ఈనాడు రామోజీ రావు గారు అస్తమయం
తెలుగు పత్రికా రంగంలో చెరగని ముద్రవేసిన పద్మవిభూషణ్ రామోజీ రావు గారు ఇక లేరు అన్న విషాద వార్త నన్ను కలవరపరిచింది .
పత్రికా రంగం , సినిమా రంగం , వ్యాపార రంగాల్లో ఆయన సాధించిన ప్రగతి అపూర్వం , అనితర సాధ్యం .
రామోజీ రావు గారితో నాకు 1983 నుంచి పరిచయం .
ఎన్ .టి .రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మొదటిసారి రామోజీ రావు గారిని జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక (ఆంధ్ర జ్యోతి సంస్థ ) రిపోర్టర్ గా ఇంటర్వ్యూ చేశాను. ఈనాడు కార్యాలయంలో రెండవ ఫ్లోర్ లో ఉండేవారు . అప్పుడు వారు నా పట్ల చూపించిన అభిమానం, ఆత్మీయత ఎప్పటికీ మర్చిపోలేను. రామోజీరావు గారితో నేను చేసిన ఆ ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది . ఆ తరువాత అనేక సందర్భాల్లో వారిని కలవడం జరిగింది. నా పట్ల ప్రత్యేకమైన అభిమానం చూపించేవారు .
1987 ఫిబ్రవరి 8న నా వివాహ రిసెప్షన్ కు వారిని ఆహ్వానించాను. నేను ఆంధ్ర జ్యోతి లో పనిచేసేవాడిని . ఈనాడులో పనిచేయలేదు కాబట్టి వారు హాజరు కారు అనుకున్నాను. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన రిసెప్షన్ కు రామోజీ రావు గారు మయూరి జనరల్ మేనేజర్ త్రిపురనేని కేశవ రావు గారు , ఉషాకిరణ్ మూవీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అట్లూరి రామారావు గారితో వచ్చి గంటసేపు వున్నారు .
మా దంపతులను రామోజీ రావు గారు ఆశీర్వదించడం మా అమ్మా, నాన్న , మా అత్త , మామలు ఎంత సంతోషించారో మాటల్లో చెప్పలేను.
మా పెద్ద పాప శైలి పుట్టినప్పుడు ఆ వాతను వారికి ఫోన్లో చెప్పాను . వారు పాపను ఆశీర్వదిస్తూ ఒక లేఖ పంపించారు . అది కూడా మధురానుభవం .
నేను ఆంధ్ర ప్రభలో పనిచేసేటప్పుడు 1999లో సినిమా రంగంపై మోహిని అనే ప్రత్యేక సంచికలు వెలువరించాము . ఆ సందర్భంగా వారు రామోజీ ఫిలిం సిటీని ఎందుకు ప్రారంభించింది , ఆ ఫిలిం సిటీకి తన పేరు ఎందుకు పెట్టుకున్నారో వివరించారు.
వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ గా పదవీ భాద్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి హైదరాబాద్ వచ్చారు . అప్పుడు వెంకయ్య నాయుడు గారు , స్పీకర్ మధుసూనాచారి గారి తో పాటు రామోజీ రావు గారిని కలిశాను. ఆ సందర్భంగా వారు ఆప్యాయంగా మాట్లాడారు .
గత సంవత్సరం నేను సంపాదకత్వం వహించిన "శకపురుషుడు " (ఎన్ .టి .ఆర్. శతాబ్ది సందర్భంగా వెలువడిన గ్రంథం ) పుస్తకాన్ని వారికి బహుకరిద్దామని ప్రయత్నించాను . అయితే వారి ఆరోగ్యం బాగా లేకపోవడంతో కలవలేకపొయ్యాను .
రామోజీ రావు గారు తెలుగు ప్రజలకు ఎప్పుడూ ప్రాతః కాల స్మరణీయులే .
Comments
Post a Comment