తెలుగు సినిమా ప్రస్థానం .... !?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యతో ప్రభుత్వం ఆలస్యంగానైనా ఎఫ్ .డి .సి . బోర్డును
నియమించింది . ఈ బోర్డు చైర్మన్ గా పంపిణీదారు పి .భరత్ భూషణ్ , వైస్ చైర్మన్ గా దర్శకుడు మెహర్ రమేష్ , సభ్యులుగా హీరో సుమన్, నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు , హీరో శివాజీ , రచయిత బుర్ర సాయి మాధవ్, నటి ఝాన్సీ , దర్శకుడు సముద్ర , ఛాయాగ్రాహకుడు మీర్ , నిర్మాత వివేక్ కూచిపూడి ,సీనియర్ జర్నలిస్ట్ కొండపనేని ఉమామహేశ్వర రావు తదితరులు ఆదివారంనాడు విజయవాడలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు .
ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ , శాసన సభ్యులు , హీరో శ్రీ నందమూరి బాలకృష్ణ పాల్గొని ఆద్యంతం ఉత్సాహభరితంగా కార్యక్రమాన్ని నడిపించారు . ఈ కార్యక్రమం కోశాయ్ హైదరాబాద్ నుంచి నిర్మాతలు సి .కళ్యాణ్ , తుమ్మల ప్రసన్న కుమార్ , అంబికా కృష్ణ , మాదాల రవి , ప్రతాని రామకృష్ణ గౌడ్ , వల్లభనేని అనిల్ కుమార్ , దర్శకులు వి .ఎన్ .ఆదిత్య , జి రామ్ ప్రసాద్ మొదలైనవారు హాజరయ్యారు.
ఇప్పటికైనా ప్రభుత్వంలో కదలిక వచ్చినందుకు సంతోషం .
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తుంది.
అయినా చలన చిత్ర అభివృద్ధి సంస్థకు బోర్డు ను నియమించడంలో ఇంత జాప్యం జరిగింది .
సినిమా రంగంతో సన్నిహిత సంబంధాలు వున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారు , ఉప ముఖ్యమంత్రి గాఉన్న హీరో శ్రీ పవన్ కళ్యాణ్ , సినిమా జర్నలిస్టుగా పనిచేసిన సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ , అగ్ర హీరోగా, హిందూపూర్ శాసన సభ్యుడిగా వున్న శ్రీ నందమూరి బాలకృష్ణ ... ఇందరు ఉన్నా కూడా సినిమా విషయంలో జాప్యం జరిగిపోయింది.
హైదరాబాద్ లో స్థిరపడిన తెలుగు సినిమాను తరలించడం పట్ల ఆసక్తి లేకపోవడమా ? ఎవరికీ ఈ బాధ్యత అప్పగించారో వారు పట్టించుకోకపోవడమా ? కూటమిలో సమన్వయం లేకపోవడమా ?
ఎంతోమంది నిర్మాతలు, ఎఫ్ .డి .సి .చైర్మన్ కోసం ప్రయత్నాలు చేశారు, అయినా విజయం సాధించలేదు .
ఇక తెలంగాణ ప్రభుత్వం సినిమాకు సంబంధించి సౌకర్యాలు కల్పించడంలో, సినిమా అవార్డులు ఇవ్వడంలో ఎంతో ముందుంది .
ఇప్పటికే 24, 25 సంవత్సరాలతో పాటు పెండింగ్ లో వున్న సినిమా అవార్డులను కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రదానం చేసింది .
తెలుగు సినిమా ప్రస్థానం గురించి ఒకసారి తెలుసుకుందాం .
1931లో తెలుగు శబ్ద చిత్ర నిర్మాణం మొదలయ్యింది . ప్రారంభంలో తెలుగు సినిమాలు బొంబాయి, కలకత్తా లేదా కొల్హాపూర్ లో నిర్మాణమయ్యేవి . ఆ తరువాత మద్రాసులో స్టూడియోలు నిర్మాణమయ్యాక అది కేంద్ర మయ్యింది .అప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీ లో ఆంధ్ర ప్రాతం ఉండేది .
1953లో భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనతో ఆంధ్ర రాష్ట్రం కర్నూల్ రాజధానిగా ఏర్పడింది . ఆ తరువాత 1956లో ఆంధ్ర రాష్ట్రము , హైదరాబాద్క స్టేట్ కలసి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి .
1964లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాను ప్రోత్సహించడానికి నంది అవార్డులను ప్రవేశపెట్టింది . స్వరాష్ట్రంలో స్థిరపడటానికి సబ్సిడీ పథకం ప్రవేశ పెట్టింది . 1975లో చలన చిత్ర అభివృద్ధి సంస్థను ప్రారంభించింది . అదే సంవత్సరం అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం కోసం అక్కినేనికి స్థలాన్ని కేటాయించారు . ఆ తరువాత పద్మాలయ స్టూడియోస్ కోసం కృష్ణకు , ప్రసాద్ ల్యాబ్ కోసం ఎల్ .వి ప్రసాద్ కు , రామానాయుడు స్టూడియోస్ కోసం నిర్మాత రామానాయుడు కోసం హైద్రాబాద్లో స్థలాలు కేటాయించారు.
1978లో చెన్నారెడ్డి గారి ప్రభుత్వం సినిమాను రప్పించడంలో కీలక పాత్ర పోషించింది . సినిమావారి కోసం భూమి కేటాయించింది .
అదే ఫిలిం నగర్. నిర్మాతలు , దర్శకులు , సాంకేతిక నిపుణులకు ఇళ్ల స్థలాలను కేటాయించచారు . ఆ తరువాత 1983 లో ముఖ్యమంత్రి గా శ్రీ ఎన్ .టి .రామారావు బాధ్యతలు స్వీకరించారు . సినిమా రంగం నుంచి వచ్చినవారు కాబట్టి మద్రాసు నుంచి సినిమా రంగం తరలి రావడానికి విశ్వప్రయత్నం చేసి సాధించారు.తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్ కు సంపూర్ణంగా తరలి వచ్చింది .
ఇక్కడ సినిమాకు కావలసిన మౌలిక వసతులన్నీ వున్నాయి . అందరూ హైద్రాబాద్లో స్థిరపడ్డారు .
2014లో రాష్ట్రము రెండుగా విడిపోయింది . తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది .
తెలంగాణాలో చంద్ర శేఖర్ రావు ప్రభుత్వం ఏర్పడింది . ఆంధ్ర లో చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడింది .
ఈ పదేళ్లలో సినిమా రంగంలో చెప్పుకోదగ్గ పరిణామాలు జరగలేదు. సినిమా హైద్రాబాద్లోని ఉంది .
చంద్ర బాబు నాయుడు ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు నంది అవార్డుల కమిటీలు వేయడం , అవార్డులను ప్రకటించడం కూడా జరిగింది . అయితే ఆ అవార్డులను మాత్రం విజేతలకు ప్రదానం చెయ్యలేదు .
2019 నుంచి 2023 వరకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం లో సినిమా ఎలాంటి అవార్డులను ప్రకటించలేదు , ప్రదానం చెయ్యలేదు .
2024 జూన్ 12న శ్రీ నారా చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు .
ఈ సంవత్సరం మర్చి 19 ఉగాది రోజున హైద్రాబాద్లో తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానం జరిగింది. శ్రీ చిరంజీవి కి ఎన్ .టి .ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేశారు . ఆ సందర్భంగా చిరంజీవి 'మన పక్క రాష్ట్రము కూడా నంది అవార్డులు ఇస్తే బాగుంటుంది ' అనే సూచన చేశారు .
అప్పటి నుంచి ఆంధ్ర ప్రదేశ్ సినిమా గురించి కార్యాచరణ మొదలయ్యింది . దీనికి నందమూరి బాలకృష్ణ సారథ్యం వహించారు .
ఎఫ్ .డి .సి .బోర్డు ను నియమించడంలో బాలకృష్ణ పాత్ర ఉంది . అలాగే ఈ బోర్డ్ పదవీ ప్రమాణ స్వీకారంలో కూడా బాలకృష్ణ అంతటా , అన్నింటా తానై నడిపించారు.
జూన్ లో ప్రారంభమయ్యే సినిమా కూడా ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉంటుందని , ఇక ముందు తానూ నటించే సినిమాలన్నీ సందేశాత్మకంగా ఉంటాయని బాలకృష్ణ ప్రకటించారు .
2025 సినిమాలకు అవార్డుల కమిటీని కూడా నియమించే అవకాశం ఉందని తెలుస్తుంది .
నందమూరి తారక రామారావు గారి వారసుడిగా బాలకృష్ణ ఏ రకమైన కార్యాచరణ తో ముందుకు సాగుతారో , సినిమా రంగాన్ని ఎలా ప్రభావితం చేస్తారో చూడాలి !
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి