48 సంవత్సరాల నాటి జ్ఞాపకం,
వి.ఎస్. మూర్తి స్మృతి
1971 అక్టోబర్ 17న నేను హైదరాబాద్ కు వచ్చాను . మా పెద్దన్నయ్య కోటేశ్వర రావు హెచ్ .ఎమ్ .టి ఫ్యాక్టరీ లో పనిచేసేవాడు . ఆయన దగ్గర ఉండి ఇంటర్మీడియట్ చదవడానికి మా నాన్న రామస్వామి నన్ను హైదరాబాద్ పంపించారు . .
పావులూరు హైస్కూల్ లో చదివే రోజుల్లోనే నేను కథలు , కవిత్వం రాసేవాడిని. తెలుగు మాస్టారు మాధవరావు గారు నన్ను ప్రోత్సహించేవారు హైదరాబాద్ వచ్చాక కూడా చదువుకుంటూ రచనలు చేసేవాడిని. ఇంటర్ లో గురువు ఆచార్య తిరుమల గారు కూడా నన్ను బాగా ప్రోత్సహించేవారు. నేను మొదటిసారి 'ఆహుతి ' అన్న నాటకం వ్రాశాను. 1974 చివరిలో ఆకాశవాణిలో పనిచేసే దండమూడి మహీధర్ గారికి ఈ నాటకాన్ని చూపించాను. ఆయన, టి.వి .ఆర్ .కె . సుబ్బారావు గారిని నాకు పరిచయం చేశారు . అప్పుడు వారు డ్రామా సెక్షన్ చూసేవారు . రెండు నెలల తర్వాత 'ఆహుతి' నాటకం 'ఆకాశవాణి' లో ప్రసారానికి ఎంపికయ్యిందని లెటర్ వచ్చింది .
అప్పుడు నేను చిక్కడపల్లి లో ఉండేవాడిని. మా ఇంటికి సమీపంలో కె .ఎస్ .ఆర్ .ప్రసాద్ , వి .ఎస్ .మూర్తి ఉండేవారు . ప్రసాద్ నాకు కాలేజ్ లో పరిచయం . మూర్తి ప్రసాద్ గారి ఇంట్లో అద్దెవు ఉండేవాడు . ఆయన ఇన్ కమ్ టాక్స్ లో పనిచేసేవాడు .
ఒకప్పుడు నేను ఎన్ .వెంకటేశ్వర రావు రూమ్ లో ఉండేవాడిని . ఆయన వాటర్ వర్క్స్ లో పనిచేవాడు . వారి కార్యాలయం లో పనిచేసే డి .వి .రావు , పి . శ్రీనివాసరావు గారి సహకారంతో వారి స్టాఫ్ రిక్రియేషన్ క్లబ్ ద్వారా దీనిని ఆకాశవాణికి ఇచ్చాము . ఈ నాటకంలో డి .వి .రావు , పి . శ్రీనివాసరావు గారు కూడా పాల్గొంటామని చెప్పారు . సికింద్రాబాద్ లో వుండే విజయ జ్యోతి అనే అమ్మాయి కూడా ఒప్పుకుంది .
అలా 'ఆహుతి ' నాటకం ఆకాశవాణిలో 1975 జనవరి 16 మరియు 30లో రెండు భాగాలుగా ప్రసారమైంది. ఆ నాటకం రికార్డింగ్ అయిపోయిన తరువాత మా అందరితో ఒక ఫోటో తీశారు . నా ప్రక్కనే మూర్తి వున్నాడు . అది అపురూప జ్ఞాపకం .
అయితే ఆ తరువాత నేను చిక్కడపల్లి వదిలి పెట్టాను.
2016లో నేను వ్రాసిన 'అమరావతి ' నృత్య నాటికను మార్చి 24న యువకాళావాహిని నిర్వహణలో గుంటూరులో వెంకటేశ్వర దేవాలయ ప్రాంగణంలో ప్రదర్శించాము . ఆ ప్రదర్శనకు ఊహించని విధంగా చిన్ననాటి మిత్రుడు వి. సత్యనారాయణ మూర్తి వచ్చారు . చాలాకాలం తరువాత మూర్తిని చూశాను. పదవీ విరమణ చేశాక తాను గుంటూరులో స్థిరపడినట్టు చెప్పారు . ఆ తరువాత మళ్ళీ కలవలేదు .
నిన్న రామ కృష్ణ ఫోన్ చేసి తన సోదరుడు మూర్తి గారు గత సంవత్సరం గుండెపోటుతో మరణించాడని చెప్పాడు.
మూర్తి, ప్రసాద్ , నేను చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. చిక్కడపల్లి లో గడిపిన ఆ రోజులు మళ్ళీ గుర్తుకు వచ్చాయి .
మిత్రుడు సత్యనారాయణ మూర్తి ఎప్పటికీ నా స్మృతి పథంలో ఉంటాడు .
Comments
Post a Comment