అభ్యుదయ దర్శకుడు, అసమాన దార్శనికుడు  

గూడవల్లి రామబ్రహ్మం  


తెలుగు సినిమా చరిత్రలో గూడవల్లి రామ బ్రహ్మం గారిది  ఓ సంచలన అధ్యాయం.  సినిమా కేవలం వినడా సాధనం మాత్రమే కాదు, దీని ద్వారా సామాజిక ప్రయోజనం సాధించవచ్చునని నిరూపించిన అభ్యుదయ దర్శకుడు రామ బ్రహ్మం. ఆయన మొదట జర్నలిస్ట్ , ఆ తరువాత సినిమా దర్శకుడు. 


ఈ రెండు మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను  చేయాలని నిరంతరం కృషి చేసిన అభ్యుదయ మూర్తి , చైతన్య స్ఫూర్తి రామ బ్రహ్మం. ఆయన   జూన్ 24, 1898 న కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలము నందమూరు గ్రామంలో గూడవల్లి వెంకయ్య, బాపమ్మలకు  జన్మించాడు.  ఆయన చదువు ఇందుపల్లి, గుడివాడ, బందరులలో సాగింది. చిన్నప్పటి నుంచి ఎంతో చురుకుగా ఉండేవాడు . 

18 ఏళ్ళ వయసులో  కోగంటి నాగయ్య కుమార్తె శారదాంబతో రామ బ్రహ్మానికి వివాహం జరిగింది.మామ గారి ఇంట్లో  కొన్నాళ్ళు ఉండి గాంధీ గారి పిలుపుతో సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు.

1924లో విజయవాడలో ఫ్రెండ్స్ అండ్ కో అనే పేరుతో ఒక గడియారాల వ్యాపారం ప్రారంభించాడు. అయితే అక్కడ వ్యాపారం స్నేహితులతో , రాజకీయ , సాహిత్య సమావేశాలకు ఒక వేదికగా మారింది. అందులో నష్టం రావడంతో 1930లో మూసివేశాడు.  


1931లో అఖిలాంధ్ర రైతు మహాసభను ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. 1932లో చల్లపల్లి జమిందారు రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ గారితో పరిచయం ఏర్పడింది. ప్రజలకు సేవ చెయ్యాలంటే రాజకీయాల్లో ప్రవేశించాలని శివరామ ప్రసాద్ గారికి చెప్పి ఒప్పించాడు . కృష్ణా జిల్లా బోర్డు అధ్యక్షుడుగా పోటీ చెయ్యమని ఒత్తిడి చేశాడు . అయితే అప్పటికే ఆ బోర్డుకు అధ్యక్షుడుగా మీర్జాపురం రాజా మేకా వెంకట్రామయ్య అప్పారావు వున్నారు. వీరిద్దరూ ఆ పదవికి పోటీపడ్డారు. రామ బ్రహ్మం గారు చల్లపల్లి రాజాగారి తరుపున తన అనుచరులతో ప్రచారం నిర్వహించాడు. అప్పటికే  'ప్రజా మిత్ర 'అనే వార పత్రికను రాజావారి సహాయంతో విజయవాడలో ప్రారంభించారు. ఈ పత్రికలో కూడా రాజా శివరామ ప్రసాద్ గారికి అనుకూలమైన వ్యాసాలు వ్రాయించాడు . 

ఆ ఎన్నికల్లో శివరామ ప్రసాద్ గారు విజయం సాధించారు . 1933లో కృష్ణా జిల్లా బోర్డు అధ్యక్షుడుగా  పదవీ బాధ్యతలు చేపట్టారు . 


1934లో ఆంధ్ర నాటక పరిషత్ కు రామబ్రహ్మం కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. 

 కమ్మ కుల చరిత్ర అనే  పుస్తకం వ్రాయడం కోసం రామ బ్రహ్మం కడపకు వెళ్ళాడు. అక్కడ గండికోట చరిత్ర తెలుసుకొని  ఆ కోట గురించి పరిశోధన చేసి 'గండికోట పతనం' అనే నాటకం వ్రాశాడు. అది రామ బ్రహ్మం కు మంచి పేరు తీసుకొచ్చింది . 

ప్రజా మిత్ర ను విజయవాడ నుంచి మద్రాసుకు మార్చాడు. ఈ పత్రికలో సముద్రాల రాఘవాచార్య, కుర్రా సుబ్బారావు, నార్ల వెంకటేశ్వరరావు, ఆండ్ర శేషగిరిరావు, ముద్దా విశ్వనాథం, బోయి భీమన్న సహాయ సంపాదకులుగా పనిచేశారు . 

బుక్కపట్నం రాఘవాచార్యులు, గుత్తికొండ నరహరి, నందగిరి ఇందిరాదేవి, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, దిగవల్లి వేంకటశివరావు, తాపీ ధర్మారావు, కపిల కాశీపతి, తుమ్మల సీతారామమూర్తి చౌదరి, త్రిపురనేని గోపీచంద్, బి .టి.రాఘవాచార్యులు, కొసరాజు రాఘవయ్య చౌదరి, గొల్లపూడి సీతారామశాస్త్రి, ఏజెళ్ళ శ్రీరాములు చౌదరి, ఏటుకూరి వెంకట నరసయ్య, వేలూరి శివరామశాస్త్రి, భోగరాజు పట్టాభి సీతారామయ్య లాటి ఉద్దండులైన వారు వ్యాసాలు వ్రాసేవారు . 


మద్రాసు లో ఆయనకు వెల్ పిక్చర్స్ నిర్మాత, స్టూడియోస్ అథినేత  పి .వి .దాసు గారితో పరిచయం అయ్యింది. దాసు గారు చిత్రపు నరసింహారావు దర్శకత్వంలో రూపొందించిన  'శ్రీ కృష్ణ లీలలు' , తరువాత హెచ్ .వి .బాబు దర్శకత్వంలో కృత్తివెన్ను బ్రదర్స్ నిర్మించిన   'ద్రౌపదీ వస్త్రాపహరణం'  సినిమా నిర్మాణ సమయంలో రామ బ్రహ్మం పాల్గొన్నాడు. 1937లో కృత్తివెన్ను నాగేశ్వర రావు దర్శకత్వంలో ఇండియన్ మూవీ టోన్ నిర్మించిన ' ప్రేమ విజయం 'అనే సాంఘిక చిత్రం విడుదలయ్యింది . అప్పటి వరకు పౌరాణిక చిత్రాలే నిర్మాణమవుతున్నాయి. తొలిసారి సాంఘిక ఇతివృత్తం తో నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులు అంతగా ఆదరించలేదు. అయితే ఈ సినిమా రామ బ్రహ్మం గారిలో సరికొత్త ఆలోచనకు బీజం వేసింది . సినిమా ద్వారా ప్రజలను వినోద  పర్చడం తో పాటు చైతన్యవంతం చెయ్య వచ్చునని గ్రహించాడు. 

1937లో రాజా శివరామ ప్రసాద్ గారు జస్టిస్ పార్టీ తరుపున మద్రాసు శాసన సభకు ఎన్నికయ్యారు. 

అదే సంవత్సరం డిసెంబర్ లో రాజా శివరామ ప్రసాద్ చైర్మన్ గా , తాను మేనేజింగ్ డైరెక్టర్ గా  సారథి చిత్ర అనే చిత్ర నిర్మాణ సంస్థను  స్థాపించాడు.


దేశంలో బ్రాహ్మణేతరుల పరిస్థితి,   గాంధీజీ హరిజనోద్ధరణ ఉద్యమం జరుగుతున్న  నేపథ్యంలో రామబ్రహ్మం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఓ కథను గుడిపాటి వెంకటాచలంతో  తయారు చేయించాడు . అదే 'మాలపిల్ల' దీనికి  తాపీ ధర్మారావు మాటలు  వ్రాశాడు.

భీమవరపు నరసింహారావు సంగీత దర్శకత్వంలో బసవరాజు అప్పారావు , తాపీ ధర్మారావు పాటలు  వ్రాశారు . 

చలం , తాపీ ధర్మారావు ఇద్దరు ఆనాటి  సమాజంలో కుల వివక్షపై పోరాటం చేస్తున్న రచయితలు కావడం విశేషం . 

కాంచనమాల , గోవిందరాజుల సుబ్బారావు, గాలి వెంకటేశ్వర రావు, పువ్వుల సూరి బాబు , లక్ష్మి కాంతం , వంగర  వెంకట సుబ్బయ్య , హేమలతాదేవి, సుందరమ్మ ఈ సినిమాలో నటించారు . 

'మాలపిల్ల' సినిమా  1938 సెప్టెంబరు 25న విడుదల అయింది.  11 కేంద్రాలలో ఈ  సినిమా సంచలన విజయం సాధించింది . 

ఈ  సినిమాను  నిషేధించాలని చాలా ప్రయత్నాలు జరిగాయి.కులాల మధ్య చిచ్చురేపుతున్నారనే వాదన కూడా బయలుదేరింది .  సమాజంలో అలజడి కలిగిస్తున్న ఈ  సినిమాను  నిషేధించాలనే ప్రయత్నం ఫలించలేదు . ప్రభుత్వం ఏ చర్యా తీసుకోలేదు .

'మాలపిల్ల ' చిత్రంలో నటించిన  కథానాయిక కాంచనమాల అగ్రశ్రేణి తార అయ్యింది . 

1939లో ఆనాటి  జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా నిర్మించిన సినిమా 'రైతుబిడ్డ'. 


ఈ సినిమాకు రామబ్రహ్మం స్వయంగా కథ సమకూర్చగా త్రిపురనేని గోపీచంద్ మాటలు వ్రాశాడు. 

ఈ సినిమాలో బళ్లారి రాఘవ, గిడుగు వెంకట సీతాపతి, కొమ్మూరి పద్మావతీదేవి, ఎస్.వరలక్ష్మి, భీమవరపు నరసింహరావు, పి సూరిబాబు.

కొసరాజు రాఘవయ్య చౌదరి , వేదాంతం రాఘవయ్య  నటించారు . 

ఇందులో ,కొసరాజు  రాఘవయ్య చౌదరి , బసవరాజు అప్పారావు , తాపీ ధర్మారావు , తుమ్మల సీతారామ మూర్తి,  గూడవల్లి రామ బ్రహ్మం, నెల్లూరు వెంకట్రామ నాయుడు  పాటలు వ్రాయగా భీమవరపు నరసింహారావు సంగీతం సమకూర్చాడు . 

'మాలపిల్ల' చిత్రాన్ని నిషేధించాలని కొంత మంది అప్పట్లో ప్రయత్నించారు . కానీ విజయం సాధించలేదు.   

'రైతు బిడ్డ' లో జమీందార్ల చర్యలను  నిరసించిన ఈ సినిమాను నిర్మించినది చల్లపల్లి రాజా శివరామ ప్రసాద్ . ఆయన  జస్టిస్ పార్టీలో ఒక వర్గానికి నాయకుడు. ఆ పార్టీ లో  ప్రత్యర్థి వర్గానికి నాయకుడు మీర్జాపురం రాజా మేకా వెంకట్రామయ్య అప్పారావు . ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు . ఆయనతో పాటు వేంకటగిరి, బొబ్బిలి రాజాలు కూడా ప్రభుత్వంపై వత్తిడి తీసుకు వచ్చారు . 

'రైతు బిడ్డ ' సినిమా 1939 ఆగస్టు 27 న విడుదలైంది . జమీందార్ల వత్తిడికి ప్రభుత్వం తలొగ్గి ఈ సినిమాను నిషేదించారు . 

ఒక తెలుగు సినిమాను ప్రభుత్వం నిషేధించడం 'రైతు బిడ్డ 'తో మొదలైంది . 

ఆ తరువాత 'ఇల్లాలు', 'అపవాదు ', 'పత్ని ', 'పంతులమ్మ', 'మాయాలోకం ' చిత్రాలకు దర్శకత్వం వహించాడు .

రామ బ్రహ్మం అభ్యుదయ భావాలు కల దర్శకుడు . సమాజంలో కుల , మతాలూ ఉండకూడని నమ్మేవారిలో రామ బ్రహ్మం ఒకరు .

అందుకే ఆయన ద్రుష్టి 'పల్నాటి యుద్ధం ' మీద పడింది . 

12వ శతాబ్దంలో పల్నాడులో జరిగిన యుద్ధం . కులాలు , మతాల మధ్య జరిగిన భీకర యుద్ధం . 

గురజాల రాజ్యాన్ని పాలిస్తున్న నలగామరాజు మంత్రివర్గంలో కీలకమైన శాఖ నిర్వహించే నాగమ్మ , ఆమె వీర శైవ మతాభిమాని . 

మాచర్ల రాజ్యాన్ని పాలించే మలిదేవరాజు మంత్రి బ్రహ్మనాయుడు . వీరు వైష్ణవ మతాభిమాని , చెన్నకేశవ భక్తుడు . 


"నా పలనాడు వెలలేని మాగాణిరా!" అని  బ్రహ్మనాయుడు  కీర్తించాడు. మనుషులందరూ సమానమేనని, కులమతాలు మనం  సృష్టించుకొన్నవేనని చెప్పిన ఆదర్శవాది బ్రహ్మనాయుడు . అంతేకాదు క్రింది వార్గాలవారితో కులమత భేదాలు లేవని చెప్పడానికి ఒకే పంక్తిలో భోజనాలు ఏర్పాటుచేశాడు. ఇదే చాపకూటి సిద్ధాంతం. అంతేకాదు అందరికీ దేవాలయ దర్శనం  కూడా చేయించాడు .

దీనిని నాయకురాలు నాగమ్మ పూర్తిగా వ్యతిరేకించింది . 

అటు గురజాల , ఇటు మాచర్ల రాజ్యాల మధ్య ఘర్షణ క్రమంగా  మారి 1178 నుంచి 1182 మధ్య  కారంపూడి దగ్గర యుద్ధం జరిగింది . 

ఈ యుద్ధం లో రెండు రాజ్యాల మధ్య జన నష్టం, ఆస్తి నష్టం జరిగింది. 

రామబ్రహ్మం దీనిని చిత్రంగా రూపొందిచాలనుకున్నాడు . ఈ సినిమాను స్వయంగా నిర్మించాలనుకుని తన అర్ధాంగి శారదాంబ పేరుతో శ్రీ శారదా ప్రొడక్షన్స్ సంస్థను ఏర్పాటుచేశారు . ఈ సినిమాలో బ్రహ్మనాయుడుగా గోవిందరాజుల సుబ్బారావు , బాల చంద్రుడుగా అక్కినేని నాగేశ్వర రావు , నాగమ్మగా కన్నాంబ ,నరసింగరాజుగా ముదిగొండ లింగ మూర్తి , మాంచాల గా ఎస్ .వరలక్ష్మి ని ఎంపిక చేసుకున్నాడు . 

గాలిపెంచల నరసింహారావు సంగీత దర్శకుడు , మాటలు, పాటల కోసం సముద్రాల రాఘవాచార్యులును నిర్ణయించాడు .


ఈ భారీ చారిత్రాత్మక సినిమా 1945లో మొదలయ్యింది . కొంత భాగం  షూటింగ్ చేశాక రామ బ్రహ్మం గారి ఆరోగ్యం దెబ్బతింది . అంతకు ముందే ఆయన మధుమేహంతో బాధపడుతున్నాడు . షూటింగ్ వత్తిడి ఎక్కువయ్యింది , ఆరోగ్యం క్షీణించింది . 

అక్టోబర్ 1, 1946న అభ్యుదయ దర్శకుడు రామ బ్రహ్మం గారు ఇహలోక యాత్ర ముగించారు .

ఆ తరువాత ఈ సినిమాను దర్శకుడు ఎల్ .వి. ప్రసాద్ పూర్తి చేసి 24 సెప్టెంబర్ 1947లో విడుదల చేశారు. 

ఈ సినిమా ప్రారంభంలో గూడవల్లి రామ బ్రహ్మం అంతిమ యాత్ర దృశ్యాలను చూపించి , ఆయనకు నివాళులర్పించారు .

'పల్నాటి యుద్ధం ' సినిమా ఘన విజయం సాధించి గూడవల్లి రామ బ్రహ్మం కలను సాకారం చేసింది .


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు