భగీరథ ప్రయత్నం 

 మీర్జాపురంరాణి - కృష్ణవేణి


చక్కని బయోగ్రఫీ ఇది. శ్రీమతి కృష్ణవేణి నటీ,గాయకురాలు ,నిర్మాత ,సొంత స్టుడియో వ్యవహారాలు చూసుకునే వారు.ఆమెను అందరూ సి.కృష్ణవేణి అనేవారు .ఆమె పూర్తి పేరు చిత్తజల్లు.కృష్ణవేణి.ఈ పేరు వెనక ఒక విచిత్రమైన కథ వుంది.అసలు ఆమె పుట్టినింటి పేరు యర్రంశెట్టి.అయితే మీర్జాపురం రాజా వారిని పెళ్లిచేసుకుని మేకా.కృష్ణవేణి అయింది కానీ ఆమె తనను తండ్రిలాగా చూసుకున్న చిత్తజల్లు.పుల్లయ్య గారిమీద గౌరవంతో ఆయన ఇంటిపేరునే తాను స్వీకరించి చిత్తజల్లు.కృష్ణవేణి అయింది .ఈ విషయంలో రాజావారు కూడా యేమీ అభ్యంతరం చెప్పకపోవడం గొప్ప విషయం.

రచయిత భగీరథ గారు ఆమె కుటుంబనేపథ్యమూ ,చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి సవతితల్లి నిరాదరణ వలన పిన్నీ,బాబాయిల సంరక్షణలో పెరగడమూ అన్నీ వివరంగా రాశారు.

చిన్ననాడే ఆమెకు నటన పట్ల వున్న మక్కువతో నాటకాలలో నటిస్తుంటే చూసిన సి.పుల్లయ్య "సతీ అనసూయ"   అనే పిల్లల సినిమాలో హీరోయిన్ గా బుక్ చేసుకున్నారు.ఆయన ఆ సినిమాలో నటించిన పిల్లలందరినీ యెంతో ప్రేమగా చూసుకునేవారు .ప్రేమాభిమానాలకు కరువాచిన కృష్ణవేణి  పుల్లయ్య దంపతులలో తన తల్లిదండ్రులను చూసుకునేది.చివరకు తనను పెండ్లాడాలనే అభిప్రాయం మీర్జాపురం రాజా వారు వ్యక్తం చేసినప్పుడు కూడా పుల్లయ్య గారి సలహా తీసుకున్నాకే ముందడుగు వేసింది .అంతేకాదు కన్యాదానం కూడా పుల్లయ్య దంపతులే చేయడం విశేషం.



కృష్ణవేణి గారు సినిమా రంగానికి పరిచయం చేసినవారు యెంతో గొప్పవారయి ఎంతో యెత్తుకు యెదగడం ఆమె దూరదృష్టికీ,నిశిత పరిశీలనకీ తార్కాణం .శ్రీ యన్ .టి.రామారావు,ఘంటసాల వెంకటేశ్వరరావు,రమేష్ నాయుడు అలా పరిచయం కాబడిన వారే.యన్ .టి.ఆర్ "మనదేశం" లో నటించారు.ఘంటసాల గారి ప్రతిభ గమనించి వరసగా మూడు చిత్రాలకు సంగీతం చేయించుకున్నారు .అవి "మనదేశం,లక్ష్మమ్మ ,కీలుగుర్రం" ఇక వాటిలో పాటలు సూపర్ హిట్లు.

రమేష్ నాయుడిని "దాంపత్యం"సినిమాతో సంగీత దర్శకుడుగా పరిచయం చేశారు

ఈ పుస్తకం చదవడం వలన కొన్ని  వింత విషయాలు తెలిశాయి."కీలుగుర్రం" సినిమాని మొదట్లో సి.పుల్లయ్య గారి దర్శకత్వంలో యన్ .టి.ఆర్ .హీరోగా నిర్మించాలనుకున్నారట.డైరెక్టర్ సి.పుల్లయ్య స్వయంగా యన్ .టి.ఆర్ ని సంప్రదిస్తే నేను చదువుకోవాలి ఇప్పుడు రాను అన్నారట .ఆ తర్వాత "బాలరాజు" విజయం చూసి అక్కినేనిని బుక్ చేసుకున్నారట అలాగే సి.పుల్లయ్య గారు తప్పుకుంటే మీర్జాపురం రాజా వారే స్వయంగా "కీలుగుర్రం" దర్శకుడుగా వ్యవహరించారట.

ఇంకో విచిత్రం "పాతాళభైరవి" లో హీరోయిన్ గా చేయమని కె.వి. రెడ్డి గారు కృష్ణవేణి గారిని అడిగితే బయట స్టుడియోలకు వచ్చి నటించడం రాజాగారికి ఇష్టం వుండదు రానన్నారట.

ఇదే కారణంతో ఆమె "స్వర్గసీమ,మల్లీశ్వరి" చిత్రాలను కూడా వదులుకున్నారని ఈ పుస్తకం ద్వారా తెలుస్తోంది.


పుస్తకం సమగ్రంగా వుంది .నటీనటుల గురించీ,నిర్మాణ సంస్థల గురించీ బోలెడంత సమాచారం వుంది.పుస్తకం ఆ సాంతం ఒక చక్కని కథలాగా రాసిన భగీరథగారు అభినందనీయులు. భగీరథ గారిది నిజంగా భగీరథ ప్రయత్నమే .ఈ పుస్తకం నా కోసం వెదికి సంపాదించి తెచ్చిన మా అబ్బాయి అన్వర్ కి కృతజ్ఞతలు .

సినీప్రియులందరూ తప్పక చదవవలసిన పుస్తకం


- డాక్టర్ భార్గవి


పుస్తకం వెల----రూ"750

దొరుకుచోటు---శ్రుతి బిజినెస్ సెంటర్ , 040 23555617. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు