ఆంగికం, ఆహార్యం, అభినయం, వాచకం

షావుకారు జానకి పెట్టని ఆభరణాలు 


తెలుగు సినిమా రంగంలో షావుకారు జానకిది  అద్వితీయమైన స్థానం. తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా సినిమా రంగంలో ప్రవేశించినా, కట్టుకున్నవాడు స్వార్ధపరుడుగా మారిపోయాడని తెలిసి, ముగ్గురు పిల్ల తరువాత వివాహ బంధాన్ని రద్దు చేసుకొని, ఒంటరి మహిళగా , ధీరోదాత్త నటిగా జీవనం సాగించి ఎందరికో స్ఫూర్తిప్రదాతగా నిలిచారు . 

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషా చిత్రాల్లో నటించిన షావుకారు జానకి,  సినిమా రంగంలో ఎవరి  సహకారం , ప్రోత్సాహం లేకుండా  స్వయంగా ఎదిగి , ఒదిగిన మహానటి. 1950లో 'షావుకారు' చిత్రం తో మొదలైన ఆమె నట ప్రస్థానం 2023లో  విడుదలైన 'అన్నీ మంచి శకునములే ' చిత్రం వరకు కొనసాగింది. ఈ ఏడు దశాబ్దాలలో ఆమె ఎన్. టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎం. జి. ఆర్, శివాజీ గణేశన్ లాంటి మహానటులతో నటించారు. చిన్నప్పుడు మహాత్మా గాంధీ మద్రాసు వచ్చినప్పుడు వారికి పాలు, వేరుశనగ పప్పులు అందించి ఆశీస్సులు అందుకున్న జానకి ఆ తరువాత జవహర్ లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్, ఇందిరా గాంధీ లాంటి నేతలతో మాట్లాడిన అదృష్టవంతురాలు. జీవిత చరమాంకంలో  భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 

2026 ఆగష్టు 21న 94వ ఏట జానకి భౌతికంగా దూరమయ్యారు. 


1931 డిసెంబరు 12న రాజమండ్రిలో టేకుమళ్ళ వెంకోజీరావు , శచీదేవి దంపతులకు జానకి జన్మించారు. వీరిది  కన్నడ మధ్వ బ్రాహ్మణ కుటుంబం. తండ్రి  వెంకోజీరావు ఇంగ్లాండులో మూడేళ్ళపాటు పేపర్ మ్యానుఫాక్చరింగ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ చదివి వచ్చాడు. తరువాత పేపర్ పరిశ్రమలో పనిచేశాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాతాల్లో తిరిగారు. అలా మద్రాసులో వున్నప్పుడు ఆమె రేడియో నాటికల్లో   పాల్గొనడం మొదలు పెట్టింది. ఆమె స్వరం చాలా మాధుర్యం గా ఉండేదని, ఉచ్ఛారణ చాలా స్పష్టంగా ఉండేదని  ప్రశంసించేవారు. 

ఒకరోజు నిర్మాత దర్శకులు బి .ఎన్.రెడ్డి గారు రేడియో స్టేషన్ కు వచ్చి , ' అమ్మాయ్‌.. జానకి సినిమాల్లో హీరోయిన్‌ గా అవకాశం  ఇస్తా. నటిస్తావా ?’ అని అడిగారు. అంతటి దర్శకుడు స్వయంగా వచ్చి  అడగగానే 'ఓ చేస్తా ' అని చెప్పింది.ఇంట్లో ఆ విషయం చెప్పగానే తల్లిదండ్రులు బాగా చివాట్లు పెట్టారు. అలాంటి ఆలోచనలు మానుకో అని హెచ్చరించారు . ఇక ఆలస్యం చేస్తే తమకు చెప్పకుండా సినిమాల్లోకి వెళ్లిపోతుందేమో అనే భయంతో రేడియాలో పనిచేసే శంకరమంచి శ్రీనివాసరావు అనే ఇంజనీర్ కు ఇచ్చి1947లో వివాహం  చేశారు. అప్పటికి ఆమె వయసు 16 సంవత్సరాలే.   అస్సాం రాష్ట్రం గౌహతిలో కుటుంబం వున్నప్పుడు జానకి  భర్తతో  అక్కడికి వెళ్లారు . అప్పుడు జానకి చెల్లెలు కృష్ణకుమారి 10వ తరగతి చదువుతుంది. ఆమె పుస్తకాలు జానకి చదవడం చూసిన  భర్త నువ్వు కూడా చదివి పరీక్షలు రాయి అని ప్రోత్సహించాడు. అలా జానకి 10వ తరగతి  చదివి పాసయ్యింది . తరువాత వీరిద్దరూ మద్రాసుకు తిరిగి వచ్చారు . అప్పటికి జానకికి కూతురు జన్మించింది. 



అదే సమయంలో  జానకికి మళ్ళీ సినిమా అవకాశం వచ్చింది . అయితే ఈ సారి భర్తను ఒప్పించి ఒకే చెప్పింది. అదే 'షావుకారు'. దర్శకుడు ఎల్.వి. ప్రసాద్ తో నాగిరెడ్డి, చక్రపాణి  నిర్మించిన చిత్రం. ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు కథానాయకుడు కాగా జానకి నాయికగా పరిచయమైంది. ఈ చిత్రం తరువాత జానకి పేరుతో మరో నటి ఉన్నందువల్ల  తన పేరును షావుకారు జానకిగా మార్చుకుంది. 


1952లో 'వలయపతి ' అనే తమిళ సినిమాలో అవకాశం వచ్చింది . 1953లో ఎన్ .టి .రామారావు స్వంత  చిత్రం 'పిచ్చి పుల్లయ్య ' సినిమాలో అవకాశం వచ్చింది. తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షావుకారు జానకి సోదరి కృష్ణకుమారి కూడా నటించడం విశేషం. 1954లో 'దేవకాన్నిక ' అనే కన్నడ సినిమాలో నటించింది. అదే సంవత్సరం హెచ్ .ఎమ్ .రెడ్డి సమర్పణలో ఎన్ .టి .ఆర్. కథానాయకుడుగా రూపొందిన 'వద్దంటే డబ్బు 'సినిమాలో నటించింది . 1955లో అక్కినేని కథానాయకుడుగా 'రోజులు మారాయి ' సినిమాలో నటించింది . ఈ సినిమా ఘన విజయం సాధించింది. అదే సంవత్సరం 'కన్యాదానం', 'పసుపు కుంకుమ',  'చెరపకురా చెడేవు ', 

'కన్యాశుల్కం ' చిత్రాల్లో నటించింది . ఆ తరువాత జానకి నట ప్రస్థానం నిరాఘాటంగా సాగింది .

తెలుగు ,తమిళ, కన్నడ భాషలతో పాటు హిందీలో కూడా ఒక సినిమాలో నటించారు. 

 షావుకారు జానకికి ఇద్దరు అమ్మాయిలు , ఒక అబ్బాయి పుట్టిన తరువాత ఇద్దరికీ మనస్పర్థలు వచ్చి విడిపోయారు.తాను  సంపాదిస్తుంటే ఆస్తులను మాత్రం అతని పేరుతో కొనుక్కుంటున్నాడని తెలిసి విడాకులు ఇచ్చేశారు.  



 

పదవ  తరగతి వరకే చదివినా ఆ తరువాత ఆమె పుస్తకాలు చదివి  తెలుగుతో పాటు ఇంగ్లీష్ లో కూడా అనర్గళంగా మాట్లాడటం నేర్చుకున్నారు.  సినిమా రంగంలో వున్నా జానకి తనదైన పరిధిలోనే ఉండటం నేర్చుకున్నారు. రేడియాలో పనిచేస్తున్న రోజుల నుంచి ఇంటి నుంచి భోజనం తీసుకెళ్లడం అలవాటు, ఆ అలవాటే  సినిమా షూటింగ్ లప్పుడు కూడా  కొనసాగించింది. ఇంటికి అతిథులను ఆహ్వానిస్తే ఆమె ఎంతో ఆత్మీయంగా వారికి సేవచేయడం అలవాటు. 

జానకి ఆహార్యం , అభినయం , వాచకం తో ఆయా పాత్రల్లో పరకాయ ప్రవేశం చెయ్యడం అలవాటు . చివరివరకు ఆమె అంకిత భావంతో పనిచేశారు . ఎన్నో చిరస్మరణీయమైన పాత్రల్లో నటించారు. 

ఆమె పెద్ద కుమార్తె యజ్ఞ ప్రభ కుమార్తె వైష్ణవి అరవింద్ కూడా అమ్మమ్మ వారసత్వంతో నట జీవితంలో ప్రవేశించింది . 


ఆమె నట జీవితంలో ఎన్నో ప్రశంసలు, అవార్డులు వచ్చాయి . 1970లో ఇరు కోడుగల్ చిత్రంలో  ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు, దక్షిణాది భారత సినిమా రంగానికి చేసిన కృషికి 1984లో ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు - సౌత్ పురస్కారం 1985లో మహానటి సావిత్రి అవార్డు, అదే సంవత్సరం అరిజోనాలోని వరల్డ్ యూనివర్శిటీ నుంచి  గౌరవ డాక్టరేట్, 1987లో సంసారం ఒక చదరంగం చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు, 1989లో ఇండియన్ ఎక్సప్రెస్  గోల్డెన్ అవార్డు, 1990లో  తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం  ఎంజీఆర్ అవార్డు, 2000లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జీవిత సాఫల్య పురస్కారం, కర్ణాటక నుంచి శ్రీ కృష్ణ దేవరాయ అవార్డు, 2004లో నడిగర్ తిలగం శివాజీ జీవితకాల సాఫల్య పురస్కారం, 2007లో అమూల్యం చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు, అదే సంవత్సరం తెలుగు సినిమా వజ్రోత్సవాల సందర్భంగా హైహైదరాబాద్ లో సత్కారం , 2013లో సైమా జీవితకాల సాఫల్య పురస్కారం,   2015లో కర్ణాటక ప్రభుత్వం నుండి రాజ్యోత్సవ అవార్డు, 2019లో వండర్ ఉమెన్ అవార్డ్స్ ,  2020లో  తమిళనాడు  ప్రభుత్వం పురచ్చి తలైవి డాక్టర్ జె. జయలలిత పేరుతో ప్రదానం చేసిన కలైమామణి అవార్డు, 2022లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ఆమె స్వీకరించారు . 

అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1980లో సినిమావారికోసం ప్రవేశ పెట్టిన 'రఘుపతి వెంకయ్య ' అవార్డుకు,  1996లో సినిమా ప్రముఖుల కోసం ప్రవేశపెట్టిన 'ఎన్.టి.ఆర్. జాతీయ అవార్డుకు, 2005లో ప్రవేశపెట్టిన అక్కినేని జాతీయ అవార్డుకు  షావుకారు జానకిని మాత్రం ఎంపిక చెయ్యకపోవడం గమనార్హం. 

షావుకారు జానకి ఆత్మాభిమానం కలిగిన మహిళ.  సినిమాల్లో అవకాశాలు ఇవ్వమని ఎవరినీ ప్రాధేయపడలేదు. కీర్తించడం , కాకా పట్టడం అసలు తెలియదు. అలాగే అవార్డుల కోసం ఎవరితోను  సిఫార్సులు చేయించలేదు. అందుకే భారత ప్రభుత్వం కూడా చాలా ఆలస్యంగా జానకి గారికి పద్మశ్రీ ప్రదానం చేసింది .

అయినా ఎప్పుడు తన అసంతృప్తిని , అసహనాన్ని ఆమె వెల్లడించలేదు. హుందాగా వ్యవహరించిన సంస్కారం మూర్తీభవించిన నటి షావుకారు జానకి. ఆమె జీవితం ఈ తరం నటీమణులకు స్ఫూర్తిదాయకం .


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు