40 ఏళ్ల నాటి నాగార్జున 'విక్రమ్'
అక్కినేని నాగార్జున నటించిన 'విక్రమ్ ' సినిమా విడుదలై ఈరోజుకు (23 మే 986) 40 సంవత్సరాలు.
నాగార్జున సినిమా జీవితం ప్రారంభించి అప్పుడే నాలుగు దశాబ్దాలు అవుతుందా?
కాలం ఎంత వేగంగా గడిచిపోతుంది ?
1979 ఫిబ్రవరిలో నేను ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే 'జ్యోతి చిత్ర' సినిమా వార పత్రిక లో రిపోర్టర్ గా చేరాను .
అప్పటి నుంచి నాగేశ్వర రావు గారితో నాకు పరిచయం వుంది .అప్పటి నుంచి తరచుగా వారిని కలుస్తూ ఉండేవాడిని.
1984లో నాగేశ్వర రావు గారు నటుడుగా 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఒక రోజు నన్ను వారి ఇంటికి ఆహ్వానించారు .
అప్పుడు నాగేశ్వర రావు గారు బంజారా హిల్స్ లో ఉండేవారు . నేను వెళ్లిన తరువాత హాల్ లోని రమ్మన్నారు .
సాయంత్రం వేళ నేను వెడితే వారితో హాల్ లోనే కూర్చునేవాడిని .
తన 40 సంవత్సరాల సినిమా జీవితం గురించి ఒక ఆర్టికల్ కావాలని నన్ను అడిగారు .
'40 సంవత్సరాల మీ సినిమా జీవితం గురించి నేనా ? అన్నాను' ఆశ్చర్యంగా .
'మీరు రాయగలరు . నేను మద్రాసులో వున్నప్పుడు నా ఆలోచనలకు దగ్గరగా ముళ్ళపూడి వెంకట రమణ గారు వ్రాసేవారు . హైదరాబాద్ వచ్చిన తరువాత మళ్ళీ నా ఆలోచనలకు దగ్గరగా మీరు రాస్తున్నారు ' అని చెప్పారు .
నేను మాట్లాడ లేదు . కాసేపటి రెండురోజులు సమయం ఇవ్వండి అని చెప్పాను . తరువాత రాసి తీసుకెళ్ళాను . చిన్న మార్పులు చేర్పులు చెప్పారు . అలా మార్చి తీసుకెళ్ళాను . దాన్ని నాగేశ్వరరావు గారు బాగుందని చెప్పి , ఆ తరువాత రోజు ఆకాశవాణిలో చదివారు . ఆ ప్రసంగానికి శ్రోతల నుంచి ఊహించని స్పందన వచ్చింది . ఒక వార రోజుల తరువాత మళ్ళీ దానిని పునః ప్రసారం చేశారు .
ఆ తరువాత దాసరి సారధ్యంలో అక్కినేని పుట్టినరోజున ఆంధ్ర జ్యోతి దిన పత్రిక లో ' 40 సంవత్సరాల అక్కినేని ప్రత్యేక సంచిక ' 40 పేజీలతో వెలువడింది . ఆ ప్రత్యేక సంచికను కూడా నేనే విజయవాడ వెళ్లి దగ్గరుండి తయారు చేయించాను . నాగేశ్వర రావు గారికి , దాసరి నారాయణ రావు గారికి బాగా నచ్చింది .
అప్పటి నుంచి నన్ను ఆహ్వానించేవారు . రాంగోపాల్ వర్మ గారి నాన్న కృష్ణం రాజు గారు లేదా కళాదర్శకులు సుబ్బారావు గారు , లేదా ఏలూరు నుంచి వాళ్ళ బావమరిది కొడాలి వెంకటేశ్వర రావు గారు వచ్చినప్పుడు కూడా నన్ను ఆహ్వానించేవారు.
అలా నాగేశ్వర రావు గారి ఇంటికి వెళ్ళినప్పుడల్లా నన్ను భోజనం చెయ్యకుండా వదిలిపెట్టేవారు కాదు . అన్నపూర్ణమ్మ గారు వడ్డించేవారు.
మొదటిసారి వాళ్ళ ఇంట్లో దంపుడు బియ్యం తో వండిన అన్నం తిన్నాను .
1984లో నాగార్జునతో లక్ష్మి వివాహం జరిగినప్పుడు కూడా నాగేశ్వర రావు గారి తరుపున మీడియా ను నేనే ఆహ్వానించాను.
1985 ఆగష్టు రెండవ వారంలో ఇంటికి రమ్మని ఫోన్ చేశారు. ఆరోజు సాయంత్రం నేను వెళ్ళాను .
'నాగార్జునను హీరోగా పరిచయం చేద్దామని అనుకుంటున్నట్టు గతంలో మీకు చెప్పాను . ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేశాము .
వి .మధుసూదన రావు గారిని దర్శకుడుగా నిర్ణయించాము . నాగార్జునను హీరోగా పరిచయం చేస్తున్నట్టు ప్రకటిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నా ' అని నావైపు చూశారు .
'మీరు ప్రకటించడమే కరెక్ట్. ' అన్నాను .
అయితే ప్రెస్ మీట్ పెట్టి నాగార్జునను పరిచయం చేద్దాము ' అన్నారు .
తప్పకుండా , మీరు ఎప్పుడు అనేది చెబితే మీడియా మిత్రులకు సమాచారం పంపిద్దాము ' అన్నాను .
'నేను మీకు కబురు చేస్తాను ' అన్నారు .
ఆగష్టు 21న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో నాగేశ్వర రావు గారు నాగార్జునను హీరోగా పరిచయం చేస్తున్నామని . ఈ సినిమా తన 61వ పుట్టినరోజు సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుందని ప్రకటించారు .
ఈ సినిమా శ్రీమతి అన్నపూర్ణమ్మ సమర్పణలో వెంకట్ అక్కినేని నిర్మిస్తున్నట్టు చెప్పారు .
1985 సెప్టెంబర్ 20న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగేశ్వర రావు గారి 61వ పుట్టినరోజున 'విక్రమ్ 'సినిమా ప్రారంభోత్సవం ఏర్పాట్లు జరిగాయి . మొదటి ఫ్లోర్ ఎదురుగా వున్న కల్యాణ మండపం లో ముహూర్తం షాట్ తీయడానికి ఏర్పాట్లు చేశారు .
నాగార్జున, శోభన మీద తీసిన షాట్ కు దర్శకుడు కె .రాఘవేంద్ర రావు క్లాప్ ఇవ్వగా , మరో దర్శకుడు దాసరి నారాయణ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు .
ఈ ప్రారంభోత్సవానికి మద్రాసు నుంచి నడిగర తిలకం శివాజీ గణేశన్ వచ్చి నాగార్జునను ఆశీర్వదించారు .
నందమూరి తారకరామా రావు తరుపున వారి పెద్ద అబ్బాయి జయకృష్ణ వచ్చారు .
ఈ సినిమా ప్రారంభోత్సవంలో శ్రీమతి అన్నపూర్ణమ్మ , శ్రీమతి లక్ష్మి నాగార్జున పాల్గొని ఆసక్తిగా వీక్షించారు .
ఈ కార్యక్రమంలో అక్కినేని నాగేశ్వర రావు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి