రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ఆశ్చర్యపోయారు
జ్ఞాని జైల్ సింగ్ మన దేశానికి ఏడవ రాష్ట్రపతి.
రాష్ట్రపతిగా జైలు సింగ్ జూలై 25, 1982 న పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
జనవరి రెండవ తేదీ 1987లో జైలు సింగ్ హైదరాబాద్ వచ్చారు .
వారు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో విమానం దిగినప్పుడు మా ఆంధ్ర జ్యోతి ఫోటోగ్రాఫర్ ఫోటో తీశాడు .
1986లో ఆంధ్ర జ్యోతి దిన పత్రిక హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమయ్యింది.
హైదరాబాద్ ఎడిషన్ లో మొదటి , చివరి పేజీ లో కలర్ ఫోటోలు ప్రచురించేవారు .
అప్పటికి మిగతా దిన పత్రికల్లో కలర్ ప్రవేశపెట్టలేదనుకున్నాను.
రాష్ట్రపతి జైలు సింగ్ హైదరాబాద్ వచ్చిన ఫోటోను ఆంధ్ర జ్యోతి చివరి పేజీ లో కలర్ లో ప్రచురించారు .
జనవరి 3వ తేదీన రాష్ట్రపతి జైలు సింగ్ తో రాజ్ భవన్ తేనీటి సమావేశం ఏర్పాటు చేశారు .
ఈ సమావేశానికి జర్నలిస్టులను ఆహ్వానించారు . ఆంధ్ర జ్యోతి స్టాఫ్ రిపోర్టర్ టి .ఉడయవర్లు నన్ను కూడా రమ్మన్నారు .
రాష్ట్రపతి సమావేశంలో అక్రిడిటేషన్ (accreditation ) కార్డు వున్న వారినే అనుమతిస్తారు.
నేను జ్యోతి చిత్ర సినిమా వార పత్రికలో పనిచేస్తున్నా , నాకు 1980 నుంచి ఆంధ్ర జ్యోతి రిపోర్టర్ గా అక్రిడిటేషన్ కార్డు ఉంది .
రాష్ట్రపతి తో సమావేశం అనగానే 'వస్తా 'అని చెప్పాను . ఇద్దరం ఆరోజు సాయంత్రం హైదరాబాద్ లోని రాజ్ భవన్ కు వెళ్ళాము .
రాష్ట్రపతి అందరి దగ్గరకు వెళ్ళినప్పుడు వారు పరిచయం చేసుకుంటున్నారు .
మా దగ్గరకు వచ్చినప్పుడు మేము పరిచయం చేసుకున్నాక , ఉడయవర్లు గారు తనతో తీసుకొచ్చిన ఆంధ్ర జ్యోతి దిన పత్రిక ఇచ్చి , అందులో చివరి పేజీ చూపించారు . అందులో రాష్ట్రపతి జైలు సింగ్ హైదరాబాద్ బేగం పెట్ ఎయిర్ పోర్ట్ లో దిగినప్పటి
కలర్ ఫోటో ప్రచురించారు . అది చూసి రాష్ట్రపతి ఆశ్చర్యపడి ' నా ఫోటో కలర్ లో వచ్చిందే ' అన్నారు .
అప్పుడు ఆయన ముఖం సంతోషం తో కనిపించింది .
మీరు చూస్తున్న ఆ ఫోటో 39 సంవత్సరాలనాటిది .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి