ఆచార్యదేవో భవ ... !

ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం.  ప్రపంచవ్యాప్తంగా దీనిని  జరుపుకుంటున్నారు. 

1994లో యునెస్కో ఉపాధ్యాయ దినోత్సవాన్ని  ప్రకటించింది. అప్పటి నుంచి అన్ని దేశాలలోని వారు విద్య చెప్పిన గురువులను స్మరించుకుంటూ, వారు బోధించిన పాఠాలను గుర్తు చేసుకుంటూ, వారు చూపించిన మార్గంలో పయనించి విజేతలుగా నిలిచినవారు ఎందరో వున్నారు . 

ఆచార్యదేవో భవ అనేది మన సనాతన ధర్మంలో గురువుకు ఇచ్చే ఉన్నత స్థానం.

తల్లిదండ్రుల తర్వాత ప్రధాన స్థానం గురువుదే. 

నాకు చదువుతో పాటు సాహిత్యం లో కూడా ప్రోత్సహించిన ఇద్దరు గురువులను నేను ఎప్పటికీ మర్చిపోలేను .

ఒకరు పావులూరు ఉన్నత పాఠశాల లో 1969 నుంచి 1971 మధ్యలో ఎనిమిదవ తరగతి నుంచి పదవ తరగతి వరకు తెలుగు బోధించిన యాచమనేని మాధవరావు మాస్టారు.  మరొకరు ఆచార్య తిరుమల గారు , 1971 నుంచి 1973 వరకు ఇంటర్మీడియట్ లో తెలుగు బోధించిన మాష్టారు.



10వ తరగతిలో ఉండగా నేను కంద పర్యాయాలు వ్రాస్తే , మెచ్చుకొని , ఆ సంవత్సరం వ్యాస రచన పోలో గెలుపొందిన నాకు డాక్టర్ దివాకర్ల వేంకటావధాని గారు రచించిన 'ఆంధ్ర వాఙ్మయం చరిత్రం' అనే గ్రంథాన్ని మాధవరావు మాస్టారు నాకు బహూకరించి ఆశీర్వదించారు.

ఇక ఆచార్య తిరుమల గారు 1971 నుంచి 1973 వరకు హైదరాబాద్ తిలక్ నగర్ లో ఉన్న శ్రీమతి సత్యమ్మ నరసింహారావు స్మారక కళాశాల మాకు తెలుగు బోధించేవారు . మా క్లాస్ లో 94 మంది విద్యార్థులం ఉండేవాళ్ళం . నేను కవిత్వం వ్రాస్తాని తెలుసుకొని , నాతో కవితలు వ్రాయించి వాటిని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో చదివించారు . అంతేకాదు నన్ను ప్రత్యేకంగా అభిమానించేవారు .

ఇద్దరం చిక్కడపల్లిలో ఉండటం వాళ్ళ తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం. నను కవిత్వం వ్రాయమని పోతహించేవారు.

నేను 1977లో వెండితెర అనే సినిమావారే పత్రికలో చేరినప్పుడు ఎంతో సంతోషించారు .

1980లో నేను 'మానవత 'అనే కవితా సంకలనం తీసుకురావడానికి ప్రధాన కారకులు . ఆ పుస్తక సభ జూన్ 1వ తేదీన అశోక్ నగర్ గ్రంథాలయం లో జరిగింది . ఆ సభలో మహాకవి శ్రీ శ్రీ ,అప్పటి హైకోర్టు న్యాయమూర్తి  శ్రీ ఆవుల సాంబశివ రావు, నిర్మాత, దర్శకులు శ్రీ  పి . పుల్లయ్య గారు , నిర్మాత, దర్శకులు శ్రీ యు .విశ్వేశ్వర రావు గారు , ఆంధ్ర భూమి న్యూస్ ఎడిటర్ శ్రీ జి .ఎస్. వరదాచారి, హై కోర్ట్ న్యాయవాది శ్రీ అడుసుమిల్లి పాండురంగారావుతో పాటు గురువు శ్రీ ఆచార్య తిరుమల గారు  పాల్గొన్నారు . తన శిష్యుడు రచించిన'మానవత 'కావ్యానికి  శ్రీ శ్రీ ముందుమాట వ్రాసి ఆవిష్కరించడం చూసి   తిరుమలగారు పొందిన సంతోషం మాటల్లో చెప్పలేను .2005లో నా కథల సంపుటికి 'మెట్టింటి గడప ' అన్న నామకరణం చెయ్యడమే కాదు , నేను ఊహించని విధంగా ముందు మాట వ్రాశారు . అందులో చివరగా గురులకు శిష్యులు పుత్రులు పరమార్ధం లోక ధర్మపథమిది"  కదా,  పుత్రాదిచ్చేత్ పరాజయం" అనుకుంటూ .. అని ముగించారు. 


అది చూసి "అదేమిటి గురువు గారు, అలా వ్రాశారు ?" అని అడిగాను .

"అది నీపట్ల నాకున్న అభిప్రాయం " అన్నారు .

"అది నేను తీసివేస్తాను " అన్నాను .

"అయితే నీతో నేను మాట్లాడాను ... మన అనుబంధం కట్ " అన్నారు .

తిరుమల మాష్టారు అభిమానానికి , ఆత్మీయతకు నా కళ్ళు చెమర్చాయి .

ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భగా  మాధవరావు మాష్టారు , ఆచార్య తిరుమల మాస్టారు ను స్మరించుకుంటూ ...! 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు