భగీరథ ప్రయత్నం "మీర్జాపురంరాణి - కృష్ణవేణి"
భగీరథ తాజా పుస్తకం "మీర్జాపురంరాణి - కృష్ణవేణి " చదివాను .
ఇది అలనాటి నటీమణి కృష్ణవేణి గారి జీవిత చరిత్ర . జీవిత చరిత్రలు చదవడానికి ఎంతో ఆసక్తిగా ఉంటాయి .
అయితే జీవిత చరిత్ర అనగానే ఆయా వ్యక్తుల జీవితాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని మాత్రమే రచయితు రాస్తుంటారు .
ఇందులో ఆయా కాలానికి సంబంధించిన విషయాలు , సంఘటనలు బహు అరుదుగా కనిపిస్తాయి . రచయితలు కేవలం ఆయా వ్యక్తుల మీదనే ఎక్కువ ద్రుష్టి కేంద్రీకరిస్తారు . మిగతావి పట్టించుకోరు .
"మీర్జాపురం రాణి - కృష్ణవేణి ' ఈ ధోరణికి భిన్నంగా , సరికొత్తగా , ఆయా కాలంలో జరిగిన సంఘటనలు , ఆ వ్యక్తి పై ప్రభావం చూపించిన వ్యక్తులు , ఆ ఘటనల పూర్వాపరాలను సరళమైన భాషలో వివరించడం దీని ప్రత్యేకత. అందువల్లనే ఈ రచనకు పరిపూర్ణత వచ్చింది .
భగీరథ ఇంతకు ముందు వ్రాసిన చారిత్రిక నవల "నాగలాదేవి " తెలుగు నవలా సాహిత్యంలో ఓ ట్రెండ్ సెట్టర్ . ఎందుకంటే ఈ నవలలో రచయిత ఓ గొప్ప ప్రయోగం చేశారు . శ్రీకృష్ణదేవరాయలకు సంబంధించిన చారిత్రిక ఘట్టాలను , నాగలాదేవి జీవితానికి సంబందించిన కల్పిత ఘటనలను సమాంతరంగా నడిపించడం అపూర్వం , అద్భుత ప్రయోగం . బహుశ గతంలో ఏ రచయితా ఇలాంటి ప్రయోగం చెయ్యలేదేమో . అదీ కాక ఈ రచయిత సరళమైన భాషలో , చిన్న చిన్న వాక్యాలతో పాఠకులను ఉత్కంఠ భరితంగా చదివిస్తాడు . ఈ నవలలో భగీరథ అవలంభించిన శైలి అనితర సాధ్యం .అందుకే నాగలాదేవి నవలను పాఠకులు అంతగా ఆదరించారు .
కర్ణాటకలోని బళ్లారిలో శ్రీకృషదేవరాయ విశ్వ విద్యాలయం వారు గత సంవత్సరం నుంచి బి .యస్సీ విద్యార్థులకు పాఠంగా దీనిని నిర్ణయించారు .
మళ్ళీ భగీరథ "మీర్జాపురం రాణి - కృష్ణవేణి " పుస్తకంలో కూడా అదే శైలిని అవలంభించాడు . అందుకే ఈ పుస్తకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారు ఆవిష్కరించిన తరువాత పాఠకుల్లో ఊహించని ఆసక్తిని కలింగించింది .
ఇప్పుడు "మీర్జాపురంరాణి -కృష్ణవేణి "ని అందరూ ఓ బయోపిక్ అంటున్నారు . 1936లో "సతీ అనసూయ " చిత్రం ద్వారా బాలనటిగా సినిమా రంగంలో ప్రవేశించిన కృష్ణవేణి అప్పటి జయా స్టూడియోస్ నిర్మాత మీర్జాపురం రాజా వారి దృష్టిలో పడటం , వారు ఆమెను వివాహం చేసుకోవడంతో కృష్ణవేణి జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది .
కృష్ణవేణి ని వివాహము చేసుకున్న మీర్జాపురం రాజా మేకా వెంకట్రామయ్య అప్పారావు బహదూర్ వంశ చరిత్ర ఎంత స్ఫూర్తి వంతగా , వీరోచితంగా ఉంటుందో ఈ పుస్తకంలో రచయిత వివరించారు .
రాజావారు జస్టిస్ పార్టీ , కృష్ణవేణి గారు కాంగ్రెస్ పార్టీ . ఆమెకు గాంధీగారి దర్శనం అయినా తరువాత భారత స్వాతంత్ర సమరంలో తన తన పాత్ర కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో రాజావారు ఒద్దన్నా, తన సహకారం ఉండదని చెప్పినా "మనదేశం" సినిమాను కృష్ణవేణి పట్టుదలతో నిర్మించారు . అదీ ఆమె అసలు సిసలు వ్యకిత్వం , ధీరగుణం .
కృష్ణవేణి బహుముఖ ప్రజ్ఞాశాలి , ప్రతిభాశాలి . ఆమె నటి , గాయని , నిర్మాత , స్టూడియో అధినేత .
మహా నటుడు ఎన్ .టి .రామారావు గారిని మనదేశం సినిమాలో పరిచయం చెయ్యడం , అక్కినేని నాగేశ్వర రావు గారికి కీలు గుర్రం సినిమాతో స్టార్ స్టేటస్ లభించడం . అంజలిని గొల్లభామ సినిమాలో పరిచయం చెయ్యడం .ఘంటసాలను మనదేశం సినిమాలో సంగీత దర్శకుడుగా పరిచయం చెయ్యడం , అదే సినిమాలో ఎస్ .వి .రంగారావు కు అవకాశం ఇవ్వడం, సి హెచ్ .నారాయణ రావును దాపత్యం సినిమాలో హీరోగా , రమేష్ నాయుడును సంగీత దర్శకుడుగా పరిచయం చెయ్యడం , రేలంగి వెంకట్రామయ్య కు నటుడుగా ఎదగడానికి అవకాశాలు కల్పించడం .. ఇలా కృష్ణవేణి ఎంతో మంది దర్శకులు , నటీ నటులకు చేయూత నిచ్చారు .
అంతేకాదు ఆనాడు కృష్ణవేణి జీవితంలో జరిగిన ఘటనలతో పాటు అప్పటి సామాజిక స్థితి గతులను వివరించడం వల్ల రచయిత మనల్ని ఆయా కాలాల్లోని తీసుకెళ్లారు .
ఇది కదా అసలైన జీవిత చరిత్ర అంటే అని ఈ పుస్తకం చదివిన తరువాత ఎవరైనా అనుకుంటారు . ఈ పుస్తకం వెలుగు చూడటానికి కృష్ణవేణి కుమార్తె నిర్మాత అనురాధాదేవి ని అభినందించాలి .
వందేళ్ల తెలుగు సినిమా చరిత్ర , "మీర్జాపురం రాణి -కృష్ణవేణి " పుస్తకం . ఈ పుస్తకాన్ని పూర్తిగా సమీక్షించాలంటే మరో ఉద్గ్రంధం అవుతుంది. రచయిత భగీరథ సామర్ధ్యాన్ని , సమర్ధతను ఈ పుస్తకం లోకానికి చాటుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు .
తెలుగు పాఠకులు తప్పనిసరిగా చదవాల్చిన అపూర్వ గ్రంథం "మీర్జాపురంరాణి -కృష్ణవేణి ".
- శ్రీమతి వీరగంధం విజయలక్ష్మి .
ప్రతులకు : శ్రుతి బిజినెస్ సెంటర్ : 040 23555617, అచ్చంగా తెలుగు : 8558899478




Comments
Post a Comment