శేషేంద్ర శర్మ గారితో మధుర స్మృతి 

ఈరోజు గుంటూరు శేషేంద్ర శర్మ గారి శత జయంతి .

శర్మ గారు తెలుగు సాహిత్యంలో అరుదైన కవి. తెలుగు , సంస్కృత , ఆంగ్ల భాషల్లో ప్రతిభావంతుడు .

శర్మ గారు ముత్యాలముగ్గు సినిమాలో ' నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది ' అనే పాత దర్శకుడు బాబు కోరితో వ్రాశారు .

ఆ తరువాత శర్మ గారు మారె సినిమాలోనూ వ్రాయలేదు . 

నేను జ్యోతి చిత్ర లో  రిపోర్టర్ గా పనిచేటప్పుడు సీనియర్ జర్నలిస్ట్ ఆంజనేయ శాస్త్రి తో కలసి కార్యక్రమాలకు వెడుతూ ఉండేవాడిని .  అలా ఒకరోజు సాహిత్య క్రార్యక్రమంలో శేషేంద్ర శర్మ గారు పరిచయం అయ్యారు . శర్మ గారు మా ఇద్దరినీ నాంపల్లి కి సమీపంలోని గోషామహల్ లోని  జ్ఞాన్ బాగ్ ప్యాలెస్ కు రమ్మని ఆహ్వానించారు. 

శర్మ గారు , వారి శ్రీమతి ఇందిరాదేవి , సాయంత్రాలు కవులను వారి నివాసానికి ఆహ్వానించి సాహిత్య చర్చలు , కవితా గానం వినడం  అలవాటు అని నేను విన్నాను . ఆంజనేయ శాస్త్రి గారితో నేను రాసిన కవిత్యం వినిపిస్తాను అని చెప్పగానే , 'ఓఎస్ , తీసుకురా' అన్నాడు .

ఆరోజు సాయంత్రం ఇద్దరం జ్ఞాన్ బాగ్ ప్యాలెస్ కు వెళ్ళాము . శర్మ గారు మా ఇద్దరినీ ఆత్మీయంగా ఆహ్వానించారు . నాతో పాటు నా కవితలు కూడా తీసుకెళ్ళాను .

శర్మ గారు ఇందిరాదేవి గారిని పిలిచి మాకు పరిచయం చేశారు . 

ఆమె 'మీరు మాట్లాడుతూ ఉండండి టీ పంపిస్తాను' అని ఆమె లోపలకు వెళ్లారు .

నేను శాస్త్రి గారి వైపు చూశాను . 'శర్మ గారు భగీరథ కవిత్వం వ్రాస్తాడు . ఇతను  రాసిన మానవత కవితా పుస్తకం విడుదలైంది . 

మీకు మరో కవితా పుస్తకం లోని కవితలు వినిపిస్తాడట ' అని చెప్పారు . 

'అలాగా , తప్పకుండా 'అన్నారు శర్మ గారు ఉత్సాహంగా .

'శర్మ గారు, దీని పేరు అక్షరాంజలి , జీవాత్మ , పరమాత్మ గురించి ఒకే కవితంలో వ్రాశాను ' అని చెప్పాను .

'నిజమా , ఆసక్తిగా వుందే , చదవండి ' అన్నారు . 

నేను చదవడం మొదలు పెట్టాను .

"ఎంత వింత ?

భవ్య దివ్య నవ్యానుభవం 

ఎంత అపూర్వం 

చిత్ర విచిత్ర చిద్విలాసం 

నింగి వంగి నేల  పొంగి 

ఒక్కటై విశ్వ వీణను 

శ్రుతి చేసే వేళ 

వయ్యారి తార అందాల రేడును 

వలపు కౌగిలి కావ్యానించే  వేళ 

సృష్టి కాంత పెదవులపై 

రవి రస ద్రుష్టి రేఖ వెలిగే వేళ 

నీ కళ్ళ లోగిళ్ళలో 

అనంత తేజస్సు చూస్తాను 

ఆ తేజో మార్గం మీద 

నన్ను నీలోకి నడచి రమ్మంటావు 

అనూహ్య , అసంభవ ,అనితర సాధ్యం 

అఖిలాండ , బ్రహ్మాండ , అద్భుత లోకం 

ఎలా చేరాను?

నన్ను శిలువ వేసినట్టుగా 

నా కాళ్ళు నా ఆజ్ఞను పాటించడం లేదు 

నా మనసులో ఆరాటం 

నా తనువులో పోరాటం 

నా కళ్ళు కాళ్లయితే 

నీ పిలుపుకు అందే వాడినేమో 

నువ్వు ఎక్కుపెట్టి విడిచిన 

శబ్దాన్ని నేను 

నిన్ను మళ్ళీ చేరలేని క్షణాన్ని నేను."


శర్మ గారు చాలా శ్రద్ధగా విని ' మీ కవితా శైలి అమోఘం ' అని నాకు షైక్ హ్యాండ్ ఇచ్చారు .

ఇది నేను వ్రాసే కావ్యంలోని ఒక కవిత అని చెప్పాను .

"భగీరథ గారు  మీ అక్షరాంజలి లో మీరు చేసిన ప్రయోగం కూడా నాకు నచ్చింది , దీనికి నేను ముందు మాట వ్రాస్తాను " అని చెప్పారు .

అయితే శర్మ గారితో నేను ముందు మాట వ్రాయించుకోలేక పోయాను . వారు జీవించి ఉండగా నేను  అక్షరాంజలి పుస్తకం ప్రచురించలేదు . 2015లో అక్షరాంజలి కావ్యం వెలుగు చూసింది.

శర్మ గారిని వారి శత జయంతి  సందర్భంగా స్మరించుకుంటూ !


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు