అక్కినేనిలో మరో కోణం
ఈరోజు పద్మవిభూషణ్, నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారి 103వ జయంతి.
తెలుగు సినిమా రంగంలో అక్కినేని నాగేశ్వర రావు గారిది ఓ స్ఫూర్తినిచ్చే జీవితం.
కృష్ణా జిల్లా రామాపురం లో 1924 సెప్టెంబర్ 20న అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు ఐదుగురు సోదరుల్లో చిన్నవాడుగా జన్మించాడు. ప్రాధమిక విద్య తరువాత నాటకాల్లో నటిస్తున్న అక్కినేనిని చూసిన ఘంటసాల బలరామయ్య సినిమాల్లోని ఆహ్వానించాడు.
1944 లో మొదటి సినిమా "శ్రీ సీతారామ జననం" నుంచి 2014లో "మనం" వరకు అంటే 70 సంవత్సరాల పాటు ఆయన నట ప్రస్థానం సాగింది. చివరి శ్వాస వరకు ఆయన నటిస్తూనే వున్నారు . తెలుగు , తమిళ , హిందీ భాషల్లో 255 చిత్రాల్లో నటించారు.
1955లో అక్కినేని నటించిన "రోజులు మారాయి " సినిమా 100 రోజుల వేడుక సికిందరాబాద్ లోని రాజేశ్వరి థియేటర్లో జరిగింది.
ఈ సినిమా లో అక్కినేని తో పాటు షావుకారు జానకి ,సి .ఎస్ .ఆర్, రేలంగి నటించారు . తాపీ చాణిక్య దర్శకుడు . ఈ సినిమా ద్వారానే వహీదా రెహ్మాన్ పరిచయమయ్యారు . ఈ చిత్ర శత దినోత్సవానికి అప్పటి హైదరాబాద్ స్టేట్ ఎక్సైజ్,
కస్టమ్స్, మరియు అటవీ శాఖ మంత్రి కె .వి. రంగారెడ్డి గారు , పౌర సంబంధాలు, వ్యవసాయ శాకా మంత్రి మర్రి చెన్నా రెడ్డి గారు అతిధులుగా వచ్చారు . హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ , సహకారాలు అందిస్తామని , తెలుగు సినిమా మద్రాసు నుంచి తరలి రావాలని వారు అక్కినేని , ఆ చిత్ర నిర్మాత సి .వి. ఆర్. ప్రసాద్ , అక్కినేని గురువు దుక్కిపాటి మధుసూదన రావు కు విజ్ఞప్తి చేశారు . ఆ మరుసటి సంవత్సరమే నిర్మాత యార్లగడ్డ రామ కృష్ణ ప్రసాద్ హైదరాబాద్ అమీర్ పేట లో స్థలం కొని స్టూడియో నిర్మాణం చేపట్టారు . అదే సారధి స్టూడియోస్. ఆ తరువాత సంవత్సరమే హైదరాబాద్ స్టేట్ . ఆంధ్ర విలీనమై ఆంధ్ర ప్రదేశ్ గా ఏర్పడింది .
1963లో దుక్కిపాటి మధుసూదన రావు తన మకాం ను మద్రాసు నుంచి హైద్రాబాద్ కు మార్చారు . 1964లో అక్కినేని నాగేశ్వర రావు కూడా మద్రాస్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు . అదే సంవత్సరం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులను ప్రవేశ పెట్టింది . ఆంధ్ర ప్రదేశ్ లో చిత్రాలు నిర్మించేవారికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తామని కూడా హామీ ఇచ్చింది .
1975లో బంజారాహిల్స్ లో అన్న పూర్ణ స్టూడియోస్ నిర్మించి స్వంత చిత్ర నిర్మాణం కూడా ప్రారంభించారు .
హైద్రాబాద్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందింది అంటే అది నాగేశ్వర రావు గారి ప్రయత్నం వల్లనే .
అక్కినేని నాగేశ్వర రావు గారితో జర్నలిస్టుగా నాకు ఎన్నో అనుభవాలు, అనుభూతులు వున్నాయి. అయితే జర్నలిస్టుగా నా తొలినాటి అనుభవాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తాను .
1977లో నేను 'వెండితెర' అనే సినిమా వార పత్రికలో రిపోర్టర్ గా చేరాను . ఆ సంవత్సరం దివి సీమలో ఉప్పెన వచ్చింది. కనీవినీ ఎరుగని ఆ వరదల్లో వందలాది మంది చనిపోయారు , వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు . ఆపదలో వున్న ప్రజలను ఆదుకోడానికి ఎన్ .టి .ఆర్, ఏ .ఎన్ .ఆర్ కలసి విరాళాలు వసూలు చెయ్యడానికి నిర్ణయించారు . ఆ సందర్భంగా రామకృష్ణ స్టూడియోస్ లో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ లోనే రామారావు గారు , నాగేశ్వర రావు గారితో మొదటిసారి పరిచయం ఏర్పడింది.
1979లో ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వారపత్రికలో చేరాను. అప్పటి నుంచి నాగేశ్వర రావు గారిని , రామారావు గారిని తరచూ కలిసే అవకాశం ఏర్పడింది .
అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ సారధి స్టూడియోస్ లో సినిమా షూటింగులు ఎక్కువ జరిగేవి . అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్ళినప్పుడల్లా నాగేశ్వర రావు గారిని కలసి మాట్లాడేవాడిని. అందులో వారిని గురించి నేను వ్రాసిన ఆర్టికల్స్ , న్యూస్ చదివేవారు. కొన్నాళ్ళకు ఆయన నన్ను ప్రత్యేకంగా చూడటం , అభిమానించడం మొదలు పెట్టారు.
నాగేశ్వరరావు గారిని స్టడీ చేసి వారి మనస్తత్వాన్ని బట్టి, వారి మనసు నొప్పించకుండా , నాకు కావలసిన ఇంటర్వ్యూ లు చేస్తుండేవాడిని . అలా నాగేశ్వర రావు గారికి బాగా దగ్గరయ్యాను. జ్యోతి చిత్ర పాఠకుల ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇస్తే బాగుటుందని ఒకరోజు వారికి సూచించాను . రెండురోజుల రారువాత వారు ఫోన్ చేసి తన అంగీకారం తెలిపారు . ఆఆ వారం జ్యోతి చిత్ర లో ప్రకటన వచ్చింది .
1980లో ఈ శీర్షిక ప్రారంభమయ్యింది. అర్హమైనవి ఎంపిక చేసి వాటిని నా దగ్గరకు తీసుకొస్తే సమాధానాలు ఇస్తామని చెప్పారు.
విజయవాడ నుంచి ఉత్తరాలు హైదరాబాద్ పంపించారు. అప్పుడు నాగేశ్వర రావు గారు బంజారాహిల్స్ లో ఉండేవారు.
మా జ్యోతి చిత్ర కార్యాలయం సెక్రటేరియట్ ఎదురుగా మేడ మీద ఉండేది. ఎక్కడికి వెళ్లాలన్నా ఆటో లేదా రిక్షా లో వెళ్ళాల్చిందే. ఎందుకంటే నాకు వాహనం లేదు. బంజారా హిల్స్ అంటే తప్పనిసరిగా ఆటో మీద వెళ్ళాలి . ఆరోజుల్లో ఆటోలు వెంటనే దొరికేవి కాదు . ఒకవేళ దొరికినా బంజారా హిల్స్ అంటే వచ్చేవారు కాదు .
ఆరోజు నాగేశ్వర రావు గారు నాకు పలానా సమయానికి రమ్మని చెప్పారు . నాగేశ్వర రావు గారు చెప్పిన సమయానికి 20 నిముషాలు ఆలస్యంగా వారి ఇంటికి వెళ్ళాను . అప్పటికే వారు ఆఫీసులో కూర్చొని నా కోసం వేచి చూస్తున్నారు.
నేను హడావిడిగా లోపలకు వెళ్లి 'సారీ సర్ ' అని చెప్పాను.
" మీకసలు టైమ్ సెన్స్ ఉందా " మీ కోసం నేను 20 నిమిషాల నుంచి ఈ సీట్లో కూర్చున్నాను. నా టైమ్ వృధా చేశారు. జీవితంలో క్రమశిక్షణ , సమయ పాలన చాలా ముఖ్యం. ఆ రెండు ఉన్నవాడే పైకి వస్తాడు, విజయాలు సాధిస్తాడు." అని చాలా కటువుగా మాట్లాడారు .
ఆయన అలా మాట్లాడతారని నేను ఊహించలేదు .
ఆయన మాటలకు ఏమి సమాధానం చెప్పాలో తెలియలేదు. అప్పటికే గొంతు తడారిపోయింది.
అలా తల వంచుకొని మౌనంగా క్రిందకు చూస్తూ నుంచున్నాను. ఆ తరువాత కొంత సేపటికి ఆయన "సరే కూర్చోండి ". అన్నారు .
అప్పుడు సీట్లో కూర్చొని టేబుల్ మీద వున్న గ్లాస్ లో నీళ్లు తాగేశాను .
ఆయన నా అవస్థ చూసి 'ఇక ముందు సమయం పాటించండి ' అన్నారు .
'అలాగే సర్ ' అన్నాను.
కాలింగ్ బెల్ కొట్టి కుర్రాడు రాగానే ' రెండు కాఫీ తెచ్చిపెట్టు' అన్నారు.
కాఫీ తాగిన తరువాత "ఇక మొదలు పెడదామా ?" అన్నారు .
నేను 'అలాగే సర్ ' అన్నాను .
నేను ఉత్తరాలు నేను చదువుతుంటే , ఆయన సమాధానాలు చెబుతుంటే వ్రాసుకోవడం మొదలు పెట్టాను.
ప్రశ్నకు తగ్గట్టుగా ఆయన తనదైన పద్దతిలో సమాధానాలు చెప్పేవారు .
ఒక గంట తరువాత ఉత్తరాలు అన్నింటికీ సమాధానాలు ఇచ్చారు .
నేను నాగేశ్వర రావు గారి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మరోసారి సారీ చెప్పాను .
ఆ రోజు నాగేశ్వర రావు గారి నుంచి సమయం గురించి నేను నేర్చుకున్న తొలి పాఠం.
అప్పటి నుంచి ఎవరైనా పలానా సమయానికి రండి అంటే ఐదు నిముషాలు ముందే ఉండటం అలవాటు చేసుకున్నాను .
అక్కినేని నాగేశ్వర రావు గారు చెప్పిన ఆ మాటలు జీవితమంతా గుర్తున్నాయి.
ఆ తరువాత నాగేశ్వర రావు గారికి అత్యంత సిన్నిహితమైన జర్నలిస్టును కాగలిగాను.
చాలా సందర్భాల్లో వారి ఇంట్లో సాయంత్రాలు రమ్మని ఆహ్వానించేవారు. అక్కినేనితో ఎన్నో అనుభవాలు , అనుభూతులు , అన్నపూర్ణమ్మ గారు వడ్డిస్తుంటే వారితో కలసి భోజనం చేసిన మధుర స్మృతులు వున్నాయి . వారి ఇంట్లోనే మొదటిసారి దంపుడు బియ్యం అన్న తిన్నాను . నాగేశ్వర రావు గారి కుటుంబానికి ఏలూరు నుంచి వారి బావ మరిది కొడాలి వెంకటేశ్వర రావు దంపుడు బియ్యం పంపించేవారు .
అప్పటి నుంచి నాగేశ్వర రావు గారి కుటుంబంతో అనుబంధం ఏర్పడింది .
నేను 1980లో నా మొదటి కవితా సంపుటి "మానవత " కు ఒక కవిత వ్రాసి ఆశీర్వదించారు .
1987 లో మా వివాహానికి నాగేశ్వర రావు గారు దుక్కిపాటి మధుసూదన రావు గారు , దగ్గుబాటి రామానాయుడు గారితో వచ్చి మా దంపతులను ఆశీర్వదించారు. జూబిలీహిల్స్ జర్నలిస్టు కాలనీ లో నేను ఇల్లు కట్టుకున్నప్పుడు మా ఇంటికి వచ్చారు .
మా ఇద్దరు పిల్లలకు జూబిలీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో సీట్లు ఇప్పించారు.
నాగేశ్వర రావు గారితో ఎన్నో అనుభవాలు , ఆయన వ్యకిత్వం మీద ఓ పుస్తకం వ్రాయాలని , సమాచారం కూడా సేకరించాను .
నాగేశ్వర రావు గారిని నేను దగ్గరగా చూశాను కాబట్టి ఆయనలోని మరో కోణం గురించి వ్రాయాలనేది నా సంకల్పం .




కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి