . అక్కడే వారి విగ్రహం ఏర్పాటు చేస్తాము ' అని చెప్పారు . 

'కుటుంబం తరుపున నాన్నగారి శత జయంతి సందర్భంగా ఇంక ఎలాంటి కార్యక్రమాలు చెయ్యబోతున్నారు ?'

'ప్రస్తుతానికి విగ్రహ ఏర్పాటు మాత్రమే అనుకున్నాము . ఆయన మీద అభిమానం వున్న వారు ఎలాగూ చేస్తారు ' అని చెప్పింది సుశీల . 

నటసమ్రాట్ , పద్మశ్రీ , దాదాసాహెబ్ ఫాల్కే , పద్మవిభూషణ్, అక్కినేని నాగేశ్వర రావు తెలుగు, తమిళ ,హిందీ చిత్రాల్లో నటించారు . 

మహా నటుడు అక్కినేని నాగేశ్వర రావు చిరస్మరణీయుడు. 

అక్కినేని   20 సెప్టెంబర్ 1924న  గుడివాడ మండలం రామాపురంలో అక్కినేని వెంకటరత్నం , పున్నమ్మ దంపతులకు జన్మించారు .  1944లో దర్శకుడు పి .పుల్లయ్య రూపొందించిన 'ధర్మపత్ని ' సినిమా ద్వారా తెరకు పరిచయం అయ్యారు . ఆయన 256 చిత్రాల్లో నటించారు . అక్కినేని నటించిన చివరి చిత్రం 'మనం '. 

అక్కినేని నాగేశ్వర రావు  గారు 22 జనవరి 2014లో మరణించారు . 

Comments

Popular posts from this blog