సాహిత్య రంగంలో భగీరథ ప్రస్థానం
తెలుగు సినిమా మరియు సాహిత్య రంగంలో భగీరథది ఓ ప్రత్యేకమైన శైలి .
నాలుగున్న దశాబ్దాల నిరంతర కృషి , పట్టుదల భగీరథను సమున్నతమైన స్థానంలో నిలబెట్టింది .
సినిమా పాత్రికేయుడు గా ప్రారంభమై , రచయితగా , కవిగా , చారిత్రిక పరిశోధకులుగా బహుముఖాలుగా ఎదిగారు భగీరథ.
1956 మే 1వ తేదీన బాపట్ల జిల్లా నాగండ్ల గ్రామంలో రామస్వామి , వెంకాయమ్మ దంపతులకు జన్మించాడు భగీరథ. ప్రాధమిక విద్యను నాగండ్లలో పూర్తి చేసి పావులూరు హైస్కూల్ లో పదవ తరగతి వరకు చదివాడు . అప్పటికే నాగండ్ల , పావులూరు గ్రంథాలయాల్లో పుస్తకాలు చదవడం అలవాటయ్యింది . పదవ తరగతి చదువుతున్నప్పుడే కంద పద్యాలు రాయడం అలవాటయ్యింది . తెలుగు అధ్యాపకుడు యాచమనేని మాధవరావు ప్రోత్సహించాడు .
1971లో భగీరథ తన 15వ ఏట ఇంటర్మీడియేట్ చదవడానికి హైదరాబాద్ వచ్చారు . భగీరథ అన్న కోటేశ్వర రావు ఇంట్లో ఉండి సత్యమ్మ నరసింహారావు స్మారక కలశాల లో చదువుకోసాగాడు . భగీరథ చిక్కడపల్లి లో ఉండేవాడు . ఆ ప్రక్కనే అశోక్ నగర్ లో కేంద్ర గ్రంథాలయం ఉండేది . భగీరథ ఆ గ్రంథాలయానికి తరచుగా వెళ్ళేవాడు . అదే సంవత్సరం భగీరథ వ్రాసిన వ్యాసాలు పత్రికల్లో ప్రచురిత మయ్యాయి .
"కవిత్వం పుస్తకాలు చదువుతున్నావు . శ్రీశ్రీ మహాప్రస్థానం నీకు అర్థమవుతుందా ? నీ జీవితంలో శ్రీ శ్రీని కనీసం దూరం నుంచి అయినా చూడలేవు " అని అన్న కోటేశ్వర రావు భగీరథ ను మందలించాడు . అయినా భగీరథ తన ప్రవర్తన మార్చుకోలేదు . కోటేశ్వర రావు కు కోపం వచ్చి "నీ దారి నువ్వు చూసుకో " అని చెప్పేశాడు . భగీరథ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాడు . అక్కడ నుంచి కష్టాల పర్వం మొదలయ్యింది . అయినా కష్టాలు , కన్నీళ్లను అధిగమించి రచనలు చేయసాగాడు .
1974లో భగీరథ తన 18వ ఏట వ్రాసిన "ఆహుతి " అన్న నాటకాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ఎంపిక చేశారు . ఈ నాటకం 1975 జనవరి 15 మరియు 30న రెండు భాగాలుగా ప్రసారం అయ్యింది. భగీరథ జీవితంలో మరో మైలు రాయి .
ఇంటర్మీడియట్ పాస్ అయిన తరువాత ఏ .వి కాలేజీలో రాత్రి వేళ బి .ఏలో చేరాడు .
1977లో "వెండితెర " సినిమా పత్రిక తో పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించారు . జర్నలిస్ట్ కావాలని భగీరథ కోరుకున్నాడు.
1979లో ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే జ్యోతి చిత్రలో హైదరాబాద్ రిపోర్టర్ గా చేరాడు.
1980లో "మానవత' పేరుతో రాసిన కవితా సంపుటికి మహాకవి శ్రీశ్రీ ముందుమాట వ్రాశాడు . మహాకవి శ్రీ శ్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చి స్వయంగా భగీరథ వ్రాసిన 'మానవత ' కావ్యాన్ని ఆవిష్కరించారు . ఆ సభకు అప్పటి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు అధ్యక్షత వహించారు . నిర్మాత దర్శకుడు యు .విశ్వేశ్వర రావు ముఖ్య అతిధిగా , సీనియర్ జర్నలిస్ట్ జిఎస్ వరదాచారి , ఇంటర్మీడియట్ లో భగీరథ గురువు ఆచార్య తిరుమల ప్రత్యేక అతిధులుగా వచ్చారు . ఆ కార్యక్రమానికి భగీరథ అన్న కోటేశ్వర రావు కూడా హాజరయ్యాడు . అన్నను శ్రీ శ్రీ గారికి భగీరథ పరిచయం చేశాడు . కోటేశ్వర రావు కళ్ళల్లో ఆనందభాష్ఫాలు.
అది భగీరథ సాహిత్య జీవితానికి బలమైన పునాది వేసింది .
సినిమా జర్నలిస్టుగా భగీరథ అనతికాలంలోనే గుర్తింపు , గౌరవాన్ని సంపాదించాడు . ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కు కార్యదర్శిగా ఎన్నికయ్యాడు . అక్కినేని నాగేశ్వర రావు కు చాలా సన్నిహితుడయ్యాడు .
1983 జనవరి 9న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ముఖ్యమంత్రి రామారావు గారు భగీరథను అల్పాహారానికి ఆహ్వానించి మరీ ఇంటర్వ్యూ ఇచ్చారు .
1992లో మొదటిసారి నంది అవార్డుల కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యాడు . అదే సంవత్రం సినీగోయర్స్ నుంచి అవార్డు స్వీకరించారు . అప్పటి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బంగారప్ప ఈ అవార్డును బహుకరించారు .
అదే సంవత్సరం రామ్ గోపాల్ వర్మ "అంతం ", "ద్రోహి " చిత్రాల షూటింగ్ షూటింగ్ శ్రీలంక లో జరిగినప్పుడు భగీరథ ను ప్రత్యేక అతిధిగా శ్రీలంకకు ఆహ్వానించారు .
1996లో "ప్రియమైన శ్రీవారు " సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేశాడు .
1997లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ జర్నలిస్టుగా ఎంపిక చేసి నంది అవార్డు తో సత్కరించింది .
ఆంధ్ర ప్రభ లో పని చేస్తున్నప్పుడు, ఎడిటర్ వాసుదేవ దీక్షితుల ప్రోత్సాహంతో 68 సంవత్సరాల తెలుగు సినిమాపై
"మోహిని " పేరుతో రెండు భాగాలతో అద్భుతమైన పుస్తకాన్ని ప్రచురించారు .
2001వ సంవత్సరం మరోసారి ఉత్తమ జర్నలిస్టుగా నంది అవార్డు స్వీకరించాడు .
2005లో "సామాన్యుడు" 2007లో "స్వాగతం " సినిమాలకు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేశాడు .
స్వాగతం సినిమాలోని ఒక పాటను హంపిలో తీశారు . అప్పుడు భగీరథ హంపి శిధిలాలను చూసి సలత చెంది , కన్నీరు పెట్టుకున్నాడు , ఆ సంఘటనే భగీరథ ను పరిశోధన వైపు నడిపించింది . మధ్య యుగాలనాటి దక్షిణ భారత దేశ చరిత్రపై పరిశోధన చేయడం మొదలు పెట్టాడు .
2010లో భగీరథ రచించిన కథ తో "నజరానా 'అన్న బాలల చిత్రం రూపొందింది . దీనికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి బంగారు నంది అవార్డు లభించింది .
2011లో డాక్టర్ బి .ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం లో ఎమ్మె రెండవ సంవత్సరంచదివే విద్యార్థులకు కోసం భగీరథ తెలుగు సినిమాపై ఒక పాఠం రచించారు . తెలుగు సినిమా గురించి విశ్వ విద్యాలయ స్థాయిలో ఒక పాఠం రావడం ఇదే మొదటిసారి.
2014లో వంగూరి చిట్టెన్ రాజు గారు అమెరికా లోని హ్యూస్టన్ లో జరిగిన 9వ తెలుగు సాహిత్య సదస్సు మరియు 50 సంవత్సరాల అమెరికా కథ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి భగీరథను ఆహ్వానించారు . అక్టోబర్ 25, 26 తేదీల్లో సదస్సు జరుగుతుందని తెలియజేశారు .
భగీరథ వీసా కోసం అప్లై చేశాడు . అయితే అక్టోబర్ 30న ఇంటర్వ్యూ డేట్ వచ్చింది . అయితే ఆ డేట్ ను అక్టోబర్ 17కు మార్పించుకున్న ఘనుడు భగీరథ. అది భగీరథ సమర్ధతకు నిదర్శనం .
అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగిన సదస్సులో భగీరథ " మధ్య యుగాలనాటి దక్షిణ భారత దేశ చరిత్ర " గురించి మాట్లాడారు.
ఆ సదస్సుకు హాజరైన వారంతా భగీరధను ప్రశంసించారు .
2017లో భగీరథ 64వ జాతీయ సినిమా అవార్డుల కమిటీ సభ్యుడుగా పనిచేశారు .ఇది దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జాతీయ సినిమా అవార్డుల కమిటీ . 2021లో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు ఇండియన్ జ్యూరీ సభ్యుడుగా పనిచేశారు .
ఇక భగీరథ నాలుగు పర్యాయాలు నంది అవార్డుల కమిటీలలోను , తెలంగాణ గద్దర్ అవార్డుల కమిటీలోను , అనేక ప్రైవేట్ అవార్డుల కమిటీల్లోనూ , , దూరదర్శన్ స్క్రిప్ట్ మరియు స్క్రీనింగ్ కమిటీ , తెలుగు విశ్వవిద్యాలయంలో అవార్డు పుస్తకాల ఎంపిక కమిటీ , డాక్టర్ బి .ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పాఠ్యాంశాల సలహా మండలి, హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు సభ్యుడుగా మూడు పర్యాయాలు పనిచేశారు.
2023లో తెలుగు విశ్వ విద్యాలయం భగీరధకు కీర్తి పురస్కారాన్ని ప్రదానం చేసింది .
2023లో నందమూరి తారక రామారావు శతాబ్ది సందర్భంగా భగీరథ 'శకపురుషుడు ', 'తారకరామం ' అన్న గ్రంధాలకు సంపాదకుడు పనిచేశారు .
2025లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భగీరధను కళారత్నతో గౌరవించింది .
వంశీ , కిన్నెర , రెండు పర్యాయాలు సినీ గోయర్ ,ఢిల్లీ తెలుగు అకాడమీ, ఎన్ .టి .ఆర్ ట్రస్ట్, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, మానస ఆర్ట్ అకాడమీ, అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం , భారత్ ఆర్ట్స్ ,ప్రజాడైరీ , యువకళావాహిని ,100 సంవత్సరాల తెలుగు సినిమా ఉత్సవాలు ,ఫిలిం నగర్ దైవ సన్నిధానం, పి .ఎస్ .ఆర్ పురస్కారం ,డెక్కన్ ఉడ్ జీవిత సాఫల్యం, కమలాకర కళా భారతిలాంటి సంస్థలు భగీరథ కు అవార్డులను అందించాయి .
భగీరథ రచించిన 'నాగలాదేవి ' నవలను బళ్లారి లోని శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం వారు 2025 సంవత్సరం నుంచి బీఎస్సీ విద్యార్థులకు పాఠ్యాంశము గా ఎంపిక చేశారు .
భగీరథ సాహిత్యం పై హైదరాబాద్ విశ్వవిద్యాలం లో పరిశోధన జరుగుతుంది .
భగీరథ రచనలు :
1. మానవత, కవితాసంపుటి -1980
2. అంతంకాదిది ఆరంభం , నవల 1983
3. నిత్య నూతన కథా నాయకుడు, జీవిత చరిత్ర -1993
4. జమునాతీరం, జీవిత చరిత్ర - 2000
5. మహార్జాతకుడు, జీవిత చరిత్ర- 2004
6. దసరా బుల్లోడు, జీవిత చరిత్ర- 2005
7. మెట్టింటి గడప, కథలు 2005
8. సావేరి, నవల, 2010
9. సీతమ్మ, జీవిత చరిత్ర- 2012
10. తెలుగు సినిమా ప్రగతి, వ్యాసాలు 2013
11. ప్రజల మనిషి - జీవిత చరిత్ర -2014
12. అక్షరాంజలి, కవితాసంపుటి -2015
13. భగీరథ పథం, వ్యాసాలు -2018
14. భారతమెరికా , రెండు దేశాల సంబంధాలు - 2020
15. మహానటుడు, ప్రజానాయకుడు –జీవిత చరిత్ర - 2022
16. నాగలాదేవి, శ్రీకృష్ణదేవరాయల ప్రేమ కథ - 2021
17. శ కపురుషుడు ప్రత్యేక సంచిక. 2024
18. తారకరామం, ప్రత్యేక సంచిక -2025
19. మీర్జాపురంరాణి కృష్ణవేణి - జీవిత చరిత్ర- 2025.
Comments
Post a Comment