"బడుగు బలహీన వర్గాల కోసమే  తెలుగు దేశం " 

                                                        - ఎన్ .టి  రామారావు 


1982 ఏప్రిల్ 1 వ తేదీ గురువారం నాడు  2. 30 గంటలకు రామారావు గారితో రామకృష్ణ స్టూడియోస్  లోని  వారి కార్యాలయంలో నేను చేసిన అరుదైన ఇంటర్వ్యూ . . 

                                *                     *                      *                             *                            *

తెలుగుదేశం గట్టి ప్రతి పక్షం అవుతుందని కొందరు , పెద్ద పట్టించుకోవాల్సిన అవసరంలేదని మరి కొందరు వ్యాఖ్యానిస్తుంటే .... ఎన్టీఆర్ మాత్రం 

అన్ని స్థానాలకు తమ పార్టీ పోటీ చేస్తుందని ,తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రత్యక్షంగానూ , పరోక్షంగానూ అంటున్నారు . 

కృష్ణుడుగా , రాముడుగా , ప్రజలు తనని ఆరాధిస్తున్నారని , తనంటే  వారికి అచంచలమైన  విశ్వాసం ఉందని , ప్రస్తుత  రాజకీయ వ్యవస్థ 

లోపభూయిష్టంగా ఉందని , ఇట్టి పరిస్థితుల్లో తనలాంటి  నిస్వార్ధ ప్రజాసేవకులు  దేశానికి ఎంతో అవసరమని రామారావు భావిస్తున్నారు . 

అందుచేతనే తానూ రాజకీయాల్లో ప్రవేశించినట్టు ఆయన ప్రకటించారు . 

ఇంతకాలం సినిమా రంగంలో వున్న రామారావుకు దేశం గురించి ఏమి తెలుసు ? ప్రజలకు ఆయనేం చేస్తారు  అనే విమర్శలు అంతటా వినిపిస్తున్నాయి . 

ఆయన రాజకీయాలలో ప్రవేశించిన తరువాత అనేక ఊహాగానాలు బయలుదేరాయి . మళ్ళీ చిత్రాల్లో నటిస్తారా?సినిమా పరిశ్రమ నుంచి మద్దతు ఉందా?

ఒకవేళ తెలుగు దేశం అధికారంలోకి వస్తే దేశానికి ముందుగా ఏమి చేస్తారు ? ఇలాంటి అనేకమైన సందేహాలను ఎన్ . టి . రామారావు "జ్యోతి "మాస పత్రిక కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నివృత్తి చేశారు . 

"మీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు తీసుకునే నిర్ణయాలు ఏమిటి ? మీ కార్యక్రమాలు ఎలా ఉంటాయి ?" అంటూ ఇంటర్వ్యూ ప్రారంభించాను . 

"ఈనాటి పరిస్థితులకు సతమతమవుతూ , సంసారాలు గడపలేక ,పిల్లల్ని పెంచుకోలేక ,బ్రతుకలేక , చావు బ్రతుకుల మధ్య నలిగిపోయే  బడుగు ప్రజానీకాన్ని 

తీర్చిదిద్దటం నా పార్టీ లక్ష్యం .  ఉచిత విద్య ,వైద్య సౌకర్యాలు ,పిల్లలకు ఉచిత మధ్యాన్నం భోజనం , ఆరోగ్యకరమైన , నివాస యోగ్యమైన  ఇళ్లను  కల్పించాలనే సంకల్పం . విద్య ద్వారా విజ్ఞానాన్ని  అందించడం ప్రధమ కర్తవ్యమ్ , ఆరోగ్య పరిరక్షణ  ద్వితీయ కర్తవ్యం . విద్యానమ్ముకొనే విధానానికి స్వస్తి చెబుతాం ,


విజ్ఞానానికి రక్షణ కలిపిస్తాము . మురికి గుంటలుగా  మారిన వైద్య శాలలు , అందరికీ అందుబాటులో వుండే పరిశుద్ధమైన , ప్రయోజనకమైన ,ఆదర్శ వైద్యాలయాలుగా తీర్చిదిద్దబడతాయి ఏడంతస్తుల మేడల్లో , ఫైవ్ స్టార్ హోటళ్లలో నిష్ప్రయోజనకరమైన  పనులలో మురిగిపోయే పెట్టుబడినంతా గ్రామీణాభివృద్ధికి , పరిశ్రమాభి వృద్ధికి  కేటాయించి , దేశీయ సంపదను పెంపొందించే  అభ్యుదయ కార్యక్రమాలకు వినియోగిస్తాము . 

జాతీయం చేసిన బ్యాంకు నిధులు బీమా నిధులు  దేశీయ అభివృద్ధికి మరలించబడతాయి . జాతి చైతన్యం స్వయం పోషకత్వం  సాధించడం మా సిద్ధాంతం . "

 "మీ రాజకీయా జీవిత పరమార్ధం  ఎంజీఆర్ లా ముఖ్యమంత్రి కావడమేనని అనుకుంటున్నారు . దీనికి మీ సమాధానం ?"

"నాకు పదవుల మీద వ్యామోహం లేదు ."

"మరీ..." 

"ఆరగించి వదిలేచిన ఎంగిలిని కోరుకోవడం  నాకు అలవాటు లేదు . భగవంతుడు అన్నీ ఇచ్చాడు . పేరు, డబ్బు , సచ్ఛీలం వున్నాయి . ఇంచుమించు సర్వసంగ పరిత్యాగం చేసిన సన్యాసిని . ప్రజాసేవ కోసం మిగిలిన వ్యక్తిని . "

"మీరు ముఖ్యమంత్రి అయితే చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఏరకంగా కృషి చేస్తారు ?"

"సినిమా పరిశ్రమను బాగా అవగాహన చేసుకున్న వ్యక్తిగా , శ్రామికుడుగా , అందరు చేయలేని అభివృద్ధి నా పరిశ్రమకు నేను చేయగలననే విస్వాసం వుంది "

"ప్రాంతీయ పార్టీని స్థాపించడంలో మీ ఉద్దేశ్యం ఏమిటి ?"

"ప్రస్తుతం నెలకొనివున్న పరిస్థితుల్లో జరుగుతున్న అన్యాయాలు , రోజురోజుకు దిగజారిపోతున్న నైతిక విలువలు , సంఘంలో ప్రబలిపోతున్న దురాచారాలు , ఇవ్వన్నీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించాయి .  సామాన్య ప్రజానీకానికి ఎదురవుతున్న అనేకనేక  సమస్యలు ... తెలుగుదేశం పార్టీ పెట్టడానికి 

ప్రోత్సహించాయి "

"ఇన్ని సంవత్సరాలు సినిమా జీవితం ఇవ్వలేని తృప్తి రాజకీయ రంగం ఇస్తుందని భావిస్తున్నారా?"

"ఒకరకంగా అదీ మానవ సేవే . ఇదీ మానవ సేవే .  దైనందిన జీవితంలో  కష్టపడేవారికి మానసోల్లాసం కలిగించేది కళ అయితే దుర్భర పరిస్థితుల్లో  ఆలు బిడ్డలతో 

,ఆకలి బాధలతో  అలమటిస్తున్న సాటి పేద ప్రజలకు , పీడిత వర్గానికి చేయూతనివ్వడం , కన్నీళ్లు తుడిచి ఆదరించడం  మహోత్కృష్టమైన పరమార్ధం . 

మానవ సేవే  మాధవ సేవ , అంతకు మించిన పవిత్రమైన పరమార్ధ స్వరూపం మరోటి ఉండదు . "

"రాజకీయ జీవితానికే అంకితమయి పోతారా? లేక సినిమా జీవితాన్ని కూడా కోన సాగిస్తారా?"

"ఆత్మ తృప్తి కల్గించే  కళ కంటే మానవ సేవలో పునీతమయ్యే రాజకీయ జీవితమే ఉత్తమమైనదని నా నమ్మకం . "

బాలకృష్ణ మీ స్థానాన్ని భర్తీ చేస్తాడని ఆశించవచ్చా? బీ అబ్బాయి భవిష్యత్తుకు మీరేవిధంగా సహాయపడతారు?"

"ఏమో ?"

"అంటే ?"

" నా అంతవాడు అయితే అంతకు మించిన ఆనందం లేదు . నా గౌరవాన్ని నిలిపినవాడు అవుతాడు "

"మీ పార్టీకి మీ అభిమాన సంఘ సభ్యులను ఏరకంగా ఉపయోగించుకోదలిచారు ?"

"క్రమశిక్షణాయుతమైన ఆదర్శ ప్రజాసేవకులుగా వారిని రూపొందిస్తాను "

"అభిమానుల అండదండలు మీకు పూర్తిగా వుంటాయని .."

"తప్పకుండా ఉంటాయి . వారి పూర్తి మద్దతు మా పార్టీకి వుంది "

"మీ అభిమాన సంఘ సభ్యులను  పార్టీ తరుపున అభ్యర్థులుగా నిలబెడతారా ?"

"ఇప్పట్లో ఆ ఉద్దేశ్యం లేదు "

"ప్రస్తుతం నిర్మాణంలో వున్న సినిమాల మాటేమిటి ? మీ వాళ్ళ నిర్మాతలు నష్టపోరా ?"

"బయటి నిర్మాతల చిత్రాలు పూర్తి చేస్తాను .  మా స్వంత సినిమాలు చందా శాసనుడు , సింహం నవ్వింది ,నిర్మాణంలో వున్నాయి . వాటి విషయంలో నాకేమి బాధలేదు . త్యాగానికి సిద్దపడే ఈ నిర్ణయం తీసుకున్నా . ఇక నటిస్తానని ఒప్పుకున్నవి  వీలు కాకపోతే , ప్రస్తుతం వత్తిడి చెయ్యవద్దని వారిని కోరతాను "

"మీ అల్లుడు చంద్ర బాబు నాయుడు మీ పార్టీలో చేరే అవకాశం ఉందా ?"

"వారిష్టం వారిది "

" పక్కా కమర్షియల్ చిత్రాల్లో నటించే రామారావు గారు  ఇప్పుడు ప్రజా సేవ చేస్తానని అంటున్నాడు ... అనే విమర్శ వుంది .. మీరేమంటారు ?"

"అసూయపడే మానవుల ఊహ ఇది . నా మీద నమ్మకం వున్న అశేష ఆంధ్రులు నమ్మకం వమ్ముచెయ్యను . "

"కొత్తవారికి మీ పార్టీలో ఎక్కువ అవకాశం ఇస్తారా?"

'ఎక్కువ ఉత్సాహవంతులైన యువకులకు , జవాబద్దులైన నూతన ఆవేశ ప్రవాహానికి ఎక్కువ చోటు ఉంటుంది . "

"మీరు సినిమా జీవితానికి పూర్తిగా స్వస్తి చెప్పినట్టేనా?"

"అవసరమైతే స్వస్తి చెబుతాను "

"ఒకవేళ మీరు సినిమా జీవితాన్ని కోన సాగిస్తే మీ పాత్రల పోషణలో మార్పు వస్తుందా ? లేక నిర్మాతల అభిరుచిమేరకు నటిస్తారా ?

కాక సమాజాభివృద్ధికి  దోహదం చేసే సినిమాల్లో నటిస్తారా ?"

"మేము  మళ్ళీ చిత్రాల్లో నటిస్తే , పూర్తిగా మార్పు వస్తుంది . నూటికి నూరుపాళ్లు , ప్రజలను , జాతిని , సంఘాన్ని , చైతన్య పరిచే చిత్రాలకు , అలాంటి కథలకే ప్రాధాన్యత ఇస్తాము . ఒక్కసారి ఈ విలువలు చుసిన తరువాత క్రిందికి జారిపోలేము ."

"తెలుగు సినిమా రంగం నుంచే ఎవరైనా తెలుగు దేశం పార్టీలో చేరేవారు వుంటారా ?"

"ఇంతవరకు ఎవరు రాలేదు . ఒకవేళ వస్తే కాదనను "

"పార్టీ కార్య వర్గంలో అన్ని కులాలకు , మతాలకు ప్రాధాన్యత ఇస్తారా ?"

"అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఉంటుంది "

"తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా మారే అవకాశం ఉందా ?"

"ప్రస్తుతానికి ఇది ప్రాంతీయ పార్టీ మాత్రమే "

"తరువాత ..?"

"చెప్పలేం " అని ఇంటర్వ్యూ ముగించారు రామారావు గారు . 

-భగీరథ

(1982 జూన్ లో   జ్యోతి మాస పత్రికలో ఈ ఇంటర్వ్యూ ప్రచురితమైంది )


Comments

Popular posts from this blog