"తెలుగు సినిమా రంగాన్ని మద్రాస్ నుంచి తరలిస్తాను "
- సినిమాటోగ్రఫీ మంత్రి చంద్ర బాబు .
ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు .
ఈ సందర్భంగా బాబు గారికి సంబంధించిన 45 సంవత్సరాలనాటి అరుదైన, ఆసక్తిని కలిగించే సంఘటన ఈతరం పాఠకుల కోసం .
1978లో నారా చంద్ర బాబు నాయుడు చంద్రగిరి శాసన సభా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు .
1980లో ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య , సినిమాటోగ్రఫీ మంత్రిగా ఎంపికయ్యారు .
హైదరాబాద్ లో తెలుగు సినిమా ఇంకా పూర్తిగా స్థిరపడలేదు . మద్రాసు నుంచి హైద్రాబద్ కు సినిమాను తరలించడాన్ని ప్రభుత్వం
ప్రయత్నాలు చేస్తుంది .
హైద్రాబాద్ లో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఉంది . ఇది సినిమా జర్నలిస్టులు ఏర్పాటుచేసుకున్న సంస్థ.
అప్పుడు ఆంధ్ర భూమి లో న్యూస్ ఎడిటర్ గా పనిచేసే జి .ఎస్ .వరదాచారి గారు అధ్యక్షులుగా , ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే సినిమా
వార పత్రిక జ్యోతి చిత్ర లో రిపోర్టర్ గా పనిచేసే నేను కార్యదర్శిగా వున్నాము .
అప్పటికే నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న చంద్ర బాబు నాయుడు గారిని జ్యోతి చిత్ర కోసం ఇంటర్వ్యూ చేశాను .
ఈ విషయం ఫిలిం క్రిటిక్స్ కమిటీ మీటింగ్ లో చెప్పాను . అప్పుడు "మన క్రిటిక్స్ మీట్ ది ప్రెస్ ఏర్పాటు చేద్దాము , చంద్ర బాబు నాయుడు
గారిని ఆహ్వానిద్దాము " అన్నారు వరదాచారి గారు. మిగతావారు కూడా ఆ సలహా బాగుంది చంద్ర బాబు గారిని ఆహ్వానించండి అని నాతో చెప్పారు . ఆ బాధ్యత నాకు అప్పగించారు .
అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా చంద్ర బాబు నాయుడు గారు బంజారాహిల్స్ లో ఓ ఇంట్లో ఉండేవారు . ఇది నిమ్స్ వెనుక గేటు ఎదురుగా ఉండేది . నేను మరో మిత్రుడు కలసి చంద్ర బాబు నాయుడు గారిని కలసి ఈ విషయం చెప్పాము .
కేవలం సినిమా పత్రికలే కాదు దిన పత్రికల రిపోర్టర్ లు , పి .టి .ఐ . యు .ఎన్ .ఐ లాంటి వార్తా సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి వస్తారని చెప్పాను . ఆయన అంగీకరించారు .
బషీర్ బాగ్ లోని ప్రెస్ క్లబ్ భవనంలో వున్న ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొనడానికి 1981 మార్చి 16వ తేదీ న సాయంత్రం 6.30 గంటలకు వచ్చారు .
అప్పటికే ప్రెస్ క్లబ్ జర్నలిస్టులతో కిక్కిరిసి పోయింది . చంద్ర బాబు నాయుడు గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా సినిమా జర్నలిస్టులతో పాల్గొన్న మొదటి కార్యక్రమం .
సినిమా పరిశ్రమ గురించి అప్పటికే చంద్ర బాబు నాయుడు గారికి కొంత అవగాహన వుంది .
జర్నలిస్టులు అడిగిన ఎన్నిక ప్రశ్నలకు సమాధానం చెప్పారు . తెలుగు సినిమా రంగాన్ని మద్రాసు నుంచి హైద్రాబాద్ కు తరలిస్తానని
ఈ సందర్భగా ఆయన హామీ ఇచ్చారు .
ఆ తరువాత కొన్నాళ్లకే చంద్ర బాబు నాయుడు గారు సినిమాటోగ్రఫీ మంత్రి హోదాలో మద్రాసు వెళ్లి సినిమా రంగ ప్రముఖులతో
సమావేశమయ్యారు . అప్పటికే చంద్ర బాబు నాయుడు గురించి ఎన్ .టి .రామారావు గారు విన్నారు . స్వయంగా తమ స్టూడియోస్ కు బాబు గారిని ఆహ్వానించారు. అదే సంవత్సరం సెప్టెంబర్ 10న నారా భువనేశ్వరితో చంద్ర బాబు నాయుడు గారి వివాహం మద్రాసులో జరిగింది .
- భగీరథ ,

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి