కుద్రేముఖ్ లో వెంకట్, నాగార్జున అప్ సెట్
అక్కినేని నాగార్జున , శోభన జంటగా వి .మధుసూదన రావు గారు దర్శకత్వంలో అక్కినేని అన్నపూర్ణమ్మ గారు నిర్మిస్తున్న 'విక్రమ్' సినిమా 1985 సెప్టెంబర్ 20న అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగేశ్వర రావు గారి పుట్టినరోజున ' ప్రారంభమైంది .
ఆ తరువాత ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలయ్యింది .
'ఈ సినిమాలో కొంత భాగం షూటింగ్ ను కర్ణాటక లోని కుద్రేముఖ్ లో చెయ్యాలని నిర్ణయించామని , అక్కడకి జర్నలిస్టులను తీసుకెళ్లే
బాధ్యతను మీకు అప్పకిస్తున్నామని' ఒక రోజు నాగేశ్వర రావు గారు చెప్పారు .
నాగార్జున మొదటి సినిమా కాబట్టి కవరేజ్ కోసం హైదరాబాద్ నుంచి జర్నలిస్టులను తీసుకెడితే స్పెషల్ కవరేజ్ వస్తుంది అని చెప్పాను .
అందుకు నాగేశ్వర రావు గారు కూడా 'అవును , అదే మా ఉద్దేశ్యం, మీకు అన్ని ఏర్పాట్లు చెయ్యమని వెంకట్ కు చెబుతాను ' అన్నారు .
నేను సరేనన్నాను .
ఆలా జ్యోతి చిత్ర తరుపున నేను , సితార నుంచి గౌస్ ( శాతవాహన ), చిత్ర భూమి నుంచి కేశవరావు , ఆంధ్ర పత్రిక నుంచి రాజేశ్వర రావు , ఆంధ్ర భూమి నుంచి వెంకట్ రావులను ఎంపిక చేశాను . వారంతా వస్తామని చెప్పారు .
నవంబర్ 25 సాయంత్రం 4.50 నిముషాలకు మద్రాస్ వెళ్లే రైల్ లో టికెట్స్ రిజర్వు చేశారు .
ఆరోజు సాయంత్రానికి అందరూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చారు . 26వ తేదీ ఉదయం 8.30 గంటలకు మద్రాస్ స్టేషన్ కు చేరాము మమల్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రొడక్షన్ మేనేజర్ రామారావు వచ్చాడు . అందరికీ పామ్ గ్రోవ్ హోటల్ కాటేజీలో బస ఏర్పాటు చేశారు .
ఆరోజు మంగుళూరు వెళ్లే ట్రైన్ సాయంత్రం 4.00 గంటలకు అని రామారావు చెప్పాడు . 'ఈ లోగా మీరంతా రెడీయా అయితే టిఫిన్ చేసి సిటీ చూద్దాం ' అని చెప్పాడు .
అందుకు అందరం సరేననన్నాము . మాతోపాటు పి .ఆర్ .ఓ . ప్రమోద్ కుమార్ కలిశారు . సినిమా స్టూడియోలు , బీచ్ చూసి హోటల్ కు తిరిగి వచ్చాము .
సాయంత్రం 4.00 గంటలకు మంగుళూరు ట్రైన్ ఎక్కాము .
తమిళనాడు నుంచి బయలుదేరి కేరళ మీదుగా కర్ణాటక లోని మంగళూరుకు 27వ తేదీన మధ్యాహ్నం 2.00 గంటలకు చేరాం . అక్కడ
ఉడ్ సైడ్ హోటల్ లో భోజనం చేశాము . తరువాత మమ్మల్ని తీసుకెళ్లడానికి వ్యాన్ వచ్చింది . సాయంత్రం 6.30 గంటలకు కుద్రేముఖ్ షూటింగ్ లొకేషన్ కు చేరాము . ఆరోజు సాయంత్రం జర్నలిస్టులకు అబ్బాయి (అక్కినేని వెంకటరత్నం ) పార్టీ ఇచ్చారు .
తరువాత రోజు 28 గురువారం లొకేషన్ కు వెళ్ళాము .
కుద్రేముఖ్ సముద్ర మట్టానికి దాదాపు 1,894 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు, పచ్చిక బయళ్ళు, లోయలతో ఎంతో అందంగా ఉంటుంది. ఇది ట్రెక్కింగ్ ప్రియులకు స్వర్గధామం. అయితే, ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి చాలామంది వస్తుంటారు .
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మూడు నదులు—తుంగ, భద్రా మరియు నేత్రవతి—ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయి .
ఉదయం వేళ షూటింగ్ కొంత జరిగాక , నాగేశ్వర రావు గారి ఆరోగ్యం బాగాలేదని ఫోన్ రావడంతో నిర్మాత వెంకట అక్కినేని
మద్రాస్ బయలుదేరాడు. ఈ వార్తతో అందరి మూడ్ మారిపోయింది . అయితే ఓ రెండు గంటల తరువాత వెంకట్ లొకేషన్ కు వచ్చి
'నాన్న ఆరోగ్యగా వున్నారు ' అని చెప్పడంతో అందరూ మళ్ళీ మూడ్ లోకి వచ్చారు . నాగార్జున కూడా ఉత్సహంతో షూటింగ్ లో పాల్గొన్నారు . ఆరోజు రాత్రి దర్శకుడు మధుసూదన రావు , నిర్మాత వెంకట్ తో సమావేశమయ్యాము .
29 శుక్రవారం రోజు షూటింగ్ స్పాట్ లోనే వున్నాము . నాగార్జున , శోభన , చంద్ర మోహన్ తో పాటు స్థానిక కళాకారులు కూడా పాల్గొన్నారు .
'విక్రమ్ 'సినిమాలో హెలికాప్టర్ ను కూడా ఉపయోగించారు . ఈ సినిమాలో 'డింగు డాంగ్ ఓ బేబీ , సింగ్ సాంగ్ ఓ బేబీ ' అనే పాట చివరిలో నిర్మాత అక్కినేని వెంకట్ కనిపిస్తారు .
ఈ సినిమా కోసం హెలికాప్టర్ సన్నివేశాలు తీస్తున్నప్పుడు అనుకోకుండా పెద్ద ప్రమాదం తప్పింది . చెట్ల మాటున ఉన్న టెలిఫోన్ తీగలు దగ్గరకు వచ్చేంతవరకు కనిపించలేదు . తీరా చూశాక పైలట్ చాక చక్యగా తప్పించాడు . దీంతో యూనిట్లో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు .12.00 గంటలవరకు షూటింగ్ దగ్గర ఉండి మంగుళూరు బయలుదేరాము . అక్కడ హోటల్ లో భోజనం చేసి రైల్వే స్టేషన్ కు వెళ్ళాము .
పేరుకి ఫస్ట్ క్లాస్ కానీ అసలు బాగా లేదు . అయినా తప్పదు కదా . సాయంత్రానికి మద్రాస్ చేరాము రామారావు మాకోసం స్టేషన్ కు వచ్చాడు . ఈరోజు హైదరాబాద్ ఎక్సప్రెస్ లేదు అని మమ్మల్ని పామ్ గ్రోవ్ కు తీసుకెళ్లాడు .
అక్కినేని నాగేశ్వర రావు గారు అపోలో ఆసుపత్రిలో వున్నారని తెలిసి అందరం చూడటానికి వెళ్ళాము . అక్కడ అల్లుడు యార్లగడ్డ సురేంద్ర , నిర్మాత పి .శశిభూషణ్ ఉన్నారు . నాగేశ్వర రావు గారు నీరసంగా వున్నారు .
నాగేశ్వర రావు గారు ఆసుపత్రిలో వున్నారని తెలిసి ముఖమంత్రి ఎన్ .టి .రామారావు గారు చూసిపోయారని సురేంద్ర చెప్పారు .
డిసెంబర్ 1వ తేదీ , ఉదయం 11 గంటలకు మళ్ళీ అపోలో ఆసుపత్రికి వెళ్ళాము . అప్పటికే ఆసుపత్రిలో పోలీసులు ఉన్నారు .
మమల్ని ఒక పక్కన నిలబెట్టారు . ఎందుకు అని అడిగితే తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్ .జి .రామచంద్రన్ గారు వస్తున్నట్టు చెప్పారు .
కాసేపటికే రామచంద్రన్ వచ్చి నాగేశ్వర రావు గారిని పరామర్శించి వెళ్లారు .
ఆ తరువాత మేము నాగేశ్వర రావు గారిని కలిశాము . "అన్ని ఏర్పాట్లు బాగా జరిగాయా ?' అని అడిగారు .
అన్నీ బాగా జరిగాయని చెప్పాము . అందరినీ పేరు పేరునా పలకరించారు .
అదేరోజు సాయంత్రం 3.20 నిముషాలకు హైదరాబాద్ ఎక్సప్రెస్ లో హైదరాబాద్ బయలుదేరాము .




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి