ఉత్తమ జర్నలిస్టుగా తొలి అవార్డు 

నేను ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడే జ్యోతి చిత్ర సినిమా వార పత్రికలో పనిచేస్తున్నప్పుడు చాలామంది సాంస్కృతిక సంస్థల వారితో పరిచయం ఉండేది .

హైద్రాబాద్లో సినీ గోయర్స్ అసోసియేషన్  సంస్థకు మంచి పేరుంది .

ఈ సంస్థ కార్యదర్శి బి.కిషన్ అంటే సినిమా రంగంలో తెలియని వారు వుండరు . శోభన్ బాబు గారికి కిషన్ అంటే ఎంతో అభిమానం .

అలాగే నాగేశ్వర రావు , రామారావు గారితో మంచి పరిచయాలు ఉండేవి . 

అప్పుడప్పుడు సినిమా జర్నలిస్టులను ఆహ్వానించి ఫతే మైదాన్ క్లబ్ లో పార్టీలు ఇచ్చేవాడు .

ఫతే మైదాన్ క్లబ్ లో చికెన్ , మటన్ బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం . అందుకే కిషన్ పిలవగానే ఏడు గంటలకు ఆ క్లబ్ కు వెళ్ళేవాళ్ళం . అలా కిషన్ ఆత్మీయుడయ్యారు .

సినీ గోయర్స్ సంస్థకు అధ్యక్షుడు జి .ఎస్. వరదాచారి గారు. ఫిలిం క్రిటిక్స్ అస్సోసియేన్ కు వరదాచారి గారు అధ్యక్షుడుగా , నేను కార్యదర్శిగా మూడు పర్యాయాలు పనిచేశాము . నా గురించి వరదాచారి గారికి బాగా తెలుసు . 

ఈ  సంస్థ సినిమాకు సంబంధించిన  కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేది. ముఖ్యంగా సినిమా అవార్డులను ప్రదానం చేసేవారు . 

ఒకరోజు కిషన్ ఫోన్ చేసి " భగీరథ భాయ్ ఈ సంవత్సరం ఉత్తమ జర్నలిస్టుగా నిన్ను కమిటీ ఎంపిక చేసింది " అని చెప్పాడు .

ఆ మాట విని నేను ఆశ్చర్యపోయాను . "నన్నా " అన్నాను .

"అవును నిన్నే ... వరదాచారి సర్ చెప్పమన్నాడు " అన్నాడు . 

"థాంక్ యు కిషన్ భాయ్ " అని చెప్పాను. 

1992 సంవత్సరం సినిమా అవార్డుల్లో ఉత్తమ జర్నలిస్టుగా నేను ఎంపికయ్యాను . ఇది నాకు తొలి అవార్డు . 

ఆ సంవత్సరం సినిమా అవార్డుల కార్యక్రమం తెలుగు లలిత కళాతోరణంలో జరిగింది .

 ఈ కార్యక్రమానికి అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ . బంగారప్ప ముఖ్య అతిథిగా హాజరై సినిమా  అవార్డులను ప్రదానం చేశారు .


అప్పటి ముఖ్య మంత్రి బంగారప్ప గారి నుంచి నేను అవార్డు స్వీకరించాను .

మీరు చూస్తున్నది అప్పటి ఫోటోనే . 

34 సంవత్సరాలనాటి స్మృతి . 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు