" ఈ విజయం నాది కాదు , నా తండ్రిది " - నాగార్జున 

అక్కినేని నాగేశ్వర రావు గారు తన రెండవ కుమారుడు నాగార్జునను హీరోగా సినిమా రంగానికి పరిచయం చేస్తూ 'విక్రమ్ ' అనే చిత్రాన్ని రూపొందించారు .  సీనియర్ దర్శకులు వీరమాచనేని మధుసూదన రావును ఎంపిక చేసి అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను శ్రీమతి అక్కినేని అన్నపూర్ణమ్మ  సమర్పించారు . నాగార్జున జోడీగా శోభనను ఎంపిక చేశారు . అక్కినేని నాగేశ్వర రావు గారి పుట్టినరోజు సందర్భంగా 20 సెప్టెంబర్ 1985లో మొదలైన ఈ సినిమా షూటింగ్  హైదరాబాద్ , కర్ణాటక రాష్ట్రాల్లో  జరిపి 'విక్రమ్' చిత్రాన్ని 23 మే 1986న విడుదల చేశారు. 

అక్కినేని నాగేశ్వర రావు అభిమానులంతా ఎదురు చూసిన రోజు1986  మే 23 శుక్రవారం. ఈ సినిమాను నైజాం లో ఎస్ .ఎన్ .ఏ .పి , సీడెడ్ లో వి . ఎమ్ .సి ,  నెల్లూరులో రాజ రాజేశ్వరి ఫిలిమ్స్, గుంటూరు లో చదలవాడ బ్రదర్స్,  కృష్ణలో  బాలాజీ పిక్చర్స్, పశ్చిమ గోదావరి జిల్లా లో అన్నపూర్ణ సినీ చిత్ర , వైజాగ్ , శ్రీకాకుళం లో  క్రాంతి పిక్చర్స్ , కర్ణాటకలో శ్రీ లక్ష్మి వినాయక పిక్చర్స్ ద్వారా విడుదల చేశారు.

అదే రోజు హైదరాబాద్ సుదర్శన్ 35 ఎమ్ .ఎమ్ .థియేటర్ లో ప్రదర్శించే  మొదటి ఆటకు రమ్మని మీడియా మిత్రులను ఎస్ .ఎన్ .ఏ .పి పంపిణీదారుల తరుపున  ఎల్ .ఏ . అడ్వర్ టైజర్స్  గంగాధర రావు గారు ఆహ్వానించారు . ఆ రోజుల్లో సినిమా విడుదలైన రోజు మొదటి ఆటకు పంపిణీదారులు  లేదా పేపర్ అడ్వర్ టైజర్స్  సినిమా జర్నలిస్టులను ఆహ్వానించేవారు .  అప్పట్లో పది లేదా పన్నెండు మంది సినిమా జర్నలిస్టులు ఉండేవారు . అప్పుడప్పుడు సబ్ ఎడిటర్లు కూడా సినిమా చూడటానికి వచ్చేవారు . సినిమా విరామం సమయంలో పంపిణీదారులు , అప్పుడప్పుడు ఆ సినిమా నిర్మాత లేదా దర్శకుడు  కూడా వచ్చి జర్నలిస్టులను పలకరించేవారు . సినిమా  జర్నలిస్టులకు స్వీట్ , హాట్ తో పాటు కూల్ డ్రిక్స్ ఇచ్చేవారు . చివరిలో సినిమా ఎలా ఉందొ తెలుసుకునేవారు . 

సినిమాకు వచ్చిన వారిలో కొంతమంది మిత్రులు సినిమా సమీక్ష రాసేవారు . 

అదేరోజు నాగేశ్వర రావు గారు ఫోన్ చేసి 'ప్రెస్ వాళ్ళు వస్తారు , మీరు చూసుకోండి, అలాగే సినిమా అయిపోయిన తరువాత 

నాకు ఫోన్ చెయ్యండి ' అని చెప్పారు .

'నేను సరే సార్ ' అన్నాను .


సుదర్శన్ 35 ఎమ్ .ఎమ్ . హైద్రాబాద్ లో 'విక్రమ్ ' సినిమాకు ప్రధాన థియేటర్ . ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన థియేటర్ . నాగేశ్వర రావు గారి అబ్బాయి కాబట్టి నాగార్జున సినిమాకు ప్రేక్షకులు బాగా వచ్చారు .అందరిలో ఉత్సాహం కనిపిస్తోంది . ఎక్కువగా నాగేశ్వర రావు గారి అభిమానులు వచ్చారు. వారి సందడి మాములుగా లేదు . అయితే ఆరోజు మాములుగా వచ్చేవారి కంటే ఎక్కువమంది  జర్నలిస్టులు  వచ్చారు . అందరికీ  బాల్కనీ లో టిక్కెట్లు ఇచ్చారు .

'విక్రమ్ ' సినిమా  అయిపోయిన తరువాత జర్నలిస్టులు వారి వారి అభిప్రాయాలను వెల్లడించారు . నేను మేనేజర్ గదిలోకి వెళ్ళాను . నన్ను అన్ని థియేటర్ మేనేజర్లు గుర్తుపడతారు . ' నన్ను చూడగానే రండి సర్, టీ తెప్పించినా ? ' అని ఆహ్వానించాడు . 

వద్దు , ఫోన్ చేసుకుంటా ' అనగానే , తప్పకుండా అని చెప్పాడు .

నాగేశ్వర రావు గారి ఇంటికి ఫోన్ చేశాను ఎంగేజ్ వచ్చింది , అలా కాసేపు వేచివున్న తరువాత మళ్ళీ ఫోన్ చేశాను .

నాగేశ్వర రావు గారు ఫోన్ తీశారు . వారి ఇంటికి ఎప్పుడు ఫోన్ చేసినా నాగేశ్వర రావు గారే ఫోన్ తీస్తారు .  నేను ఫోన్ చెయ్యగానే 

' ఏమంటున్నారు జర్నలిస్టు మిత్రులు ? అని ఆసక్తిగా అడిగారు . 

'అందరూ బాగుందని అంటున్నారు సర్ , అయితే మొదటి సగంలో కాస్త డల్ గా ఉందని రెండవ సగంలో బాగుందని అభిప్రాయపడుతున్నారు , ఓవర్ అల్ గా సినిమాను బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు ' అని చెప్పాను .

'నాగార్జున నటన గురించి ఏమంటున్నారు ?" అడిగారు .

'మొదటి సినిమా కాబట్టి చిన్న చిన్న లోపాలు ఉంటాయి , అయితే అందరూ నాగేశ్వర రావు గారి వారసత్వాన్ని నిలబెడతాడు ' అంటున్నారు సర్ ' అని చెప్పాను .

'గుడ్ , ఇందాకటి నుంచి కొడుకు సినిమా ఎలావుందో ? ప్రెస్ వారి అభిప్రాయం ఏమిటో ? అని సమర్పకురాలు అన్నపూర్ణ ఆసక్తిగా వుంది ,మాట్లాడండి ' అని నాగేశ్వర రావు గారు ఫోన్ అన్నపూర్ణమ్మ గారికి ఇచ్చారు .

'అమ్మా నమస్కారం , చిన బాబు (నాగార్జునను ఇంట్లో చిన  బాబు అంటారు ) నటన బాగుందని అంటున్నారు . నాగార్జునకు మంచి భవిష్యత్తు ఉందని చెబుతున్నారు . సినిమా పాస్ ' అని చెప్పాను . 

'థాంక్ యు బాబు , మీ అందరి ఆశీస్సులు చిన బాబుకు ఉండాలీ , అన్ని చోట్ల నుంచి 'విక్రమ్ 'సినిమా బాగుందని చెబుతున్నారు ' అని ఆమె సంతోషంగా చెప్పారు . 


'విక్రమ్ 'సినిమా విడుదలైన తరువాత  రెండవ వారం కలెక్షన్లు పెరిగాయి . అప్పుడు నాగేశ్వర రావు గారితో మాట్లాడి నాగార్జున ఇంటర్వ్యూ జ్యోతి చిత్రకు చేశాను . 'ఈ విజయం నాది కాదు , నా తండ్రిది ' అని నాగార్జున వినమ్రంగా ప్రకటించాడు . అది అతని సంస్కారం .

ఇంటర్వ్యూ అయిపోయిన తరువాత నాగార్జున గురించి మీరు రెండు మాటలు చెప్పండి ' అని నాగేశ్వర రావు గారిని అడిగాను . 

ఆయన నావైపు చూశారు . ఆ చూపులో అవసరమా ? అనిపించింది .

"కొస మెరుపు ఉండాలిగా ! " అన్నాను నవ్వుతూ .

'మీరు మామూలు జర్నలిస్ట్ కాదు , అందుకే మీరంటే నాకు అభిమానం ' అన్నారు .

నేను ఆయనకు నమస్కారం చేశాను . 

నాగేశ్వర రావు గారు కాసేపు ఆలోచించి .. 

"పుత్రోత్సాహము తండ్రికి 

పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, 

జనులాపుత్రుని కనుగొని పొగడగ 

పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!"

అనే పద్యాన్ని తండ్రి అక్కినేని నాగేశ్వరావు గారు ఆనందంగా చదివారు .

అదే పద్మవిభూషణ్ , దాదాసాహెబ్ ఫాల్కే ,నట సమ్రాట్ అక్కినేని  నాగేశ్వర రావు ప్రత్యేకత. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు