
ఈరోజు మహాకవి డాక్టర్ దాశరథి గారి శత జయంతి. దాశరథి గారితో నాకు 1980 నుంచి పరిచయం వుంది . ఆయన తో నేను చేసిన ఓ ఇంటర్వ్యూ అప్పట్లో సంచలన సృష్టించింది. వ్యక్తిగా ఎంత మృదువైన వాడో కవిగా అంత దృఢమైన వాడు. కవిగా ఆయన ఎప్పుడూ రాజీపడలేదు, ఎవరికీ భయపడలేదు. తెలంగాణ సమాజం గర్వించతగ్గ కళాప్రపూర్ణుడు. దాశరథి కృష్ణమాచార్య అరుదైన మహాకవి , అభ్యుదయవాది. దాశరథి గారు నిజాం ప్రభువును ఎదిరించి, తెలంగాణ విముక్తి కోసం పోరాడిన అక్షర యోధుడు. "ఓ నిజాము పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ" అని నినదించిన అభ్యుదయ కవిసమ్రాట్ దాశరధి. దాశరథి కృష్ణమాచార్య గారు చిన్న గూడూరు గ్రామంలో జన్మించాడు. ఈ గ్రామం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. అయితే ఆయన బాల్యం ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. దాశరథి గారు ఉర్దూలో మెట్రిక్యులేషను, భోపాల్ విశ్వవిద్యాలయం నుండి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంగ్లీషు సాహిత్యంలో బి.ఎ చదివాడు. దాశరథి గారికి తెలుగుతో పాటు సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి ప్రావ...