నిరుపమానమైన ప్రేమసందేశం ‘నాగలాదేవి’


ఆధునిక తెలుగు సాహిత్యంలో చారిత్రక సాహిత్యం ఒక పెద్దభాగమే. అందులో చారిత్రక నవలలు ఒక అంతర్భాగం. 1872 నాటి గోపాలకృష్ణమ శెట్టి “శ్రీరంగరాజ చరిత్ర” మొదలుకొని ఇటీవలి మారుతీ పౌరోహితం ప్రణయ హంపి దాకా తెలుగు చారిత్రక నవలలది ఒక పెద్ద ప్రవాహం. ఈనవలలన్నీ సంఘసంస్కరణోద్యమ కాలం నుండి అస్తిత్వ ఉద్యమాల దాకా  సామాజిక పరిణామాలకు స్పందనలుగానే వచ్చాయి. తొలినాళ్ళ చారిత్రక నవలల్లో గతస్మరణ వర్తమానానికి ప్రేరణగా వచ్చాయి. తర్వాతి కాలంలో వచ్చిన చారిత్రక నవలలు చరిత్రను హేతుబద్ధంగా వ్యాఖ్యానించేవి కొన్నైతే, ఆధునిక ప్రగతిశీల పరిణామాలను అడ్డుకుని, తిరిగి భూస్వామ్య విలువలకు పట్టం కట్టేవి మరికొన్ని. భగీరథ రచించిన నవల,” నాగలాదేవి”  మొదటి రకం నవల.

చారిత్రకనవలలో వస్తువు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పూర్వ, మధ్యయుగచరిత్ర, రెండు ఆధునిక యుగం పూర్వ చరిత్ర. “అడవి శాంతిశ్రీ” వంటివి మొదటి రకం కాగా ,” రేనాటి వీరుడు” వంటివి రెండవరకం. “నాగలాదేవి” మొదటి రకం నవల. ఇది మధ్యయుగం ఆఖరి దశలో శ్రీకృష్ణ దేవరాయలు  (క్రీ.శ.16 శ)జీవితం వస్తువుగా వచ్చిన నవల. విజయనగరసామ్రాజ్యపాలనకు ప్రతీక అయిన శ్రీకృష్ణ దేవరాయలు, నాగలాదేవి ప్రేమ జీవితం ఈనవలలో వస్తువు. రాజకీయ చరిత్ర చట్రంలో భగీరథ ఈ ప్రేమకథను నవలీకరించారు. దాదాపు 19 సంవత్సరాలు పరిశోధన చేసి ఈ నవల రాశారు భగీరథ.హంపి శిథిలాలను  చూడడంతో మొదలైన ఆయన అన్వేషణ, చరిత్ర, శాసనాలు, సాహిత్యం వంటివి అధ్యయనం చేసి ఈనవల రాశారు. 

శ్రీకృష్ణ దేవరాయలు రెండవభార్య చిన్నా దేవి అసలుపేరు నాగలాదేవి. వివాహమైన తర్వాత ఆమె చిన్నా దేవి అయింది. నాగలాదేవి వేశ్యకూతురు. నిజానికి నాగలాదేవి తల్లి రూపవల్లి వేశ్య కాదు. ఒక సంపన్నుని వల్ల  మోసపోయిందామె. అతనెవరో ఆమెకుతప్ప నాగలాదేవికి కూడా తెలియదు. నాగలాదేవి అద్భుతమైన నృత్య కళాకారిణి. రాయలు గొప్పవీరుడు. సామ్రాజ్య నిర్మాత. అదేసమయంలో ఆయన కళా ప్రియుడు, స్వయంగా కవి. నాగలాదేవి  నృత్యం చూసే రాయలు ఆమెను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఎదురైన అడ్డంకులను ఇద్దరూ అధిగమించారు.

చారిత్రక నవల అనగానే ఒకనాటి రాజకీయాలు, రాజకీయ సంబంధాలు, అప్పటి ప్రజాపాలన, అప్పటి యుద్ధాలు, రాజ్యం నిర్మాణం వంటివి చిత్రింపబడటం సహజం, అనివార్యం. భగీరథ గారు వీటినన్నిటినీ ఈ నవలలో చిత్రించారు. వాటికోసం కొన్ని అధ్యాయాలే కేటాయించారు. విజయనగర రాజుల రాజకీయాలు, వాళ్ళ హత్యాకాండ (తాళ్ళపాక అన్నమయ్య “వెరతు వెరతునేనిది” అంటూ ఈసడించుకున్నారు).  ఈ నవలలో అవి ఒక పార్శ్వం. అయితే ఇప్పటి మన సమాజానికి అవసరమైనది ఆ రాజకీయాలు కాదు. యుద్ధకాండ కాదు.ఈనవలలో మనకు కావలసింది రెండోపార్శ్వం. అదే కులాంతర, ప్రేమవివాహం. ఎందుకంటే ఇవాళ పరువు హత్యల రుతువు సాగుతున్నది.ప్రేమించుకుని కులాతీత వివాహాలు చేసుకున్న యువకులను ఆధిపత్య కులాల వాళ్ళు పరువు పేరుతో చంపేస్తున్నారు. పెళ్ళి చేసుకుని బతకవలసినవాళ్ళకు లేని కుల పిచ్చి, వాళ్ళ పెద్దవాళ్ళకు పట్టుకుంది. ఇదంతా భూస్వామ్య వ్యవస్థ అవశేషాల మృత్యుహేల. ఈ నేపథ్యంలో కుల/ వర్ణ వ్యవస్థ  సంకరం  జరగకుండా చూడాల్సిన రాజే స్వయంగా  ఒక సామాన్య స్త్రీని కులాతీతంగా పెళ్ళాడినట్లు నవల రాయడం వర్తమాన ఆధిపత్యవర్గం మీద రచయిత  మొట్టికాయ వేయడమే. పరువు వ్యాధి పీడితులు ఈనవల చదివి పరివర్తన చెందితే సామాజిక విప్లవం వేగం పుంజుకుంటుంది. నన్నయ్య  రాజులను “మనుమార్గగాములు” అన్నారు. రాయలు ఆ తానులో పోగే . ఆయన కూడానన్నయ్య భాషలో మనుమార్గగాముడే కావాలి.. కానీ రచయిత ఆయన పాత్రను ఆధునీకరించారు. ఇందుకు ఆయనకు చారిత్రక ఆధారాలు ఉండవచ్చు.  ఆయన రాయలు కులం కంచెలు తెగగొట్టినట్లు  చెప్పారు.

       ఈనవల చదువుతుంటే మనకు గురజాడ కవిత” లవణరాజుకల” గుర్తుకు వస్తుంది. అందులో ఒక రాజు ఒక మాల అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె సౌందర్యవతి, మంచిపాటకత్తె. ఆమె తన కులం తెలియకుండా తనను ప్రేమిస్తున్న రాజుకు తాను మాలెత అని తెలియజేస్తుంది. అప్పుడు రాజు వర్ణ వ్యవస్థను సమీక్షించి దానిని ఖండిస్తాడు. “ వర్ణధర్మమధర్మధర్మంబే” అని ప్రకటిస్తాడు. ఈ ప్రణాళిక వంటిదే “నాగలాదేవి” నవలలో కూడా కనిపిస్తుంది. రాయలు నాగలాదేవి నృత్యాన్ని చూసి ప్రేమిస్తాడు. వాళ్ళిద్దరిలో ప్రేమ అంకురించిన సమయానికి రాయలు రాకుమారుడని నాగలాదేవికీ, ఆమె వేశ్య కుమార్తె అని రాయలకు తెలియదు. రాయలు కృష్ణగా, ఆమె నాగలాదేవిగా మాట్లాడుకున్నారు. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకొనే  సమయంలో ఆయన రాకుమారుడని, ఆమె వేశ్య కుమార్తె అని పరస్పరం చెప్పుకుంటారు. తాను ప్రేమించినది రాకుమారుడినని తెలిసి నాగలాదేవి కలవరపడుతుంది. భయపడుతుంది. రాయలు వాళ్ళకు ధైర్యం చెబుతాడు. నమ్మకం కలిగిస్తాడు. రాయలు కూడా కొంత మధనపడతాడు. ఆఖరికి ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తాడు. మొదట తన ప్రేమ విషయం అప్పాజీ, కుటుంబం సభ్యులు వ్యతిరేకిస్తారు.అప్పటికి మౌనం వహించి, రాజుగా ప్రకటింప బడిన తర్వాత నాగలాదేవిని పెళ్ళిచేసుకుంటాడు.ఆ తర్వాత నాగలాదేవి అనేక పర్యాయాలు వివక్షను చవిచూసింది. రాయలు యుద్ధానికి పోయినప్పుడు నాగలాదేవి ప్రజాపాలన పర్యవేక్షిస్తుంది. తాఆమె రాయచూర్  యుద్ధంలో పాల్గొని విజయం సాధిస్తుంది. ఆఖరికి జబ్బుచేసి రాయలు చేతిలో కన్నుమూస్తుంది.

        రాయలు, నాగలాదేవి ప్రేమవివాహాన్ని భగీరథ ఒక ఉబుసుపోక ఆదర్శంగా, ఆవేశ చర్యగా చిత్రించలేదు. నాగలాదేవి తాను వేశ్యకుమార్తెనని చెప్పగానే రాయలు చాలా విచికిత్సకు గురయ్యాడు. 



“తాను ఆమెను పెళ్ళి చేసుకోగలడా?

తన కుటుంబం ఒప్పుకుంటుందా?

ఆమె లేకుండా తాను ఉండగలడా?

మనసులు కలిసిన తర్వాత ఈ కులాల అడ్డెందుకు?

వేశ్య కుటుంబంలోని స్త్రీని వివాహం చేసుకోకూడదా?

సరసానికి తప్ప సంసారానికి పనికిరాదా?

ఈ సంప్రదాయానికి చరమగీతం. పాడలేనా?”

ఇంత ఆలోచించి రాయలు ఒక నిర్ణయానికి వచ్చాడు.ఈ అంతర్మధనం తర్వాత శ్రీకాళహస్తిలో నాగలాదేవి నృత్య కార్యక్రమంలో కలుసుకొన్నప్పుడు “ నా దృష్టిలో అందరూ సమానం. మనిషికి కులంకన్నా గుణం ముఖ్యం”  (కులము కన్న మిగుల గుణము ప్రధానంబు - వేమన) ఆ తర్వాత రాయలు చంద్రగిరి నుండి హంపికిపోతూ నాగలాదేవితో తాను శ్రీకృష్ణ దేవరాయలని చెబుతాడు. ఆమె ఉలిక్కిపడింది. ఆయన ధైర్యం చెప్పాడు. 

నవల ప్రారంభంలోనే తిరుమలలో వేంకటేశ్వరుని దర్శనం చేసుకున్న యువకునికి (రాయలు) ఒక చెట్టుకింద ఒక బైరాగి (ఆయన తాళ్ళపాక అన్నమయ్య) తంబూర మీటుతూ

“ఏకులజుడైననేమి?

ఆకడ నాతడే హరినెరిగినోడు” 

అనే తత్వం పాడుతుంటాడు. అన్నమయ్య భక్తకవిగా అస్పృశ్యతను ఖండించి , మానవసమానతను, ఇంకా చెప్పాలంటే జీవసమానతను ప్రచారం చేశారు.నవలను ఇలా ప్రారంభించడమే రచయిత ఉద్దేశాన్ని సూచిస్తుంది.

నాగలాదేవి, రాయలు పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక, అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. పెళ్ళి నిశ్చయమైనాక, పెళ్ళి జరిగినాక నాగలాదేవి అనేక దశలలో వివక్షను ఎదుర్కొంది. రచయితకు దానిపట్ల తీవ్రమైన ఆవేదన కలిగింది. రాయలు తాను నాగలాదేవిని ప్రేమించానని చెప్పగానే అప్పాజీ ఆమె ఏసామంతరాజు కుమార్తె? అని అడుగుతాడు. రాయలు ఆమె రాచకన్య కాదనీ, వేశ్యకూతురనీ చెప్పాడు. అప్పాజీ ఆగ్రహోదగ్రుడై,తీవ్రంగా వ్యతిరేకించాడు. హిందూజాతి రాయలురాక కోసం ఎదురు చూస్తున్నదనీ, రాజ్యక్షేమంకోసం రాచకన్యను పెళ్ళాడాలని గట్టిగా చెప్పాడు. రాయలు అప్పటీకి తలవంచాడు. రాయలు కులాంతర వివాహానికి అప్పాజీ నుండే మొదటి అభ్యంతరం ఎదురైంది. అప్పటికి రాయలు రాజు కాలేదు. ఆ వెంటనే రాయలుకు తిరుమలదేవితో వివాహం జరిగింది. 

      రాయల కోసం  నాగలాదేవి హంపి వచ్చి  ఒక సత్రంలో దిగింది. ఆసమయంలో మంగయ్య అనే ఉద్యోగి ఆమెను మోహిస్తాడు. ఆమె చాచి చెంపదెబ్బ కొడుతుంది. ఆమె రౌద్రాకారం చూచి మంగయ్య పరారౌతాడు.

         ఒకరోజు  తిరుమల దేవి విరూపాక్ష ఆలయానికి వస్తుంది. నాగలాదేవికూడా అక్కడికి వస్తుంది. అక్కడి దేవాలయ గజరాజు మహారాణి మెడలో వేయాల్సిన పూలదండను నాగలాదేవి మెడలో వేస్తుంది. ఇది రచయిత రాయలు నాగలాదేవి వివాహసూచనకు కల్పించిన దైవికమార్గమని భావించాలి. ఈ సంఘటన తర్వాత మంగయ్య వచ్చి నాగలాదేవికి క్షమాపణ చెబుతాడు. మరొక నాడు నాగలాదేవి రాయలు పంపిన పల్లకిలో కొత్త ఇంటికి  చేరుకుంటుంది. వాళ్ళిద్దరూ తరచుగా  కలుసుకుంటున్నారు. ఆమె సందేహం పడుతుంది. ఆయన నమ్మకం కలిగిస్తాడు. ఆమె భయపడుతుంది.. ఆయన ధైర్యం చెబుతాడు.

 అప్పాజీ శ్రీకృష్ణ దేవరాయలను రాజుగా ప్రకటిస్తాడు. నాగలాదేవి సంతోషించింది. 1509, జూలై 26 న రాయలు సింహాసనం అధిష్టిస్తాడు.తర్వాత బీజాపూర్ సుల్తానుతో యుద్ధం చేసి విజయం సాధిస్తాడు. ఆ సందర్భంలో రాయలు నాగలాదేవి చిత్రపటం గీస్తుంటే చూసి అప్పాజీ మందలిస్తాడు. రాయలు మహామంత్రీ అని కోప్పడతాడు. రాయలు రాజు కాకముందు నాగలాదేవిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటానంటే అప్పాజీ వ్యతిరేకించాడు. అప్పుడు రాయలు మౌనం వహించాడు. రాయలు రాజైన తర్వాత అదే అభ్యంతరం చెప్పిన అప్పాజీ మీద రాయలు కోప్పడ్డాడు. ఇదీ తేడా. కోప్పడడమేకాదు,” మాకు అన్నికులాలూ సమానమే”అని గట్టిగా చెప్పాడు. ఆ తర్వాత రాయలు నాగలాదేవిని పెళ్ళాడాడు. ఆమె చిన్నాదేవి అయింది. ఆ సమయంలో ఆ పెళ్ళిని రాయలు తల్లి నాగాంబ, పినతల్లులు ఓబాంబ, తిప్పాంబలు, మొదటిభార్య తిరుమలదేవి ఆమోదించలేదు. అంతఃపురంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.తర్వాత తిరుమలదేవి రాజీపడి, నాగలాదేవిని స్వయంగా పెళ్ళి పీటలు మీదికి తీసుకువచ్చింది. తిమ్మరుసు కోపంగానే అలకపూనాడు.” రాజాజ్ఞ ధిక్కరించడానికి లేదు. అందుకే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశాడు”. రాయలు గురువు వ్యాసతీర్ద మాత్రం  ఆ పెళ్ళిని సాహసోపేతమైన విషయంగా భావించి “ సంస్కారశీలి రాయలు నేడు ఈ వివాహంద్వారా జాతికి ఒక మంచి సందేశాన్ని అందించాడు” అని ప్రశంసించాడు. 1510 జనవరి24 న రాయలు పట్టాభిషేకం జరిగింది. రాయలు చిన్నా దేవిని కుడివైపు, తిరుమల దేవిని ఎడమవైపు సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. చిన్నాదేవికి అంతఃపురంలో ప్రత్యేక మందిరం ఏర్పాటైంది. అయినప్పటికీ చిన్నాదేవికి వివక్ష తప్పలేదు. రాయలు పక్కన ఉన్నప్పుడు ఆమెను అందరూ గౌరవించేవారు. ఒంటరీగా ఉన్నప్పుడు ఎవరూ పట్టించుకునేవారు కారు. ఆమె అన్నింటినీ భరించింది.

       నాగలాదేవి పుట్టిన ఊరు హరిగంధాపురం. రాయలు  నాగలాదేవి పేరు స్థిరంగా నిలవాలని, ఆగ్రామంపేరును నాగలాపురం అని మార్చాడు. ఆమె పరవశించిపోయింది. వేద నారాయణస్వామి ఆలయాన్ని రాయలు ఆధునీకరించాడు. వ్యాసతీర్థ సంతోషించాడు. ఈ విషయం తెలిసి  నాగలాదేవి రాయలు కాళ్ళకు నమస్కరించింది. అప్పుడు రాయలు “ సమాజంలో కుల ముద్ర చెరిపేయాలన్నదే రాజుగా మా ఆకాంక్ష. మనిషి మనిషిగా బ్రతకాలితప్ప భేద భావాలు ఉండకూడదు. జాతి ఒకటిగా ముందుకు సాగాలితప్ప, కులాలుగా చీలి ఐక్యతను దెబ్బతీయకూడదు. అందుకే నిస్స్వార్థమైన, నిరుపమానమైన ప్రేమసందేశాన్ని జాతికి అందిస్తున్నా” అని ప్రకటించాడు .


 ఆ తర్వాత రాయలు యుద్ధాలలో ఉన్నపుడు చిన్నా దేవి ప్రజాపాలన నిర్వహించింది.  తాను స్వయంగా యుద్ధంలో పాల్గొన్నది. రాజ్యాన్ని కాపాడినందుకు రాయలు ఆమెను అభినందించాడు. అంతటి ప్రేమమూర్తి చిన్నాదేవిలో స్త్రీలకు అవమానం జరిగితే సహించని లక్షణం ఉంది. రాయలు గజపతులతో యుద్ధం చేసినప్పుడు, గజపతిభార్య పద్మావతినీ, కుమారుడు వీరభద్రగజపతినీ నిర్బంధించడాన్ని చిన్నా దేవి తప్పుబట్టింది. రాయలు అలా చేసి ఉండాల్సింది కాదని ఒప్పుకున్నాడు.

      ఈ నవల కులరహిత సమాజాన్ని ప్రతిపాదించింది. ప్రేమ వివాహాలను సమర్థించింది. సమాజంలో మార్పు రెండు రకాలుగా వస్తుంది. ఒకటి ప్రజలు సామాజిక పరివర్తన కోసం ఉద్యమించినప్పుడు, పాలకులు వాళ్ళ ఆకాంక్షను ఆమోదించి చర్యలు చేపట్టడం. రెండు పాలకులే సామాజిక పరివర్తనకు నడుం కట్టి , దానిని తమనుంచే మొదలుబెట్టడం. “నాగలాదేవి” నవల రెండోరకం నవల. మార్పు పాలకులు నుంచే రావాలని ఈనవల చెబుతుంది. రాజు తలచుకుంటే కులాన్ని తరిమికొట్టడం కష్టం కాదని ఈ నవల చెబుతుంది. సమాజంలో అవకాశం వస్తే  రాజ్యపాలన ఏకులంవారైనా బాగా చేయగలరని నాగలాదేవి ద్వారా రుజువు చేశారు రచయిత. రాజ్యాధికారం ఉంటే సమాజంలో మార్పులు తీసుకురావచ్చని కూడా ఈనవల రాయలు ద్వారా రుజువు చేసింది.  స్వాతంత్య్రానంతరం భారతీయ పాలకులు  కులనిర్మూలనను తమ సాంఘిక విధానంగా పెట్టుకోలేదు. కులనిర్మూలన స్వతంత్రానంతర భారతదేశం ఎజెండాలో లేకపోవడం పెద్ద లోపం. సెక్యులర్ అనేది ఉన్నా అమలు అంతగా జరగలేదు. కులాంతర వివాహం చేసుకున్న వారికి కొంత ఆర్థిక సహకారం అందించడం వరకే పరిమితం అయ్యారు. ఇప్పుడైనా కులనిర్మూలన రాజకీయ ఎజెండా కావాలి.

        రాజ్యం- మతం- కులం - ఈ మూడూ ఒకత్రయం. రాజ్యం ఈ రెంటినీ పోషిస్తే సమాజం ఇప్పుడున్నట్టు ఉంటుంది. ఆ రెంటినీ రాజ్యం నిర్మూలిస్తే దేశం “జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును” అన్నట్లుంటుంది. 



-రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి , 

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు