విలక్షణ నటుడు నటుడు నారాయణ రావు
నటుడు, నిర్మాత జి .వి. నారాయణరావు బుధవారం సాయంత్రం మృతి చెందారు.
1973లో నారాయణ రావు మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరి శిక్షణ పొందారు. అదే ఇనిస్టిట్యూట్ లో రజనీకాంత్, చిరంజీవి కూడా శిక్షణ పొందారు . వారిద్దరితో నారాయణ రావు కు స్నేహం వుంది . 1976లో దర్శకుడు కె .బాలచందర్ 'అంతులేని కథ ' తెలుగు చిత్రంలోనారాయణరావును సినిమారంగానికి పరిచయం చేశాడు . ఆ సినిమాలో 'తాళికట్టు శుభ వేళ .. మెడలో కళ్యాణ మాల ' అనే పాటలో నారాయణ రావు చూపించిన అభినయం ఆయన్ని ప్రభిభావంతుడైన నటుడుగా నిలబెట్టింది . ఆ సినిమాలో ఉత్తమ సహాయ నటుడుగా నారాయణరావు ను ఎంపిక చేసి ప్రభుత్వం నంది అవార్డును ప్రదానం చేసింది.
అదే సంవత్సరం నిర్మాత ఎమ్మెస్ రెడ్డి బి .వి .ప్రసాద్ దర్శకత్వంలో రూపొందించిన 'ముత్యాల పల్లకి ' చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు . ఇందులో జయసుధ కథానాయిక. ఆ తరువాత సంవత్సరం 1977లో దర్శకుడు మృణాల్ సేన్ తెలుగులో నిర్మించిన 'ఒక ఊరి కథ ' సినిమాలో ముఖ్యమైన పాత్రకు ఎంపిక చేశారు . ఏ .పరంధామ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో నారాయణరావుకు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత నారాయణ రావు తాను నటించే సినిమాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటూ నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకతను
సంపాదించుకున్నాడు. 100 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించాడు . టెలి విజన్ సీరియల్స్ కూడా నారాయణ రావు నటించాడు .
నారాయణ రావు 1953 అక్టోబర్ 9న గుళ్ళపల్లి వెంకట దుర్గాప్రసాద్ రావు ,శ్రీమతి దమయంతి దంపతులకు నాల్గవ సంతానంగా కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించాడు . నారాయణ రావుకు భవాని ,రవీంద్రనాథ్ , రామ్ ప్రసాద్ ముగ్గురు సోదరులు, లలిత అనే సోదరి ఉన్నారు .
నారాయణ రావు తండ్రి దుర్గా ప్రసాద్ రావు చాలాకాలం హైదరాబాద్ లోని శ్రీ సారధీ స్టూడియోస్ కు రెసిడెంట్ డైరెక్టర్ గా వున్నారు .
భవాని చార్టెడ్ అకౌంటెంట్ , దర్శకుడు వి. మధుసూదన రావు అల్లుడు , రవీంద్రనాథ్ , నిర్మాత , దర్శకుడు బి .నరసింగ రావు తో కలసి
'మా భూమి ' చిత్రాన్ని నిర్మించాడు . రామ్ ప్రసాద్ గుంతకల్ లో సినిమా పంపిణీ సంస్థను నడిపేవారు .
1984లో నారాయణ రావు ఎస్ .ఏ .చంద్ర శేఖర్ ( తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తండ్రి ) దర్శకత్వంలో చిరంజీవి, విజయ శాంతి తో 'దేవాంతకుడు' సినిమాను నిర్మించాడు . ఇది ఘన విజయం సాధించింది . 1985లో ఎస్ .ఏ .చంద్రశేఖర్ దర్శకత్వంలోనే 'ఇంటికో రుద్రమ్మ' సినిమా రూపొందించాడు . ఈ సినిమాలో భాను చందర్ ,సుమలత, సుజాత , శారద నటించారు . 1988లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో చిరంజీవి ,విజయ శాంతి, రాధతో 'యముడికి మొగుడు' చిత్రాన్ని తన మిత్రులు సుధాకర్ , హరి ప్రసాద్ తో కలసి నారాయణ రావు నిర్మించాడు . 1992లో పి .ఎన్ .రామ చంద్ర రావు దర్శకత్వంలో నరేష్ , దివ్యవాణి జంటగా 'పెళ్లి నీకు శుభం నాకు' సినిమాను నారాయణ రావు నిర్మించాడు .
నారాయణ రావు భార్య పేరు అనురాధ , వారికి ఒక కుమారుడు, కుమార్తె వున్నారు. నారాయణ రావు భార్య అనురాధ తన కుమారుడితో పాటు ఉంటున్నారు. నారాయణ రావు మాత్రం ఒక్కడే ఉంటున్నాడు . గత కొంతకాలంగా ఆయన అనారోగ్యతో బాధపడుతున్నాడు . బుధవారం సాయంత్రం ఆయన శ్వాస తీసుకున్నారు .
విలక్షణ నటుడుగా , అభిరుచికల నిర్మాతగా నారాయణ రావు ఎప్పటికీ గుర్తుండిపోతారు .
- కళారత్న భగీరథ , సీనియర్ జర్నలిస్ట్.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి