అక్కినేని నాగేశ్వర రావు గారి 101వ జయంతి . 

ఈరోజు మహా నటుడు అక్కినేని నాగేశ్వర రావు గారి 101వ జయంతి . తెలుగు సినిమా రంగంలో అద్వితీయ ,అసమాన నటులు అక్కినేని నాగేశ్వర రావు , ఎన్ .తో. రామారావు. ఈ ఇద్దరితో  జర్నలిస్టుగా నాకు పరిచయం  ఉంది .ఇద్దరూ నను అభిమానించినవారే . ఈ ఇద్దరూ తెలుగు వారికి ప్రాతః స్మరణీయులే . 

నాగేశ్వర రావు గారితో పరిచయం అయితే .. ఆ వ్యక్తి నచ్చితే ... అక్కినేని ఎంతో ఆత్మీయతను పంచుతారు. 

నాగేశ్వర రావు రావు గారితో ఎన్నో మధురమైన సంఘటనలు ఉన్నాయి . 

1987 ఫిబ్రవరి 8న ప్రెస్ క్లబ్ లో జరిగిన మా మ్యారేజ్ రిసెప్షన్ కు నాగేశ్వర రావు గారు నిర్మాత రామానాయుడు గారు, రామోజీ  రావు గారు , దుక్కిపాటి మధుసూదన రావు గారు ,నండూరి రామ మోహన్ రావు గారు  వచ్చి ఆశీర్వదించారు . 

అదొక తీపి జ్ఞాపకం . 



1992లో నాగేశ్వర రావు గారిని నంగునూరి చంద్రశేఖర్ గారి సోదరుడు అమర్నాథ్,  వాళ్ళ అబ్బాయి బారసాలకు ఆహ్వానించారు. ఆ కార్యక్రమం బేగంపేట్ లోని వారి ఇంటిలో ఏర్పాటుచేశారు . చంద్రశేఖర్ నన్ను కూడా ఫ్యామిలీతో  ఆహ్వానించారు . 

ఆ కార్యక్రమం జరుగుతూ ఉండగా 'మనం బైట కూర్చుందాం రండి' అని అక్కినేని పిలిచారు . 

బయట ఊయల ఉంది . అందులో ఇద్దరం కూర్చున్నాము . ఆయన మాట్లాడటం మొదలు పెట్టారంటే అదొక ప్రవాహంలా సాగుతుంది . అలా మాట్లాడిన విషయాలే చాలా సందర్భాల్లో నేను జ్యోతి చిత్రలో బాక్స్ ఐటమ్స్ గా రాసేవాడిని . అయితే ఆమాటల్లో పాఠకులకు ఏవి చెప్పాలి , ఏవి అవసరం లేదన్న విచక్షణ నాకు ఉందని అక్కినేనికి కూడా తెలుసు. అందుకే నాతో అనేక విషయాలు మాట్లాడేవారు . 

ఇలా మాట్లాడుతూ ఉండగా మా ఇద్దరు పిల్లలు నా కోసం బయటకు వచ్చారు . 

'మీ పిల్లలా' అడిగారు . 

'అవును' , పెద్ద పాప శైలి , చిన్న పాప శృతి అని చెప్పాను . 



" పాపలు ఇటు రండి " అని ఫోటోగ్రాఫర్ ను పిలిపించి ఓ ఫోటో తీయించారు . మీరు చూస్తున్న అరుదైన ఫోటో అదే. .

ఆతరువాత 1993లో మా ఇద్దరు పాపలు శైలి , శృతి కి జూబిలీ హిల్స్ స్కూల్ లో అడ్మిషన్ కోసం సిఫారసు చేస్తూ ప్రిన్సిపాల్ కు ఓ లెటర్ ఇచ్చారు . ఆ లెటర్ కాపీ ఇప్పటికీ నా దగ్గర వుంది . 

భగీరథ నాకు ఎంతో ఆత్మీయుడు , ఆయన పిల్లలకు సీట్లు ఇస్తే మా పిల్లలకు ఇచ్చినట్టు భావిస్తాను అని అక్కినేని ఆ లెటర్ లో వ్రాడడం , ఆయనకి నా పట్ల వున్న అపారమైన అభిమానానికి నిదర్శనం .  

అక్కినేని నాగేశ్వర రావు గారిని స్మరిస్తూ .. !


Comments

Popular posts from this blog