సావేరి 'నిష్ఫల ప్రేమ'.
మేల్ ప్రాస్టిట్యూషన్ గురించి తెలుగు సాహిత్యంలో వచ్చిన నవలలు చాలా అరుదు. ఈ నేపథ్యంతో నవల రాయడం సాహసమే. ఇటువంటి సాహసాన్నిసీనియర్ జర్నలిస్ట్ మరియు రచయిత అయిన భగీరథ గారు తన రెండో నవల ‘సావేరి’ ద్వారా చేశారు. ఈ నవల ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడింది. 2010 లో నవలగా వెలువడింది. ఈ సంస్కృతి గురించి అప్పట్లో దిన పత్రికలో వచ్చిన ఓ వార్త ఆధారంగా ఈ నవలను రాసినట్టు రచయిత తన ముందుమాటలో పేర్కొన్నారు. అలాగే ఈ సావేరి కథను సినిమాగా తీయాలని నటి జయసుధ గారు అనుకున్నప్పటికి అది సాధ్యపడలేదని కూడా రాశారు.
కలకత్తా వేదికగా ఈ కథ జరిగినా, ఈ కథ ద్వారా మనసులు మలీనం కానంతవరకు శరీరాలు కావు అని చెప్పే ప్రయత్నం చేసినా ఆ సూత్రం ఒక్క శ్రీరాజ్ పాత్రకు మాత్రమే వర్తించి, గీతాంజలి పాత్రకు అంతగా వర్తించలేదేమో అనిపిస్తుంది.
శ్రీరాజ్ అనే యువకుడు అమెరికాలో విద్య పూర్తి చేసుకుని హైదరాబాద్ లో స్థిరపడతాడు. ఒక ఎలక్ట్రానిక్ కంపెనీలో సాంకేతిక సలహాదారుడుగా నియమితులవుతాడు. ఆ సందర్భంగా పరిచయాలు పెంచుకొవడానికి స్టార్ హోటల్ లో ఓ పార్టీ ఏర్పాటు చేస్తాడు. ఆ పార్టీకి శరశ్చంద్ర తన కూతురు సావేరితో వస్తాడు. శ్రీ రాజ్ కు వయసు ముప్పై పైనే ఉన్నా ఇంకా వివాహం కాలేదు. అతన్ని చూశాక తన కూతురు సావేరితో వివాహం జరిపించాలని నిశ్చయించుకుంటాడు. ఆ విషయం స్వయంగా శ్రీరాజ్ తో చెప్పకుండా తన ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తాడు. ఆ ఇంటికి వెళ్ళాక సావేరి అభిరుచులు, సంగీతంలో ఆమెకున్న ప్రవేశం శ్రీరాజ్ కు నచ్చుతాయి.
సావేరి తల్లి గీతాంజలి.
భర్త ఆహ్వానం మేరకు ఇంటికి వచ్చిన శ్రీరాజ్ ను చూసి గీతాంజలి స్పృహ తప్పుతుంది.
పెళ్లి అయిన కొత్తలో గీతాంజలి తన భర్తతో కలిసి ఓ సారి కలకత్తా వెళ్లింది. గీతాంజలి, ఆమె భర్త ఇద్దరు ధనవంతులే. గీతాంజలి స్నేహితురాలు ఆముక్త . ఆమె వైద్యురాలు . భర్త వల్ల తనకు సంతానం కలిగే అవకాశం లేదని స్నేహితురాలు చెబుతుంది. కలకత్తా హోటల్ లో పక్క రూమ్ లో ఉండే స్త్రీ పరిచయమవుతుంది . ఆమె సరదాగా మగవాళ్ళతో ఉండవచ్చని, కావాలంటే కాంటాక్ట్ చేయమని, తాను కూడా అలానే గడుపుతానని, భర్త తనను నిర్లక్ష్యం చేస్తాడని ఆమె చెప్తుంది. అలాంటి చర్యను మొదట వ్యతిరేకించినా ఆ తర్వాత ఆమె మనసు దానిపై లగ్నమవుతుంది . అలా రాజ్ అనే వ్యక్తితో పరిచయం , అతనితో ఇంకో హోటల్ లో రూమ్ తీసుకుని వారం గడుపుతుంది. వారిద్దరి మధ్య మానసికమైన బంధం ఏర్పడుతుంది.
తల్లిదండ్రులు మరణించి అనాథ గా మారిన రాజ్ తాను చదువుకోవడం కోసం మొదటి సారి అలా చేస్తున్నాడని తెలిసి అతనికి బ్లాంక్ చెక్ ఇచ్చి, ఇక తననెప్పుడు జీవితంలో కలిసే ప్రయత్నం చేయవద్దని చెప్తుంది. రాజ్ జీవితంలో మొదటి స్త్రీ ఆమె. ఆమె తన కన్నా పెద్దది మరియు వివాహిత అయినా ఆమెను తన ప్రేమ సామ్రాజ్ణిగా భావిస్తాడు రాజ్. ఆమెనే ఆరాధిస్తాడు.
ఆ రాజే ఈ శ్రీరాజ్. గతమంతా గుర్తుకు వచ్చిన గీతాంజలి అతన్ని గుర్తు పట్టి స్పృహ తప్పుతుంది.
ఆ తర్వాత ఆమె శ్రీరాజ్ కు కాల్ చేసి తానెవరో గుర్తు చేసి, సావేరి అతని కూతురు అని చెబుతుంది. ఆ తర్వాత అతను ఆ చెక్ లో రెండు లక్షలు డ్రా చేయడం వల్ల అతని పట్ల అసహ్యం కలిగిందని చెప్తుంది. ఇప్పుడు మరలా తన జీవితం నుండి వెళ్లిపోవడానికి ఇంకా డబ్బు ఇస్తానని చెప్తుంది. తనకు పెళ్లి చూపులు అని ఎవరు చెప్పలేదని, అమెరికాలో చదువుకునే అవకాశం రావడంతో తానే ఆ డబ్బు వాడుకున్నానని శ్రీరాజ్ చెప్పినా చెప్పినా ఆమె అర్ధం చేసుకోదు.
తాను ఎవరి ముందైతే గొప్పగా ఉండాలని, గౌరవం పొందాలని భావించాడో, ఎవరినైతేఇంతకాలం ప్రేమించాడో, ఆమె తనను అలా అపార్ధం చేసుకుని నిందించడంతో, శ్రీరాజ్ కు జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకుంటాడు . తన ఆస్తి మొత్తం సావేరికి చెందేలా రాస్తాడు. తనను అపార్ధం చేసుకోవద్దని గీతాంజలి పేరు మీద ఉత్తరం రాస్తాడు.
ఈ నవలలో ప్రేమ కేవలం శ్రీరాజ్ వైపు నుండి మాత్రమే చిత్రీకరించబడింది. గీతాంజలి ప్రేమలో స్వార్ధం, ప్రయోజనం ఉన్నట్టు అనిపిస్తుంది. ఆమె ఉదారంగా డబ్బు ఇచ్చి అది ఖర్చు పెట్టుకున్నందుకు శ్రీరాజ్ పై అసహ్యం పెంచుకుంటుంది.ఆమెది అవకాశవాదం తప్ప ప్రేమగా అనిపించదు. తన అవకాశవాదంలో తన విలువలు నశించినా, వాటికి గొప్పతనం ఆపాదించుకుని, పక్క వారిని నిందించే మనస్తత్వం ఆమెది. శ్రీరాజ్ స్వచ్చంగా ప్రేమించినా, ఆ ప్రాణ త్యాగం గొప్ప విలువగా పాఠకుల హృదయాన్ని చేరుకోలేదేమో అనిపిస్తుంది. ఈ నవలలో విభిన్న ప్రయోగం చేసిన రచయిత, దీని ద్వారా ప్రేమ ఒకరిలో మాత్రమే ఉంటే,ఎదుటి వ్యక్తి తన అవకాశవాదంతో ఆ ప్రేమించిన వ్యక్తిని అందరికీ పరిచయం చేసే పరిస్థితులు లేకపోవడం, తమ రహస్యం కాపాడుకోవటానికి మారిపోయే తీరును చాలా స్పష్టంగా చెప్పారు. సావేరి నవల సరికొత్తగా ఉండి పాఠకులను ఏకబిగిన చదివించే శైలి దీని ప్రత్యేకత .
- శృంగవరపు రచన - జూన్ 21, 2022.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి