హైదరాబాద్ సినిమాకు మార్గదర్శకుడు
- దుక్కిపాటి మధుసూదన రావు
సినిమా నిర్మాత అంటే ...?
కేవలం డబ్బు పెట్టేవాడు కాదు . సినిమా రంగం , ఆ రంగంలోని అన్ని శాఖల గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు .
కథ , కథనం , మాటలు , పాటలు , సంగీతం , నటీనటులు , సాంకేతిక నిపుణులు , సినిమా చిత్రీకరణకు అనువైన స్థలాల ఎంపిక , నిర్మాణం , సినిమా ప్రచారం , పంపిణీ, ఇవ్వన్నీ సంపూర్ణంగా తెలిసినవాడే అసలైన చిత్ర నిర్మాత. అలాంటివారిలో నిస్సందేహంగా దుక్కిపాటి మధుసూనరావు గారు మొదటి వరుసలో వుంటారు.
మధుసూదనరావు గారు అనుభవం, అభిరుచి కల నిర్మాత. సమాజానికి సందేశాత్మ చిత్రాలను అందించాలనే స్పృహ వున్న మంచి మనిషి .
అన్నపూర్ణ పిక్చర్స్ దుక్కిపాటి మధుసూదన రావు గారు హైదరాబాద్ చలన చిత్ర అభివృద్ధిలో నిర్వహించిన పాత్ర అపూర్వం , అనితర సాధ్యం. అక్కినేని నాగేశ్వర రావు సినిమా జీవితాన్ని తీర్చిదిద్దింది దుక్కిపాటి మధుసూదన రావు గారే. అక్కినేని కోసం ఆయన సినిమా
రంగానికి వచ్చారు , అక్కినేని కోసమే చిత్ర నిర్మాణం మొదలు పెట్టారు . ఆయనతో పాటు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేశారు .
దుక్కిపాటి మధుసూదన రావు, సీతారామ స్వామి, శ్రీమతి గంగాజలం దంపతులకు 17 జూలై, 1917 తేదీన కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా పెయ్యేరు గ్రామంలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లి చనిపోయింది . సవతితల్లి అన్నపూర్ణ మధుసూదన రావు ను పెంచి పెద్దచేశారు.
పెయ్యేరులో ప్రాధమిక విద్య అనంతరం గుడివాడలో స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నాడు . బందరు నోబుల్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రధమ శ్రేణిలో ఉతీర్ణుడయ్యాడు. మెడిసిన్ చదవాలనే కోరికతో మద్రాసు మెడికల్ కాలేజీ లో సీట్ కోసం దరఖాస్తు పెట్టారు . ఆ కాలేజీలో సీట్ కేవచ్చింది. అయితే అదే సందర్భంలో తండ్రి గారు అస్వస్థకు గురయ్యారు . అప్పుడు చదువుకు స్వస్తి చెప్పి తండ్రిని చూసుకుంటూ స్వంత వూరిలో వ్యవసాయ పనులపై ద్రుష్టి పెట్టాడు .
అదే సమయంలో పుస్తకాలు చదవడం , ఊరి దేవాలయంలో వేదాంతం రాఘవయ్య ప్రదర్శించే కూచిపూడి నాటకాలు చూడటం అలవాటయ్యింది . తండ్రి ఆరోగ్యం మెరుగుపడటంతో బందరు కాలేజ్ లో చేరి బి.ఏ ., చదివాడు. పెయ్యేరుకు సమీప గ్రామం ముదినేపల్లిలో ఎక్సెల్సియల్ అనే సంస్థను ప్రారంభించారు. దీనికి కార్యదర్శి గా పనిచేస్తూ అనేకమంది గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం , పోటీలు నిర్వహించడం చేస్తుండేవాడు . కోడూరి అచ్చయ్య సలహా , సహాయంతో ఎక్సెల్సియల్ లో నాటక విభాగాన్ని ప్రారంభించారు . ఈ సంస్థలో మధుసూదన రావు తో పాటు ఎమ్ .ఆర్ .అప్పారావు , పెండ్యాల, బుద్ధిరాజు శ్రీరామమూర్తి లాంటివారు ఉండేవారు . అప్పటివరకు పౌరాణిక నాటకాలనే ప్రదర్శిస్తూ ఉండేవారు . అయితే సాంఘిక నాటకాల ఆవశ్యకతను మధుసూదన రావు గుర్తించి వాటిని ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు .
అదే సమయంలో వారు నాయిక పాత్రధారి కోసం అన్వేషిస్తున్నారు . ఆ సమాజంలోనే వున్న పెండ్యాల నాగేశ్వర రావు, అక్కినేని నాగేశ్వర రావు గురించి చెప్పాడు . మధుసూనరావు గారు ఆ రకంగా అక్కినేనిని చూసి తమ కంపెనీలో నాయిక కోసం ఎంపిక చేసుకున్నాడు . మధుసూదన రావు అన్ని ప్రాతాల్లో నాటకాలు వేయిస్తున్నాడు . ఒకసారి తెనాలిలో నాటకం వేసి గుడివాడ వస్తున్నారు , బెజవాడ రైల్వే స్టేషనులో ఘంటసాల బలరామయ్య దృష్టిలో అక్కినేని పడ్డారు. అప్పుడు ఆయన 'సీతారామ జననం ' అనే సినిమా నిర్మించే ప్రయత్నంలో వున్నారు . తాను అన్వేషిస్తున్న శ్రీరాముడు లక్షణాలు అక్కినేనిలో కనిపించాయి . ఆ తరువాత నాగేశ్వర రావు తో పాటు ఆయన సోదరుడు రామ బ్రహ్మం , దుక్కిపాటి కూడా మద్రాసు వెళ్లారు . అక్కినేని శ్రీరామ జననం సినిమాలో ఎంపికయ్యారు .అయితే 1941లో అక్కినేని దర్శకుడు పి .పుల్లయ్య 'ధర్మపత్ని' అనే సినిమాలో ఓ చిన్న వేషం ఇవేశారు. మళ్ళీ మూడు సంవత్సరాల తరువాత 1944లో ఘంటసాల బలరామయ్య రూపంలో అదృష్టం తలుపు తట్టింది .ఆ తరువాత గూడవల్లి రామ బ్రహ్మం తో దుక్కిపాటి మాట్లాడి 'మాయాలోకం ' సినిమాలో అవకాశం ఇప్పించారు . ఈ సినిమా 1945 అక్టోబర్ 10న విడుదలై ఘనవిజయం సాధించింది .
ఎక్సెల్సియల్ సమాజంలో ఉన్నవారంతా వెళ్లిపోయారు. అప్పటికే మధుసూదన రావు దృష్టి సినిమా రంగంపై పడింది. 10 సెప్టెంబరు 1951న అక్కినేని నాగేశ్వరరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు, టి.వి.ఎ.సూర్యారావులతో కలసి తన సవతి తల్లి పట్ల కృతజ్ఞత తో అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థను ప్రారంభించారు . అప్పుడు ఆయన తన మొదటి సినిమా ను దర్శకుడు కె .వి .రెడ్డి తో నిర్మించా లనుకున్నారు . అయితే వెంటనే తాను సినిమా చేయలేనని రెడ్డి గారు చెప్పారు . ఎన్నాళ్లయినా ఉంటానని మధుసూదన రావు చెప్పారు . అలా తన మొదటి సినిమా 'దొంగ రాముడు 'సినిమాను కె .వి .రెడ్డి తోనే రూపొందించారు . ఈ సినిమాలో అక్కినేని, సావిత్రి , జమున నటించారు . దొంగరాముడు అక్టోబర్ 1, 1955లో విడుదలైంది .
శ్రీ సారధి ఫిలిమ్స్ రామకృష్ణ ప్రసాద్ సమర్పకుడుగా తాపీ చాణిక్య దర్శకత్వంలో సి .వి .ఆర్ .ప్రసాద్ నిర్మించిన 'రోజులు మారాయి ' సినిమా 1955 ఏప్రిల్ 14న విడుదలై ఘన విజయం సాధించింది . ఈ సినిమా సికింద్రాబాద్ రాజేశ్వరి థియేటర్ లో 100 రోజులు ప్రదర్శించారు, నాగేశ్వర రావు , షావుకారు జానకి నటించారు . ఈ సినిమా శత దినోత్సవంలో అప్పటి హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణా రావు మంత్రివర్గం లో వ్యవసాయ శాఖామంత్రి మర్రి చెన్నా రెడ్డి , ఎక్సైజ్ శాఖా మంత్రి కె .వి .రంగా రెడ్డి అతిధులుగా పాల్గొన్నారు .
ఆ తరువాత రోజు చెన్నా రెడ్డి , రంగా రెడ్డి , అక్కినేని , మధుసూదన రావు, సి .వి .ఆర్ .ప్రసాద్ ను అఅల్పాహారానికి ఆహ్వానించారు . హైద్రాబాద్ లో తెలుగు సినిమా రంగం అభివృద్ధి చెందటానికి తమ ప్రభుత్వం సహాయం చేస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు . వారి మాటలను గౌరవించి 1956లో రామకృష్ణ ప్రసాద్ అమీర్ పెట్ లో శ్రీ సారధి స్టూడియోస్ ను నెలకొల్పారు .1956 నవంబర్ 1న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటయింది. మొదట ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి నియమితులయ్యారు . రెండవసారి 1962 నుంచి 64 వరకు మళ్ళీ ముఖ్యమంత్రిగా సజీవ రెడ్డి గారే ఎంపికయ్యారు. ఈ సమయం లోనే 1963లో మధుసూదన రావు 'చదువుకున్న అమ్మాయిలు ' సినిమాను హైద్రాబాద్లో నిర్మించారు . 1964లో తెలుగు సినిమాలకు నంది అవార్డులను ప్రవేశ పెట్టారు . హైదరాబాద్ లో నిర్మించే సినిమాలకు సబ్సిడీ కూడా ఇస్తామని సంజీవరెడ్డి గారు ప్రకటించారు .
1965లో అక్కినేని నాగేశ్వర రావు తన మకాం ను మద్రాస్ నుంచి హైదరాబాద్ కు మార్చారు .
1978లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ మర్రి చెన్నా రెడ్డి నియమితులయ్యారు . వీరు నాగేశ్వర రావు , మధుసూదన రావు ఇద్దరికీ ఆత్మీయులు . చెన్నారెడ్డి గారు సినిమా కళాకారులకు , సాంకేతిక నిపుణులకు హైద్రాబాద్ లో స్థలాలు మంజూరు చేశారు . అదే నేటి ఫిలిం నగర్ . దీనికి మొదటి అధ్యక్షులు దుక్కిపాటి మధుసూదన రావు గారే .
మధుసూదన రావు గారు తోడికోడళ్ళు (1957), మాంగల్యబలం (1958), వెలుగునీడలు (1961), ఇద్దరు మిత్రులు (1961), చదువుకున్న అమ్మాయిలు (1963), డాక్టర్ చక్రవర్తి (1964), ఆత్మ గౌరవం (1966), పూలరంగడు (1967), విచిత్రబంధం (1972), ప్రేమలేఖలు (1977), రాధాకృష్ణ (1978), పెళ్లీడు పిల్లలు (1982), అమెరికా అబ్బాయి (1987) చిత్రాలను రూపొందించారు .
కొర్రపాటి గంగాధరరావు, యుద్దనపూడి సులోచనరాణి, గొల్లపూడి మారుతీరావు, ముప్పాళ్ల రంగనాయకమ్మ, కె.విశ్వనాథ్ , ఆశాలత కులకర్ణి, జి. రామకృష్ణ, జీడిగుంట రామచంద్ర మూర్తి, శారద లాటివారిని పరిచయం చేశారు.
మధుసూదన రావు గారికి 20 సంవత్సరాల వయసులో సుశీలాదేవితో వివాహమైంది . ఈ దంపతులకు నలుగురు అమ్మాయిలు , ఒక అబ్బాయి . 2006 మార్చి 26న 90 ఏళ్ల వయసులో మధుసూదన రావు గారు తుది శ్వాస విడిచారు .






కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి